Site icon HashtagU Telugu

TDP on Tadipatri Police: తాడిపత్రి పోలీసులపై మానవహక్కుల కమిషన్‌కు వర్ల రామయ్య లేఖ

Varla Ramiah

Varla Ramiah

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి పోలీసులు కూడా ప్రత్యర్థుల్లా తయారయ్యారన్న భావన నెలకొంది. అనేక సందర్భాలలో పోలీసుల తీరుపై పలు విమర్శలు వస్తున్నాయి. కుప్పంలో తమ కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేశారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు.

మరోపక్క అనంతపురం జిల్లా యాడికికి చెందిన ఆరుగురు బీసీ యువకులను తాడిపత్రి పోలీసులు కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య జాతీయ మానవహక్కుల కమిషన్‌‌కు లేఖ రాశారు. ఏపీలో పోలీసులు అధికార వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు. ఒక వర్గం పోలీసులు రాక్షసంగా మారి ప్రతిపక్షాలకు చెందిన నేతలను అర్ధరాత్రి అరెస్టులు చేయడమేకాక బెదిరింపులకు, చిత్రహింసలకు గురిచేస్తున్నారని వివరించారు.

అధికార పార్టీ మద్దతుదారులు బీసీ వర్గానికి చెందిన యాడికి యానిమేటర్‌ రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలిపారు. దీంతో వారి చర్యలను నిరసిస్తూ టీడీపీ మద్దతుదారులు ఆందోళనకు దిగినట్లు పేర్కొన్నారు. కానీ, వైసీపీ నాయకుల తప్పుడు ఫిర్యాదుతో పోలీసులు ఒక మహిళతో పాటు ఆరుగురు బీసీ యువకులను విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించినట్లు తెలిపారు. గుజ్జల ధనలక్ష్మి అనే మహిళను మినహాయించి మిగిలిన వారిని పోలీస్ స్టేషన్‌లో చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిపారు. తాడిపత్రి డీఎస్పీ చైతన్య ఫైబర్ లాఠీలతో బాధితులను చితకబాదినట్లు పేర్కొన్నారు. స్లాబ్ రాయిపై చేతి వేళ్లు పెట్టమని లాఠీతో వేళ్లపై కొట్టినట్లు తెలిపారు.

బాధితుల ప్రాథమిక హక్కులను హరించిన పోలీసులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో మానవహక్కుల ఉల్లంఘనలపై కమిషన్‌కు అనేక పర్యాయాలు ఫిర్యాదులు చేసినా పోలీసుల పనితీరులో ఎటువంటి మార్పు లేదని వర్ల రామయ్య తెలిపారు.

Exit mobile version