TDP-1983 : టీడీపీని వ‌ద‌ల‌ని 70+ బొమ్మాళి! జ‌న‌సేనాని చెప్పిందే..!!

`తెలుగుదేశం1983 బ్యాచ్‌ (TDP-1983)  క‌నుమ‌రుగ‌వుతుంది. అప్పుడు జ‌న‌సేన బ‌ల‌ప‌డుతుంది..`

  • Written By:
  • Updated On - February 9, 2023 / 01:06 PM IST

`తెలుగుదేశం పార్టీలోని 1983 బ్యాచ్‌ (TDP-1983)  2024 నాటికి క‌నుమ‌రుగ‌వుతుంది. అప్పుడు జ‌న‌సేన బ‌ల‌ప‌డుతుంది..` అంటూ ఒకానొక సంద‌ర్భంలో ఆ మ‌ధ్య‌ జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌. ఆనాడు(1983) ఎన్టీఆర్ త‌ర‌హాలో జ‌న‌సేన(Janasena)కు కొత్తత‌రం నాయ‌క‌త్వం వ‌స్తుంది. ఫ‌లితంగా రాజ్యాధికారాన్ని అందుకోగ‌ల‌మ‌ని అప్ప‌ట్లో ప‌వ‌న్ ఇచ్చిన దిశానిర్దేశం. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లకు భిన్నంగా ఇప్పుడు టీడీపీ క‌నిపిస్తోంది. 40ఏళ్ల‌కు పైగా రాజ‌కీయాల్లో ఉన్న లీడ‌ర్లు ప‌క్క‌కు త‌ప్పుకుంటూ వాళ్ల కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే టీడీపీ అంత‌టా క‌నిపిస్తున్నారు. దానికితోడు ఇత‌ర పార్టీల‌కు వెళ్లిన సీనియ‌ర్లు(కురువృద్ధులు) చంద్ర‌బాబు వైపు ఇప్పుడు చూస్తున్నారు.

తెలుగుదేశం పార్టీలోని 1983 బ్యాచ్‌ (TDP-1983) 

నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, మాజీ మంత్రి డాక్ట‌ర్ డీఎల్ ర‌వీంద్ర‌రెడ్డి, కేఈ కృష్ణ‌మూర్తి, య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, ప‌త్తిపాటి పుల్లారావు త‌దిత‌రులు అంద‌రూ ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానుంద‌ని గ్ర‌హించిన వెట‌ర‌న్ లీడ‌ర్లు(TDP-1983) పార్టీల‌కు అతీతంగా చంద్ర‌బాబు వైపు చూస్తున్నారు. ఇప్ప‌టికే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి(70+) టీడీపీ నుంచి రాబోవు ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అంతేకాదు, వైసీపీలోని 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో సీనియ‌ర్లంద‌రూ దాదాపుగా సైకిల్ ఎక్క‌డానికి మంత‌నాలు సాగిస్తున్నారు. వాళ్ల‌ను పంపేయ‌డానికి వైసీపీ ఇప్ప‌టికే రంగం సిద్దం చేసింది.

య‌న‌మ‌ల కుమార్తె దివ్య‌ను ఎన్నిక‌ల రంగంలోకి దించ‌డానికి..

తెలుగుదేశం పార్టీలోని సీనియ‌ర్లు(TDP-1983) వాళ్ల కుటుంబీకుల‌ను వార‌స‌త్వంగా దించేశారు. తాజాగా మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌క్రిష్ణుడు తూర్పు గోదావ‌రి జిల్లా తుని నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆక్ర‌మించేశారు. వ‌రుస‌గా ఓడిపోతూ వ‌స్తోన్న ఆయ‌న గ‌త రెండు ఎన్నిక‌ల్లో సోదరుడ్ని నిల‌బెట్టిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు. ఈసారి య‌న‌మ‌ల కుమార్తె దివ్య‌ను ఎన్నిక‌ల రంగంలోకి దించ‌డానికి సిద్ధమ‌య్యారు. ఆ మేర‌కు చంద్ర‌బాబునాయుడు నుంచి గ్రీన్ సిగ్న‌ల్ తీసుకున్నారు. ఇప్ప‌టికే య‌న‌మ‌ల కుటుంబం అంటేనే మండిప‌డుతోన్న తుని నియోజ‌క‌వ‌ర్గం ఓట‌ర్ల మ‌నోభావాల‌ను టీడీపీ అధిష్టానం గుర్తించ‌డంలేద‌ని పార్టీలోని అంత‌ర్గ‌త వ‌ర్గాల అభిప్రాయం.

Also Read : CBN-Jagan : TDP సానుభూతి మీడియా అత్యుత్సాహం, ప‌క్క‌లో బ‌ల్లెంలా JSP !

ప్ర‌తి జిల్లాలోనూ 1983 బ్యాచ్ నాయ‌కుల వార‌సుల‌తో టీడీపీ(TDP-1983) నిండిపోయింది. వాళ్ల‌కు తోడుగా ఇప్పుడు వైసీపీ, కాంగ్రెస్ కు చెందిన సీనియ‌ర్ల కుటుంబీకులు ప‌లువురు ఆశావ‌హులుగా ఉన్నారు. ఆ జాబితాలో ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి వార‌సుల్ని దింపాల‌ని యోచిస్తున్నారు. ఇప్ప‌టికే కేఈ బ్ర‌ద‌ర్స్ వార‌స‌త్వాన్ని ప్ర‌మోట్ చేస్తున్నారు. ఇక అనంత‌పురం నుంచి జేసీ బ్ర‌ద‌ర్స్ వార‌సులు రంగంలోకి దిగారు. మాజీ మంత్రులు అయ్య‌న్న కుమారుడు విజ‌య్ ఇప్ప‌టికే యాక్టివ్ గా టీడీపీలో ఉన్నారు. స్వ‌ర్గీయ యర్రంనాయుడు కుమారుడు రామ్మోహ‌న్ నాయుడు ఎంపీగా ప్ర‌స్తుతం ఉన్నారు. మాజీ స్పీక‌ర్ ప్ర‌తిభా భార‌తి కుమార్తె కావ‌లి గ్రీష్మ త‌దితరులు టీడీపీ వార‌స‌త్వ రాజ‌కీయాల‌ను న‌డ‌ప‌డానికి లైన్లో ఉన్నారు. వీళ్ల‌తో పాటుగా వైసీపీ నుంచి వ‌చ్చే సీనియ‌ర్ల వార‌సుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని చంద్ర‌బాబునాయుడు మీద ఒత్తిడి పెరుగుతోంది.

ప‌వ‌న్ కొత్తత‌రం రాజ‌కీయం జ‌న‌సేన (Janasena) 

ఉమ్మ‌డి రాష్ట్రం విడిపోయిన త‌రువాత జ‌రిగిన 2014 ఎన్నిక‌ల్లో సుమారు 30 మంది ఇత‌ర పార్టీ నాయ‌కుల‌ను చంద్ర‌బాబు తీసుకున్నారు. వాళ్ల‌కు దాదాపుగా అంద‌రికీ టిక్కెట్ల‌ను ఇవ్వ‌డం జ‌రిగింది. ఆ త‌రువాత వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల‌ను తీసుకుని కొంద‌రికి మంత్రి ప‌ద‌వుల‌ను చంద్రబాబు ఇచ్చారు. ఈసారి కూడా వైసీపీ నుంచి వ‌చ్చే సీనియ‌ర్ల కుటుంబీకుల‌కు, 1983 టీడీపీ బ్యాచ్ (TDP-1983)కుటుంబ స‌భ్యుల‌కు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read : Jagan-CBN : ముస‌లోడెవ‌రో తేల్చుకుందాం..రా.! ఏడుకొండలెక్కుతావా? ఛాలెంజ్!!

కొత్త మొఖాల‌ను రంగంలోకి దించ‌డానికి వైసీపీ సిద్ధ‌మ‌వుతోంది. యువ‌త‌రాన్ని, ఔత్సాహికుల‌ను ఎన్నిక‌ల బ‌రిలోకి దించాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. కనీసం 70 మంది సిట్టింగుల‌కు ఈసారి టిక్కెట్లు ఇవ్వ‌కుండా ప‌క్క‌కు త‌ప్పించాల‌ని చూస్తున్నార‌ని తాడేప‌ల్లి టాక్‌. వాళ్లంద‌రూ టీడీపీ, జ‌న‌సేన‌,(Jagansena) బీజేపీ వైపు చూస్తున్నార‌ని తెలుస్తోంది. తొలి ప్రాధాన్యం టీడీపీకి ఇస్తోన్న ఇత‌ర పార్టీ లీడ‌ర్లు నేరుగా చంద్ర‌బాబు, లోకేష్ ల‌కు ట‌చ్ లోకి వెళుతున్నార‌ట‌. దీంతో ప్ర‌స్తుతం ఉన్న లీడ‌ర్లలో ఆందోళ‌న మొద‌లైయింది. ఇలాంటి ప‌రిణామాల‌కు చెక్ పెట్టాల్సిన చంద్ర‌బాబు తాజాగా య‌న‌మ‌ల కుమార్తె దివ్య‌కు టిక్కెట్ ఇవ్వ‌డానికి సిద్ధ‌ప‌డ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బ‌హుశా ఇలాంటి వాటిని ముందుగానే గ్ర‌హించిన ప‌వ‌న్ (Janasena) కొత్తత‌రం రాజ‌కీయం జ‌న‌సేన నుంచి ఈసారి వ‌స్తుంద‌ని ఆనాడు(1983) ఎన్టీఆర్ త‌ర‌హాలో పోల్చుకుని చెప్పి ఉంటారు.