Site icon HashtagU Telugu

Block Traffic: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో హై అలర్ట్..!

Vadamalapeta Toll Plaza Incident

Vadamalapeta Toll Plaza Incident

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బోర్డర్ లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇప్పటికే అక్కడ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్వీపురం టోల్ ప్లాజా దగ్గర టోల్ ప్లాజా సిబ్బందికి, తమిళనాడుకి చెందిన కొంతమంది లా స్టూడెంట్స్ కు మధ్య గొడవ జరిగింది. ఇది ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.

తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్.వి.పురం టోల్ ప్లాజా వద్ద కొందరు విద్యార్థులు రెచ్చిపోయారు. పుత్తూరు ప్రైవేట్ కాలేజీలో లా చదువుతున్న తమిళనాడు విద్యార్థులు తిరుపతిలో గత కొద్దిరోజులుగా పరీక్షలు రాస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం నాడు పరీక్షల చివరి రోజు కావడంతో తిరుపతి నుంచి తిరుగు ప్రయాణంలో వడమాలపేట ఎస్‌వీ పురం టోల్ ప్లాజా వద్ద లా చదువుతున్న విద్యార్థి కారు టోల్ రుసుము చెల్లింపులో టోల్ యాజమాన్యం సిబ్బందితో గొడవ దిగారు. రుసుము చెల్లించడానికి ఆ వాహనానికి ఉన్న ఫాస్ట్ ట్యాగ్‌లో డబ్బులు లేనందున టోల్ సిబ్బంది వాహనాన్ని వెనక్కి తీసి మిగిలిన వారికి దారి వదలమని చెప్పారు.

దీంతో మాట మాట పెరిగి తమిళనాడు విద్యార్థులు మొదటగా టోల్‌ సిబ్బందిపై హెల్మెట్ తో దాడి చేశారు. రుసుము చెల్లింపు జరగకపోవడం గొడవకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఘటనా స్థలానికి చేరుకున్న వడమాలపేట ఎస్ఐ రామాంజనేయులు లా విద్యార్థులతో ముఖాముఖిగా జరిగిన సంఘటనపై కంప్లైంట్ ఇవ్వమని పబ్లిక్ వాహనాలకు ఇబ్బంది కలగకుండా పక్కకు రమ్మని చెప్పినప్పటికీ లా విద్యార్థులు మొండిగా వ్యవహరించడమే కాకుండా టోల్ ప్లాజా ప్రదేశంలోనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.