Site icon HashtagU Telugu

శ్రీవారి భ‌క్తుల‌కు శుభ‌వార్త .. అక్టోబ‌ర్ 1 నుంచి మెట్ల మార్గం ఓపెన్

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి మెట్ల మార్గం ద్వారా వెళ్ల‌డానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. రిల‌యెన్స్, టీటీడీ సంయుక్తంగా రూపొందించిన మెట్ల మార్గాన్ని భ‌క్తులు అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి ఉప‌యోగించుకోవ‌చ్చు. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా భ‌క్తుల‌కు ఒక‌టో తేదీ నుంచి ఈ మార్గాన్ని అందుబాబులోకి తీసుకొస్తున్నారు. మెట్ల మార్గాన్ని మ‌రింత ఆధునీక‌రించేందుకు రిల‌యెన్స్ సంస్థ‌కు టీటీడీ అప్ప‌గించింది. విరాళాల ద్వారా ఈ ఆధునీక‌ర‌ణ జ‌రుగుతోంద‌ని బోర్డు చెబుతోంది. గ‌త ఏడాది క‌రోనా కార‌ణంగా మెట్ల మార్గం ప‌నులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇప్పుడు తిరిగి వేగంగా ఆధునీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టారు. దాదాపు 7.6 కిలో మీట‌ర్లు మెట్ల మార్గానికి పైన క‌ప్పు ఏర్పాటు చేశారు. ఈవో, డిప్యూటీ ఈవోలు మెట్ల మార్గం ప‌నుల‌ను నిశితంగా ప‌రిశీలిస్తున్నారు. ఈ వారం తుది ప‌రిశీల‌న చేసిన త‌రువాత ఒక‌టో తేదీ నుంచి మెట్ల మార్గాన్ని భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతారు.
న‌డిచి వెళ్లే భ‌క్తుల‌కు గ‌తంలో మార్గ మ‌ధ్యంలో స‌ర్వ‌ద‌ర్శ‌నం టిక్కెట్లు జారీ చేసే వాళ్లు. ఇప్పుడు తిరిగి ఆ వెసుల‌బాటును ఇంకా పున‌రుద్ద‌రించ‌లేదు. ఒక వేళ అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి న‌డిచి వెళ్లే వాళ్ల‌కు మెట్ల మార్గాన్ని అందుబాటులోకి తెచ్చిన‌ప్ప‌టికీ టిక్కెట్ల జారీకి ఇంకా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. ఎవ‌రైతే స‌ర్వ‌ద‌ర్శ‌నం, బ్రేక్, 300 టిక్కెట్లు, సేవా టిక్కెట్ల‌ను పొందుతారో..వాళ్లు మాత్ర‌మే న‌డిచి వెళ్ల‌డానికి వీలుంది. మిగిలిన వాళ్ల‌కు ద‌ర్శ‌నం చేసుకునే వెసుల‌బాటు ఇంకా ఇవ్వ‌లేదు.
వార్షిక బ్ర‌హ్మెత్స‌వాల‌ను అక్టోబ‌ర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్ల‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చేస్తోంది. రెండేళ్ల త‌రువాత తిరిగి బ్ర‌హ్మోత్స‌వాల‌ను పెద్ద ఎత్తున చేయ‌డానికి సిద్ధం అవుతోంది. క‌రోనా కార‌ణంగా గ‌త రెండేళ్లుగా ఉత్స‌వాల‌ను భ‌క్తులు తిల‌కించుకోలేక‌పోయారు. ఈసారి పెద్ద సంఖ్య‌లో భ‌క్తుల‌కు అనుమ‌తి ఇవ్వ‌డానికి టీటీడీ సిద్ధం అయింది.