AgriGold : అగ్రిగోల్డ్ మోసానికి బలైన లక్షలాది బాధితులకు ఎట్టకేలకు శుభవార్త లభించింది. ఎంతో కాలంగా న్యాయపోరాటం చేస్తున్న బాధితులకు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఒక కీలకమైన విజయాన్ని అందించింది. ఇటీవల హైదరాబాద్‌లోని ప్రత్యేక పీఎంఎల్ఏ (ప్రివెంచన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) కోర్టు అగ్రిగోల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన రెస్ట్రిట్యూషన్ అప్లికేషన్‌కు ఆమోదం తెలిపింది. దీని ద్వారా రూ.1000 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు బాధితులకు అప్పగించేందుకు మార్గం ఏర్పడింది. ఈ పరిణామం పట్ల బాధితులు ఊరట వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా వారు న్యాయం కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. సుమారు 19 లక్షల మంది పెట్టుబడిదారులు అగ్రిగోల్డ్ కంపెనీ మోసపూరిత కార్యకలాపాల వల్ల తీవ్రంగా నష్టపోయారు.
Read Also: Russia Earthquake: రష్యాలో కురిల్ దీవుల్లో ఈ భూకంపం
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, బాధితుల నష్టాన్ని ఏ మేరకైనా పూడ్చేందుకు ఈడీ చర్యలు తీసుకోవడం ఎంతో ప్రాశస్త్యమైంది. తాజాగా అగ్రిగోల్డ్ గ్రూప్‌కు చెందిన రూ.611 కోట్ల విలువైన ఆస్తులను పునరుద్ధరించి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది. అప్పటి ఆస్తుల విలువ రూ.611 కోట్లు అయినప్పటికీ, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వాటి విలువ రూ.1000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. దీనితో బాధితులకు చెల్లింపుల ప్రక్రియ వేగంగా ముందుకు సాగేందుకు అవకాశం కలిగింది. ఇంతకు ముందు 2024 ఫిబ్రవరిలో ఈడీ సుమారు రూ.3,339 కోట్ల విలువైన ఆస్తులను బాధితులకు తిరిగి ఇవ్వడానికి చర్యలు చేపట్టింది. ఇప్పుడు తాజా ఆస్తులు కలిపి మొత్తం పునరుద్ధరించిన ఆస్తుల విలువ రూ.3,950 కోట్లకు చేరింది. మార్కెట్ ధర ప్రకారం వీటి విలువ రూ.7 వేల కోట్లకు పైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ఆస్తులలో మొత్తం 397 స్థిరాస్తులు ఉన్నాయి. వీటిలో 380 ఆస్తులు ఆంధ్రప్రదేశ్‌లో, 13 ఆస్తులు తెలంగాణలో, మరియు 4 కర్ణాటకలో ఉన్నాయి. వీటిలో వ్యవసాయ భూములు, నివాస ప్లాట్లు, వాణిజ్య స్థలాలు, అపార్ట్‌మెంట్లు వంటి రకరకాల ఆస్తులు ఉన్నాయి. ఈ తాజా నిర్ణయం వల్ల బాధితులకు న్యాయం అందే దిశగా గణనీయమైన అడుగు పడిందని, త్వరలోనే వారికి నష్టపరిహార చెల్లింపులు మొదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.