Site icon HashtagU Telugu

Subramanya Swamy : కోర్కెలు తీర్చే ఉలవపాడు స్వయంభూ నాగేంద్ర స్వామి

Subramnya

Subramnya

ప్రాచీన చరిత్రను శోధించినపుడు చోళ రాజుల కాలానికి చెందిన ఎంతో విశిష్టమైన దేవాలయాలు కనిపిస్తాయి. అలాంటి దేవస్థానాల్లో ఒకటైన స్వయంభు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం ఒకటి. ఈ ఆలయం నెల్లూరు NH 16 దక్షిణ బైపాస్ ఉలవపాడు లో ఉంది. ఉలవపాడు లో చోళులు పాలించిన కాలంలో స్వయంగా వెలసిన పవిత్ర స్థలం ఇది. ఇక్కడ స్వామి వారి పైన ఉన్న సూర్యుడు, చంద్రుడు, త్రిశూలం, స్వామి నాగ పడగ వంటి ఆధ్యాత్మిక చిహ్నాలు ఈ ఆలయ విశిష్టతను తెలియజేస్తాయి. స్వామివారు స్వయంభూ రూపంలో దర్శనమిస్తూ, శాశ్వతంగా ఆ స్థలంలోనే వెలిశారని భక్తుల నమ్మకం.ఈ ఆలయంలో ప్రతి ఆదివారం, మంగళవారం పంచామృత అభిషేకాలు అద్భుతంగా జరుగుతాయి.

ముఖ్యంగా ప్రతి నెలా వచ్చే కృత్తిక నక్షత్రం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ఈ పూజలు రాహు, కేతు దోషాలు, కుజ దోషం, నాగదోషం ఉన్న భక్తులకోసం ప్రత్యేకంగా జరుగుతాయి. ఇక్కడ ఐదు వారాల దీక్ష తీసుకొని ఆరవ వారంలో పంచామృత అభిషేకం చేయడం ద్వారా వారు భక్తితో కోరిన దోషాలను స్వామి తొలగిస్తారని నమ్మకం ఉంది. ఈ అనుభవాన్ని పొందిన భక్తులు, స్వామివారిని కలగనిపించుకున్నట్లు చెబుతారు. ఈ దేవస్థానానికి వచ్చే భక్తులు తమ కోరికలు తీర్చుకుంటారని, సంతాన లేమి, వివాహ సమస్యలు, దోష పరిహారాల కోసం చేసే అభిషేకం వలన 100% ఫలితం వస్తుందనే విశ్వాసం ఉంది. ఈ దేవాలయంలో శ్రీవల్లి దేవసేనలతో కలసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం కూడా వైభవంగా నిర్వహిస్తారు. ఒక్కసారి స్వామివారి దర్శనం పొందిన భక్తులకు, ఆయన స్వప్నంలో అదే రూపంలో దర్శనమిస్తారని, ఆ దివ్య దర్శనమే జీవితాన్ని మారుస్తుందనే విశ్వాసం భక్తుల హృదయాల్లో ఉంది. ఈ దేవస్థానం మహిమను తెలుసుకునేందుకు ఒకసారి అయినా దర్శనం చేయాలన్నది భక్తుల ఆకాంక్ష.