Key Witness Dead: వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షి గంగాధర్ రెడ్డి అనుమానస్పద మృతి

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ మర్డర్ కేసులో సాక్షిగా ఉన్న 49 ఏళ్ల కల్లూరి గంగాధర్ రెడ్డి.. అనుమానస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది.

  • Written By:
  • Publish Date - June 9, 2022 / 01:00 PM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ మర్డర్ కేసులో సాక్షిగా ఉన్న 49 ఏళ్ల కల్లూరి గంగాధర్ రెడ్డి.. అనుమానస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆయనది అనంతపురం జిల్లా యాడికి. తన ఇంట్లోనే ఆయన బుధవారం రాత్రి చనిపోయారు. ఆయన మృతికి సరైన కారణాలు తెలియకపోయినా.. కుటుంబ సభ్యులు చెప్పిన దానిని బట్టి చూస్తే అది అనుమానాస్పద మృతిగానే ఉంది.

నిద్ర సమయంలో గంగాధర్ రెడ్డి ప్రాణాలు కోల్పోయినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు విచారణ చేపట్టినా.. ఆయన మృతిపై ఆధారాలు లేకపోవడంతో కుటుంబ సభ్యుల కంప్లయింట్ ను ఆధారంగా చేసుకుని అనుమానస్పద మృతిగా కేసు ఫైల్ చేశారు. క్లూస్ టీమ్ ద్వారా పోలీసులు ఆధారాలను సేకరించడానికి ప్రయత్నించారు. గంగాధర్ రెడ్డి డెడ్ బాడీని తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డికి ప్రధాన అనుచరుడే గంగాధర్ రెడ్డి. ఆయన స్వస్థలం పులివెందులే. పదేళ్ల కిందట యాడికికి వలస పోయారు. ఆయన అసలు పేరు కల్లూరు గంగాధర్ రెడ్డి అయినా కువైట్ గంగాధర్ రెడ్డి గా పేరు. వివేకా మర్డర్ కేసులో అక్టోబర్ 2న సీబీఐకి వాంగ్మూలం కూడా ఇచ్చారు. వివేకా హత్య కేసును తనపై వేసుకుంటే.. శివశంకర్ రెడ్డి రూ.10 కోట్లు ఇస్తామన్నట్టుగా సీబీఐకి గంగాధర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. కానీ దీనికి సంబంధించి మెజిస్ట్రేట్ ముందు మాత్రం వాంగ్మూలం ఇవ్వనన్నాడు. కానీ ఆ తరువాత ఏం జరిగిందో ఏమో.. సీబీఐ అధికారులపైనే అనంతపురం ఎస్పీకి కంప్లయింట్ ఇచ్చారు.