Supreme Court : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది. 2022లో ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం ధర్మాసనం గురువారం కొట్టివేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ తుది తీర్పును ప్రకటించింది. పిటిషనర్ తన వాదనలో 2014లో అమలులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. ప్రత్యేకంగా జమ్మూకశ్మీర్‌లో తాజాగా చేపట్టిన డీలిమిటేషన్ ప్రక్రియను ప్రస్తావిస్తూ, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ నియోజకవర్గాల పునర్విభజన అవసరమని పిటిషన్‌లో పేర్కొన్నారు.
అయితే, సుప్రీంకోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. చట్టంలో స్పష్టంగా పేర్కొన్నట్లుగా, 2026లో నిర్వహించనున్న జన గణన అనంతరం మాత్రమే కొత్తగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రస్తుతం డీలిమిటేషన్ చేపట్టే అధికారం లేదని, సెక్షన్ 26లోని సూచనలను రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) పరిమితి చేస్తుందని పేర్కొంది.
ఇప్పుడే అనుమతిస్తే – వ్యాజ్యాల వరద
ఈ విషయంపై మరింతగా వ్యాఖ్యానించిన ధర్మాసనం, ఇలాంటి వ్యాజ్యాలను అనుమతిస్తే ఇతర రాష్ట్రాల నుంచి కూడా నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి పెద్ద సంఖ్యలో పిటిషన్లు వస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది గేట్లు తెరవడమే అవుతుంది. ఈ ప్రభావం అనేక రాష్ట్రాల్లో రాజకీయ మరియు పరిపాలనా అస్థిరతకు దారితీయొచ్చు అని ధర్మాసనం పేర్కొంది.
జమ్మూకశ్మీర్‌తో పోలికను తిరస్కరించిన ధర్మాసనం
పురుషోత్తం రెడ్డి తన పిటిషన్‌లో జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం డీలిమిటేషన్ చేపట్టిన తీరును ప్రస్తావిస్తూ, అదే న్యాయాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై ఎందుకు వర్తింపచేయరని ప్రశ్నించారు. అయితే, సుప్రీంకోర్టు ఈ వాదనను తిరస్కరిస్తూ, జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం కావడం వల్ల అక్కడ డీలిమిటేషన్ చేపట్టే విధానం వేరని స్పష్టం చేసింది. రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ మరియు నియోజకవర్గాల పునర్విభజన విధానాలు భిన్నంగా ఉంటాయని పేర్కొంది. జమ్మూకశ్మీర్‌లో చేపట్టిన డీలిమిటేషన్ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పోల్చడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని న్యాయస్థానం తేల్చింది.
ఏకపక్షత లేదు – వివక్ష లేదు
పిటిషనర్ చేసిన ఆరోపణల ప్రకారం జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడమంతా వివక్ష చూపినట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే దీనికి ధర్మాసనం స్పష్టంగా స్పందిస్తూ, ఏప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ప్రతి ప్రాంత పరిస్థితులు, చట్టపరమైన పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపింది. తుది తీర్పులో పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను పూర్తిగా కొట్టివేస్తూ, ప్రస్తుత దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనకు చట్టపరమైన అవకాశాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.