AP Capital : ఏపీకి ఈ ఏడాది న‌వంబ‌ర్ 1 `సుప్రీం`

ఇన్నేళ్ల పాటు వ‌చ్చిన న‌వంబ‌ర్ ఒక‌టే తేదీ ఒక ఎత్తు. ఈ ఏడాది వ‌చ్చిన న‌వంబ‌ర్ ఒక‌టో తేదీ ఏపీకి ప్ర‌త్యేకం.

  • Written By:
  • Publish Date - October 31, 2022 / 05:28 PM IST

ఇన్నేళ్ల పాటు వ‌చ్చిన న‌వంబ‌ర్ ఒక‌టే తేదీ ఒక ఎత్తు. ఈ ఏడాది వ‌చ్చిన న‌వంబ‌ర్ ఒక‌టో తేదీ ఏపీకి ప్ర‌త్యేకం. ఎందుకంటే, సుప్రీం కోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని వెలువ‌రించే రోజు ఈ ఏడాది న‌వంబ‌ర్ ఒక‌టో తేదీ. ఏపీకి రాజ‌ధాని అమ‌రావ‌తి ఒక్క‌టేనా? మూడు రాజ‌ధానులా? అనే విష‌యాన్ని సుప్రీం కోర్టు తేల్చ‌నుంది.

అమ‌రావ‌తి మాత్రమే ఏకైక రాజ‌ధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జ‌గ‌న్ స‌ర్కార్ సుప్రీం కోర్టులో స్పెష‌ల్ లీవ్ పిటిష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం విదిత‌మే. దానిపై న‌వంబ‌ర్ ఒక‌టో తేదీన సుప్రీం కోర్టు విచారించ‌నుంది. గ‌తంలో హైకోర్టులో తేల్చుకోవాలంటూ చెప్పిన అత్యున్న‌త న్యాయ‌స్థానం ఈసారి ప్రభుత్వం వేసిన స్పెష‌ల్ లీవ్ ప‌టిష‌న్ ను స్వీక‌రించింది. అంతేకాదు, హైకోర్టు డైరెక్ష‌న్ మేర‌కు జ‌గ‌న్ స‌ర్కార్ న‌డుచుకోవడంలేద‌ని స‌వాల్ చేస్తూ అమ‌రావ‌తి రైతులు సుప్రీం కోర్టులో పిటిష‌న్ వేశారు. అది కూడా న‌వంబ‌ర్ ఒక‌టో తేదీన విచార‌ణ‌కు రానుంది. ఫ‌లితంగా మూడు రాజ‌ధానులా? అమ‌రావ‌తి మాత్ర‌మేనా? అనే అంశాన్ని సుప్రీం కోర్టు తేల్చ‌నుంది. అందుకే ఈ ఏడాది న‌వంబ‌ర్ ఒక‌టో తేదీకి మున‌ప‌టి వాటికంటే ప్రాధాన్యం ఉంది.

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ అవ‌త‌ర‌ణ దినోత్స‌వం విష‌యంలో చంద్ర‌బాబు ఒక‌లా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి న‌వంబ‌ర్ ఒక‌టో తేదీని రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వంగా జ‌రుపుతున్నారు. ఉమ్మ‌డి ఏపీ ఉన్న‌ప్పుడు జ‌రిపిన ఉత్స‌వాల మాదిరిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ నిర్వ‌హిస్తోంది. ఏపీకి జ‌రిగిన అన్యాయాన్ని నిర‌సిస్తూ రాష్ట్ర విభన తర్వాత ఆనాడు అవతరణ దినోత్సవాన్ని చంద్ర‌బాబు అధికారికంగా నిర్వహించలేదు. తెలంగాణ ఏర్పాటైన జూన్ రెండో తేదీని కేసీఆర్ స‌ర్కార్ ఘనంగా వేడుకలు జరుపుతోంది. ఆ రోజును అపాయింటెడ్ డే గా ప్రకటించారు.

జూన్ రెండో తేదీ ఏపీకి జరిగిన నష్టానికి నిరసనగా నవనిర్మాణ దీక్ష ను చంద్ర‌బాబు ఐదేళ్ల పాటు నిర్వ‌హించారు. ప్ర‌తి ఏటా ఈ దీక్ష జూన్ 2 న ప్రారంభమై 8 వ తేదిన మహాసంకల్ప దీక్ష గా ముగించే ఆన‌వాయితీ కొన‌సాగింది. టీడీపీ స‌ర్కార్ బ‌దులుగా 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ స‌ర్కార్ వ‌చ్చింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా న‌వంబ‌ర్ ఒక‌టో తేదీన జరపాలని నిర్ణ‌యించింది. ఆ మేర‌కు జీవోను కూడా విడుదల చేసి మూడేళ్లుగా జ‌గ‌న్ స‌ర్కార్ వేడుక‌ల‌ను చేస్తోంది.

వాస్త‌వంగా 2014 లో ఉమ్మ‌డి ఏపీ విభజన తర్వాత నుంచి అధికారికంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్ణయించలేదు. అవతరణ దినోత్సవంపై తర్జన భర్జనలు జరుగుతున్న‌ప్ప‌టికీ కార్య‌రూపం దాల్చ‌లేదు. భాషా ప్ర‌యుక్త రాష్ట్రంగా ఏర్ప‌డిన ఏపీకి అవ‌త‌ర‌ణ దినోత్స‌వం న‌వంబ‌ర్ ఒక‌టో తేదీ. కానీ, ఇప్పుడు ఉమ్మ‌డి ఏపీ విడిపోవ‌డానికి ప్ర‌త్యేక‌వాదం కార‌ణం అయింది. ఆ సంద‌ర్భంగా స‌మైక్య నినాదాన్ని ఏపీ ప్ర‌జ‌లు వినిపించారు. అన్యాయంగా ఉమ్మ‌డి ఏపీని విడ‌దీశార‌ని అక్క‌డ జ‌నం క‌సిగా ఉన్నారు. అందుకే రాష్ట్రాన్ని విడ‌దీసిన కాంగ్రెస్ పార్టీకి నామ‌రూపాల్లేకుండా చేశారు.

ఉమ్మ‌డి ఏపీని విడ‌దీయ‌డం కార‌ణంగా జ‌రిగిన న‌ష్టాన్ని గుర్తు చేసుకుంటూ చంద్ర‌బాబునాయుడు సంక‌ల్ప దీక్ష‌లు పెట్టారు. న‌వ నిర్మాణం ఏపీలో జ‌రగాల‌ని ఆ రోజున యువ‌త‌కు సందేశం ఇచ్చేలా కార్య‌క్ర‌మాల‌ను రూపొందించారు. జూన్ 2వ తేదీ రాష్ట్రం విడిపోయిన రోజును నిర‌సిస్తూ యువత క‌సిగా ముందుకొచ్చే వాళ్లు. న‌వ నిర్మాణ దీక్ష‌ల్లో పాల్గొంటూ రాష్ట్రాన్ని తిరిగి నిర్మించుకోవాల‌ని సంక‌ల్పం చేసే ఆనవాయితీ కొన‌సాగింది. కానీ, జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత పాత తేదీని ఆంధ్ర‌ప్ర‌దేశ్ అవ‌త‌ర‌ణ దినోత్స‌వంగా జ‌రుపుతున్నారు. అయితే, ఈసారి న‌వంబ‌ర్ ఒక‌టో తేదీ విడిపోయిన ఏపీ భవిత‌వ్యాన్ని చెప్పే తీర్పు సుప్రీం నుంచి రాబోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు రాజ‌ధానులు, అమ‌రావ‌తి అంటూ రేగిన గంద‌ర‌గోళానికి తెర‌ప‌డ‌నుంద‌ని స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా చూస్తున్నారు.