Amaravati :అమ‌రావ‌తిపై జ‌న‌వ‌రి 31కి విచార‌ణ‌ వాయిదా

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌కు సుప్రీం కోర్టు ప‌రోక్షంగా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

  • Written By:
  • Updated On - November 29, 2022 / 03:56 PM IST

ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును త‌ప్పుబ‌డుతూ  సుప్రీం కోర్టు దానిపై మ‌ధ్యంత‌ర స్టే విధించింది. ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటీషన్లపై వాదోప‌వాదాల‌ను ఆల‌కించిన సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తులు కీలక వ్యాఖ్యలు చేశార‌ని తెలుస్తోంది. అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరించడం సరైంది కాదని, ఏ రాష్ట్రమైనా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే అధికారం, అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని వ్యాఖ్యానించ‌డం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వానికి ఊర‌ట క‌లిగిస్తోంది.

`మూడు’ రాజ‌ధానులు ముగిసిన అధ్యాయం
మూడు రాజ‌ధానుల అంశం ముగిసిన అధ్యాయ‌మ‌ని ఏపీ స‌ర్కార్ త‌ర‌పున మాజీ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్ సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు. హైకోర్టులో ప్రభుత్వం ఆ చట్టాన్ని ఉపసంహరించుకుంద‌ని తెలిపారు. ఆ చట్టం ఉనికిలోనే లేదని సుప్రీంకు వివ‌రించారు. హైకోర్టును తరలించే అంశం ముగిసిందని వేణుగోపాల్ సుప్రీం కోర్టుకు చెప్పారు. హైకోర్టు అమరావతిలోనే ఉండాలని ఉత్తర్వులు జారీ చేసినందున న్యాయమూర్తులు, సిబ్బందికి నివాస వసతిని ప్రభుత్వం కల్పించిందని వివ‌రించారు. అసలు హైకోర్టు ఎక్కడ ఉంటుందని సుప్రీం ప్రశ్నించిన స‌మ‌యంలో అమరావతిలోనే ఉంటుందని వేణుగోపాల్ స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. గడువుకు సంబంధించిన అంశాలపై మాత్రమే స్టే ఇస్తూ విచారణను సుప్రీం వాయిదా వేసింది.
అమ‌రావ‌తే రాజ‌ధాని
అమరావతిని రాజధానిగా తొలగించలేదు. ల్యాండ్‌ పూలింగ్‌ పథకంలో పేర్కొన్న ప్రయోజనాలకు మించిన లబ్ధిని వికేంద్రీకరణ చట్టంలో పొందుపరిచాం. రైతులకు నష్టం జరగదు. 29 వేల మంది రైతులు భూములు ఇచ్చారన్న కారణంగా ప్రణాళిక ప్రకారం మాస్టర్‌ప్లాన్‌ను అభివృద్ధి చేస్తాం. రైతులకు ఇచ్చే కౌలు మొత్తాన్ని, స్థల విస్తీర్ణాన్ని పెంచాం. అమరావతిలో రూ.15 వేల కోట్లను ఖర్చు చేయలేదు. 5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అమరావతి అభివృద్ధికి దాదాపు రూ. 2 లక్షల కోట్లు అవసరం. దీనికి 40-50 ఏళ్ల సమయం పట్టే అవకాశముంది.` అంటూ ప్రభుత్వ త‌ర‌పున అటార్నీజ‌న‌ర‌ల్ సుప్రీంకు వివ‌రించారు.

జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిష‌న్ పై విచార‌ణ చేసింది. ప్ర‌భుత్వం, పిటీషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్లు కేకే వేణుగోపాల్, శ్యామ్ దివాన్ తమ వాదనలను వినిపించారు. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు అయ్యేలా ఆదేశాలను జారీ చేయాలని అమ‌రావ‌తి రైతులు పిటిష‌న్లు దాఖ‌లు ప‌రిచారు. ఆయా పిటీషన్లన్నింటినీ క్రోడీకరించిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం వాదోవాదాలను ఆలకించింది. అభివృద్ధి ఎలా చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని ధ‌ర్మాస‌నం తేల్చ‌డం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ఊపిరిపీల్చుకుంది.

Also Read:  AP Debts : ఏపీ అప్పుల్లో ఇదీ నిజం! ఆర్బీఐ సంచ‌ల‌న నివేదిక‌!

ఆరు నెలల్లోగా రాజధానిని అభివృద్ధి చేయడం సాధ్యమేనా? అని వ్యాఖ్యానించింది. అనంతరం ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మధ్యంతర స్టే ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం మధ్యంతర స్టే ఇవ్వడాన్ని పిటీషనర్ల తరఫు న్యాయవాది శ్యామ్ దివాన్ వ్యతిరేకించారు. ఈ పిటీషన్లపై వాదనలను వచ్చే వారానికి వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను ధర్మాసనం స్వీకరించలేదు. జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది.