AP Liquor Scam : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన రూ. 3,200 కోట్ల విలువైన మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కె. రాజశేఖర్ రెడ్డి అరెస్టును సుప్రీంకోర్టు శుక్రవారం సమర్థించింది. రాజశేఖర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐటీ సలహాదారుగా పనిచేశారు. ఇటీవల ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అరెస్టు చేసింది. అయితే, తన అరెస్టు చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ జె.బి. పార్దివాలా నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. “పిటిషన్‌కు యోగ్యత లేదు” అంటూ పేర్కొన్న కోర్టు, రెడ్డికి రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపింది.
Read Also: Corona: కరోనా కలకలం.. ఏపీలో మరో కేసు నమోదు!
SIT దర్యాప్తు ప్రకారం, 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో మద్యం వ్యాపారంలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ప్రముఖ మద్యం బ్రాండ్లను తొలగించి, బ్లూ-ఐడ్ (ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్న) బ్రాండ్లను ప్రోత్సహించేందుకు రాజశేఖర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్టు వెల్లడైంది. డిస్టిలరీల నుండి మద్యం కొనుగోలు కోసం రూపొందించిన ఆటోమేటెడ్ వ్యవస్థను మార్చి, ప్రభుత్వ రిటైల్ అవుట్‌లెట్లలో నిర్దేశిత పరిమితికి మించి ఆర్డర్లు ఇచ్చారని SIT ఆరోపించింది. ఇది కేవలం పాలన తప్పిదం మాత్రమే కాదు, దురుద్దేశంతో రూపొందించిన ముళ్లదారి అని రిమాండ్ నివేదిక పేర్కొంది. చౌక బ్రాండ్ల కోసం రూ.150, మధ్యతరగతి బ్రాండ్లకు రూ.200, ప్రీమియం బ్రాండ్లకు రూ.600 చొప్పున కిక్‌బ్యాక్‌లు వసూలు చేసి, ఆ డబ్బు రాజశేఖర్ రెడ్డికి అందించారని, అనంతరం ఆయనే ఆయా మొత్తం వైయస్ఆర్సిపి నాయకులకు బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి.
ఇది మోసం, నేరపూరిత నమ్మకద్రోహం, అవినీతి, మనీలాండరింగ్‌ల మేళవింపుతో కూడిన కుట్ర గా SIT అభివర్ణించింది. ఈ కుంభకోణం వల్ల రాష్ట్ర ఖజానాకు, డిస్టిలరీలకు భారీ నష్టం వాటిల్లగా, ఎంపికైన వ్యక్తులు, డిస్టిలరీలు, సరఫరాదారులకు రూ. 3,200 కోట్లకు పైగా అక్రమ లాభం చేకూరినట్టు ఆరోపించారు. ఈ మొత్తం అక్టోబర్ 2019 నుంచి మార్చి 2024 మధ్యకాలంలో విజయవాడలోని ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) ద్వారా జరిగిన అనేక లావాదేవీలలో నమోదైందని రిమాండ్ నోట్‌లో వివరించారు. ఈ కేసు రాజకీయంగా, పరిపాలనా ప్రమాణాల పరంగా రాష్ట్రానికి తీవ్ర ప్రభావం చూపనుంది.