Minister Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆయన సిడ్నీలో ఆస్ట్రేలియా-ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్ జోడి మెక్ కేతో కీలక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆస్ట్రేలియాకు కీలకమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మలచాలని మంత్రి ఈ భేటీలో విజ్ఞప్తి చేశారు.
‘స్టేట్ ఎంగేజ్‌మెంట్ ఎజెండా’లో ఏపీని చేర్చండి
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. “కీలకమైన పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆస్ట్రేలియా-ఇండియా సీఈవో ఫోరం స్టేట్ ఎంగేజ్‌మెంట్ ఎజెండాలో చేర్చాలని” కోరారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఆస్ట్రేలియా పెట్టుబడులకు బలమైన వేదికను ఏర్పాటు చేస్తుందని ఆయన వివరించారు.
ఆస్ట్రేలియా-ఏపీ సీఈవో రౌండ్ టేబుల్‌కు మద్దతు
ఏపీఈడీబీ (APEDB), సీఐఐ (CII), బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా సంయుక్తంగా నిర్వహించనున్న ఆస్ట్రేలియా-ఏపీ సీఈవో రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతు ఇవ్వాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఎనర్జీ, ఓడరేవులు, లాజిస్టిక్స్, డిజిటల్ రంగాలలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ప్రాజెక్టులలో భాగస్వామ్యం వహించేలా ప్రముఖ ఆస్ట్రేలియన్ సీఈవోలకు రాష్ట్ర ప్రత్యేకతలను తెలియజేయాలని కోరారు.
Also Read: TTD Chairman: ఈ నెంబర్‌కు కాల్ చేయండి.. శ్రీవారి భక్తులకు టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి!
పెట్టుబడుల కారిడార్లలో భాగస్వామ్యం
“ఏపీలోని కృష్ణపట్నం, విశాఖపట్నం, అనంతపురం ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియన్ కంపెనీలు భాగస్వామ్యం వహించేలా సహకారం అందించాలని” మంత్రి లోకేష్ మెక్ కేని కోరారు. అలాగే ఫోరం వాణిజ్య, పెట్టుబడుల ఎజెండాలో “ఇన్వెస్టింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్- గేట్ వే ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా” అనే అంశంపై ఉమ్మడి నివేదికలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
‘పార్టనర్ షిప్ సమ్మిట్ – 2025’కు ఆహ్వానం
నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్- 2025కు ఫోరం నాయకత్వ బృందంతో కలసి తప్పక హాజరుకావాల్సిందిగా మంత్రి లోకేష్ మెక్ కేని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మెక్ కే మాట్లాడుతూ… ఆస్టేలియా- భారత్ నడుమ ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడానికి 2012లో ఇరుదేశాల ప్రధానమంత్రుల నేతృత్వంలో ఫోరంను ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య $48.4 బిలియన్ల వాణిజ్య భాగస్వామ్యానికి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. విధానపరమైన సహకారాన్ని సులభతరం చేసేందుకు సీఐఐతో కలిసి పనిచేస్తున్నట్లు మెక్ కే వెల్లడించారు. ఈ సమావేశం ఏపీకి ఆస్ట్రేలియా పెట్టుబడుల ద్వారాలను మరింత విస్తృతం చేస్తుందని భావిస్తున్నారు.