ఏపీలో అతి త్వరలో పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు (Lok Sabha & Assembly Election) రాబోతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ (YCP) తో పాటు అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో బిజీ అయ్యాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ అధినేత జగన్ ఈసారి అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలను ఈసారి పక్కకు పెట్టి కొత్త వారికీ ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ వస్తున్నారు. అంతే కాకుండా ఎమ్మెల్యే అభ్యర్థులను , ఎంపీ స్థానాలకు , ఎంపీ స్థానాల అభ్యర్థులను అసెంబ్లీ బరిలోకి దించుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో రాజమండ్రి (Rajahmundry ) నుండి సినీ నటుడు సుమన్ (Suman) ను ఎంపీ బరిలోకి దించాలనే ఆలోచన జగన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే YCP అగ్రనేతలు ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇక్కడ MPగా పోటీచేసిన మార్గాని భరత్ రానున్న ఎన్నికల్లో MLAగా పోటీచేస్తున్నారు. గౌడ సామాజికవర్గానికి చెందిన సుమన్ MPగా పోటీ చేస్తే BC ఓట్లు గంపగుత్తగా పడే ఛాన్స్ ఉంటుందని YCP భావన. పైగా 25 ఏళ్లుగా ‘స్వర్ణాంధ్ర’ పేరిట సుమన్ ఇక్కడ సామాజిక సేవ చేస్తున్నారు. ఇక అటు ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మంత్రి రోజా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఆమె పేరును రేపు లేదా ఎల్లుండి ఖరారు చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి జిల్లా నేతలకు సమాచారం ఇచ్చినట్లు టాక్. ఇంతకుముందు ఒంగోలు ఎంపీ స్థానానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును పార్టీ ప్రతిపాదించింది. కానీ మాజీ మంత్రి బాలినేని సహా జిల్లాలోని నాయకులంతా చెవిరెడ్డిని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో ప్రధానంగా వైసీపీ – టీడీపీ మధ్య జరిగిన పోరులో టీడీపీ నుంచి మురళీ మోహన్ సుమారు 1,67,434 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా… 2019లో జరిగిన వైసీపీ – టీడీపీ – జనసేన త్రిముఖ పోరులో వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ 1,21,634 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ దఫా… టీడీపీ – జనసేన కూటమిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో… పోరు హోరా హోరీగా ఉండొచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే జగన్ ఈసారి రాజమండ్రి నుండి సుమన్ ను దించాలని ఫిక్స్ అయ్యాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
Read Also : AP : కొడుకు కోసం రంగంలోకి దిగుతున్న విజయమ్మ..? మరి కూతురి సంగతి ఏంటి..?