Sujana Chowdary: సుజ‌నా చౌద‌రి `పీఛే`మూడ్‌?

తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవ‌డంతో బీజేపీలోకి వెళ్లిన పెద్ద‌ల టీమ్‌ మ‌ళ్లీ తెలుగుదేశం వైపు చూస్తోంద‌ని తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - September 18, 2022 / 08:33 AM IST

తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవ‌డంతో బీజేపీలోకి వెళ్లిన పెద్ద‌ల టీమ్‌ మ‌ళ్లీ తెలుగుదేశం వైపు చూస్తోంద‌ని తెలుస్తోంది. ఆ జాబితాలో ప్ర‌ధానంగా సుజ‌నాచౌద‌రి పేరు వినిపిస్తోంది. ఆయ‌న ఒక ప్రైవేటు ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చేసిన‌ వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. ఆ ఇంట‌ర్వ్యూలో, ఇప్ప‌టికీ చంద్ర‌బాబునాయుడును రాజ‌కీయ గురువుగా ఆయ‌న చెప్పుకున్నారు. అంతేకాదు, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కాపాడ‌క‌పోతే బీజేపీ నుంచి త‌ప్పుకుంటాన‌ని చెప్ప‌డం టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌గా మారింది.

టీడీపీ రాజ్య‌స‌భ్యులుగా ఉన్న సుజ‌నాచౌద‌రి, సీఎం ర‌మేష్‌, టీజీ వెంక‌టేష్‌, గ‌రిక‌పాటి మోహ‌న్ రావు అప్ప‌ట్లో ఉన్నారు. ఎన్డీయే-2 ఏర్ప‌డిన మ‌రుక్ష‌ణం ఆ న‌లుగురు రాజ్య‌స‌భ వేదిక‌గా టీడీపీని బీజేపీలోకి విలీనం చేశారు. రాజ్య‌స‌భ చైర్మ‌న్ గా ఉన్న వెంక‌య్య‌నాయుడు స‌మ‌క్షంలో ఇదంతా జ‌రగ‌డం గ‌మ‌నార్హం. ఆనాడు ఎందుకు పార్టీని బీజేపీలో విలీనం చేయాల్సి వ‌చ్చిందో వాళ్ల‌కే ఎరుక‌. కేసులు మాఫీ, అక్ర‌మ సంపాద‌న కాపాడుకోవ‌డానికి బీజేపీలోకి వెళ్లార‌ని ప్ర‌త్య‌ర్థ‌లు అప్ప‌ట్లో చేసిన‌ ఆరోప‌ణ‌లు. నిజం ఏమిటో చంద్ర‌బాబుకు, ఆ న‌లుగురికే తెలియాలి.

తెలుగుదేశం పార్టీలో నెంబ‌ర్ 2 స్థానాన్ని సుజ‌నాచౌద‌రి ఆక్ర‌మించారని 2019 ఎన్నిక‌లప్పుడు పార్టీలో చ‌ర్చ ఉండేది. కీల‌క నిర్ణ‌యాల్లో ఆయ‌న ముఖ్యుడ‌ని కూడా చెప్పుకునే వాళ్లు. ఆయ‌న‌కు తెలియ‌కుండా పార్టీలో ఏదీ జ‌ర‌గ‌ద‌ని పార్టీలో గుస‌గుస‌లు వినిపించేవి. నారా కుటుంబ స‌భ్యుడి మాదిరిగా ఉంటూ పార్టీలోనూ కీల‌క నిర్ణ‌యాల్లో ఉండే వార‌ని స‌న్నిహితులు చెవులు కొరుక్కున్న సంద‌ర్భాలు అనేకం. అంత‌టి ప్రాధాన్యం ఇచ్చిన టీడీపీని వ‌దిలేసి బీజేపీలోకి సుజ‌నా వెళ్లారు. పోరాటం చేయ‌లేక అనివార్యంగా బీజేపీలో చేరాడ‌ని టీడీపీలోకి ఒక గ్రూప్ చెప్పుకుంటోంది.

వ్యాపారాలపై సీబీఐ, ఈడీ దాడులు అప్ప‌టికే జ‌రిగాయి. నాన్ బెయిల‌బుల్ వారెంట్ల‌ను కూడా సుజ‌నా అందుకున్నారు. ఆ ఒత్తిడిని త‌ట్టుకోలేక బీజేపీలోకి వెళ్లార‌ని స‌ర్వ‌త్రా వినిపించే మాట‌. కానీ, తాను ఎవరినీ మోసం చేయలేదని, అందువల్ల ఈ ఆరోపణలను పెద్దగా ప‌ట్టించుకోన‌ని ఆ ఇంట‌ర్వ్యూలో చెప్ప‌డం గ‌మనార్హం.

ఆయ‌న ఇచ్చిన ఇంట‌ర్వ్యూను గ‌మ‌నిస్తే, తిరిగి టీడీపీలోకి రావ‌డానికి సిద్ధం అవుతున్నార‌ని టీడీపీలోని కొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. ఇప్ప‌టికే టీడీపీ దూకుడ‌గా వెళుతోంది. స‌ర్వేల్లోనూ పైచేయిగా ఉంటూ 2024 దిశ‌గా దూసుకెళుతోంది. తాజాగా చేసిన స‌ర్వేల్లో ఒంటరిగా టీడీపీ పోటీచేసిన‌ప్ప‌టికీ 2024లో అధికారం చంద్ర‌బాబుదే అంటూ ఫ‌లితాలు వ‌స్తున్నాయి. వీట‌న్నింటినీ గ‌మ‌నిస్తోన్న పాత‌కాపులు పునరాలోచ‌న‌లో ప‌డిన‌ట్టు ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

ప్ర‌స్తుతం మాజీ ఎంపీలుగా మారిన ఆ న‌లుగ‌రికి బీజేపీలోనూ పెద్ద‌గా ప్రాధాన్యం లేద‌ని తెలుస్తోంది. దీంతో తిరిగి టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వ‌డం ద్వారా చ‌క్రం తిప్పాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక వేళ చంద్ర‌బాబు వాళ్ల‌ను తిరిగి తీసుకుంటే పార్టీకి లాభ‌మా? న‌ష్ట‌మా ? అనేది భ‌విష్య‌త్ నిర్ణ‌యించాలి.