Sugali Preethi Case : సీబీఐకి సుగాలి ప్రీతి కేసు

Sugali Preethi Case : సుగాలి ప్రీతి తల్లి తమకు న్యాయం కావాలని కోరడంతో, కూటమి ప్రభుత్వం ఈ కేసును తిరిగి సీబీఐకి బదిలీ చేయాలని నిర్ణయించింది

Published By: HashtagU Telugu Desk
Sugali Preethi Case Cbi

Sugali Preethi Case Cbi

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసు(Sugali Preethi Case)ను రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి అప్పగించాలని నిర్ణయించింది. ఈ కేసును తిరిగి సీబీఐకి అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించినప్పటికీ దర్యాప్తు ముందుకు సాగలేదు. ఇటీవలే ప్రీతి తల్లి పార్వతి, కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కేసు దర్యాప్తులో కొత్త మలుపు తిప్పుతుందని భావిస్తున్నారు.

సుగాలి ప్రీతి కేసు నేపథ్యం

సుగాలి ప్రీతి కేసు 2017లో వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లాకు చెందిన సుగాలి ప్రీతి, నంద్యాలలోని ఒక ప్రైవేట్ స్కూల్ హాస్టల్‌లో ఫ్యాన్‌కు వేలాడుతూ మరణించినట్లు కనుగొన్నారు. ఆమె మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది ఆత్మహత్య కాదని, ఆమెపై లైంగిక దాడి చేసి హత్య చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. ఆ తర్వాత, 2019లో అప్పటి ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించింది. అయితే, 2024 ఫిబ్రవరిలో సీబీఐ దర్యాప్తులో పురోగతి సాధించలేకపోతున్నామని కోర్టుకు తెలిపింది.

తాజా పరిణామాల ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఈ కేసు గురించి ప్రీతి తల్లి పదే పదే ప్రస్తావించడం, ఆయన కూడా ఈ అంశంపై స్పందించడంతో ఈ కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. సుగాలి ప్రీతి తల్లి తమకు న్యాయం కావాలని కోరడంతో, కూటమి ప్రభుత్వం ఈ కేసును తిరిగి సీబీఐకి బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ చర్య వల్ల కేసు దర్యాప్తు వేగవంతమవుతుందని, బాధితులకు న్యాయం లభిస్తుందని ప్రీతి కుటుంబ సభ్యులు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  Last Updated: 02 Sep 2025, 08:50 PM IST