Site icon HashtagU Telugu

CBN Meetings : చంద్ర‌బాబు స‌భ‌ల స‌క్సెస్!`జ‌న సందోహం` సీక్రెట్

CBN meetings

Bapatla Babu

తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు(CBN) స‌భ‌ల‌కు జ‌నం పోటెత్తుతున్నారు. స‌భ‌లు ఎక్క‌డ పెట్టిన‌ప్ప‌టికీ ఆయ‌న‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఒక్కసారిగా ఎందుకు ఇంత మార్పు క‌నిపిస్తుంది? ఆయ‌న్ను చూడ్డానికి వ‌స్తున్నారా? స్పీచ్ విన‌డానికి త‌ర‌లివ‌స్తున్నారా? ప్ర‌జ‌ల‌కు(Public) క‌నువిప్పు క‌లిగిందా? చంద్ర‌బాబు(CBN) విజ‌న్ త‌ల‌కెక్కిందా? జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న మీద విసుగెత్తారా? ఇలాంటి ప్ర‌శ్న‌లు క‌ర్నూలు, ఉభ‌య గోదావ‌రి, పొన్నూరు, బాప‌ట్ల స‌భ‌ల‌ను చూసిన త‌రువాత రావ‌డం స‌హ‌జం. ఏపీలో ఏ ఇద్ద‌రు రాజ‌కీయాల గురించి మాట్లాడుకున్న‌ప్ప‌టికీ చంద్ర‌బాబు స‌భ‌ల్లో క‌నిపిస్తోన్న జ‌న‌సందోహం(Public) ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తోంది.

ఏపీ ప్ర‌జ‌లకు(public) చంద్ర‌బాబునాయుడు ఫేస్ తెలియ‌నిది కాదు. ఆయ‌న్ను గ‌త 50ఏళ్లుగా చూస్తున్నారు. సీఎంగా 15 ఏళ్ల పాటు ఉమ్మ‌డి, విడిపోయిన ఏపీలో చూశారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కునిగా ఉమ్మ‌డి ఏపీలో 10ఏళ్లు ఉన్నారు. ఇప్పుడు గ‌త మూడేళ్ల నుంచి చూస్తున్నారు. ప్ర‌తి గ్రామానికి తెలిసిన ఫేస్ ఆయ‌న‌ది. సుదీర్ఘంగా ఆయ‌న వినిపించే స్పీచ్ కూడా విన‌సొంపుగా ఉండ‌దు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్, తెలంగాణ సీఎం కేసీఆర్ త‌ర‌హాలో మిస్మ‌రైజ్ చేసే స్పీచ్ ఆయ‌న ఇవ్వ‌లేరు. ఆ విష‌యం ఆయ‌న‌కూ తెలుసు. కొన్ని సంద‌ర్భాల్లో బోరు కొట్టే స్పీచ్ ఇస్తార‌ని టీడీపీ శ్రేణుల్లోనే చ‌ర్చించుకుంటారు. అటు స్పీచ్ విన‌సొంపుగా ఉండ‌దు ఇటు పాత మొఖమే. పైగా వ‌య‌స్సు మీద ప‌డిన నాయ‌కునిగా వైసీపీ ప‌దేపదే ఎత్తిపొడుస్తోంది. మ‌రి, ఎందుకు ఆయ‌న స‌భ‌ల‌కు జ‌నం విర‌గ‌బ‌డుతున్నారు? ఇదే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

విజ‌న‌రీగా చంద్ర‌బాబునాయుడు

ఒక విజ‌న‌రీగా చంద్ర‌బాబునాయుడుకు ఉన్న‌ ట్రాక్ రికార్డ్ ను ఎవ‌రూ చెరిపేయ‌లేరు. ప్ర‌పంచ ప‌టంలో హైద‌రాబాద్ ను నిలిపిన మేధావి. పారిశ్రామిక అభివృద్ధిని ప‌రుగు పెట్టించడం ద్వారా ఉపాథి అవ‌కాశాల‌ను మెరుగుప‌రిచిన రాజ‌కీయ‌వేత్త‌. కంప్యూట‌ర్ మాట కూడా అంద‌రికీ తెలియ‌ని రోజుల్లో ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చిన గొప్పు విజ‌న‌రీ. ఆయన వేసిన ఐటీ బీజం ఇప్పుడు వృక్ష‌మై ఫ‌లాల‌ను మారుమూల గ్రామాల‌కు అందిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఆ ఫ‌లాల‌ను అనుభ‌విస్తున్నారు. ఏపీ ప్ర‌జ‌లు తెలంగాణ రాష్ట్రంలోని అభివృద్ధిని క‌ళ్లారా చూస్తున్నారు. బ‌హుశా 2019 లో చంద్ర‌బాబును ఓడించ‌డం ద్వారా రాష్ట్రాన్ని పాడుచేసుకున్నామ‌న్న ఆలోచ‌న ఏపీ ప్ర‌జ‌ల‌కు వ‌చ్చి ఉంటుంది. విడిపోయిన త‌రువాత ఏపీ సీఎంగా 2014 నుంచి 2019 వ‌ర‌కు చంద్ర‌బాబు ప‌రిపాల‌నను ప్ర‌జ‌లు చూశారు. ఆయ‌న త‌యారు చేసిన విజ‌న్ 2030, విజ‌న్ 2050 ఏపీ ప్ర‌జ‌ల క‌ళ్ల ముందు క‌దులుతుంటుంది. మూడున్న‌ర‌రేళ్ల జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న చూసిన తరువాత భ‌విష్య‌త్ త‌రాల‌కు రాష్ట్రాన్ని ప‌దిలంగా ఇవ్వాలంటే చంద్ర‌బాబు మాత్ర‌మే స‌మ‌ర్థ‌డ‌ని ప్ర‌జ‌లు భావించి ఉండాలి. లేదా ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న విసుగెత్తేలా ఉంద‌ని భావించి ఉండొచ్చు. ఇవేమీ కాకుంటే, ఇసుకేస్తే రాల‌నంత జ‌నం ఎందుకు వ‌స్తున్నారు? అనేది స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న పెద్ద ప్ర‌శ్న‌.

సాధార‌ణంగా బ‌హిరంగ స‌భ‌లు, రోడ్ షోల‌కు జ‌నాన్ని రాజ‌కీయ పార్టీలు త‌రలిస్తాయి. అధికారంలో ఉన్న పార్టీ. ప‌థ‌కాల ల‌బ్దిదారుల‌పై క‌త్తి పెట్టి బ‌లవంతంగా స‌భ‌ల‌కు తీసుకొస్తారు. ప్రస్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిలు, అధిష్టానం సైతం భారీగా డ‌బ్బు పెట్టే ప‌రిస్థితి లేదు. క్షేత్ర‌స్థాయిలో వైసీపీ ని ఎదుర్కొని నిల‌బ‌డేందుకు ధైర్యం చేయ‌డానికి సందేహిస్తోన్న టీడీపీ లీడ‌ర్లు ప‌లు చోట్ల‌ ఉన్నారు. క‌నీసం 30 నుంచి 40 చోట్ల ఢీ అంటే ఢీ అనే లీడ‌ర్లు టీడీపీకి లేర‌ని వైసీపీ భావిస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు స‌భ‌ల‌కు జ‌నం పెద్ద‌ ఎత్తున త‌ర‌లిరావ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏడాది క్రితం ఒంగోలులో జ‌రిగిన మ‌హానాడుకు జ‌నం విర‌గ‌బ‌డ్డారు. ఆనాటి నుంచి మినీ మ‌హానాడుల‌ను చంద్ర‌బాబు నిర్వ‌హిస్తున్నారు. కొన్ని చోట్ల మినీ మ‌హానాడులు పెద్ద‌గా క్లిక్ కాలేదు. కేవ‌లం చంద్ర‌బాబు వెళ్లిన చోట మాత్ర‌మే హిట్ అయ్యాయి. ఆ త‌రువాత `బాదుడే బాదుడు` కార్య‌క్ర‌మాలకు టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఆ సంద‌ర్భంగా కూడా చంద్ర‌బాబు వెళ్లిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ ప్రోగ్రామ్ బాగా విజ‌య‌వంతం అయింది. తాజాగా `ఇదేం ఖ‌ర్మ‌..మ‌న రాష్ట్రానికి` అనే పేరుతో త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.

ఇదేం ఖ‌ర్మ‌..మ‌న రాష్ట్రానికి`

తొలుత `ఇదేం ఖ‌ర్మ‌..మ‌న రాష్ట్రానికి` ప్రోగ్రామ్ ను క‌ర్నూలులో చంద్ర‌బాబునాయుడు ప్రారంభించారు. ఆ రోజున ఆయ‌న రోడ్ షోకు వ‌చ్చిన జ‌నాన్ని చూసి అక్క‌డి వైసీపీ ఇంచార్జిల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మార్చేసుకున్నారు. అంటే, ఎంతగా ఆ స‌భ హిట్ అయిందో వేరే చెప్ప‌న‌వ‌స‌రంలేదు. ఆ త‌రువాత ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో నిర్వ‌హించిన రోడ్ షోలు, బ‌హిరంగ స‌భ‌ల‌కు క‌ర్నూలును మించిన విధంగా ప్ర‌జ‌లు ఎగ‌బ‌డ్డారు. తాజాగా గుంటూరు జిల్లాలోని పొన్నూరు, బాప‌ట్ల‌లో జ‌రిగిన రోడ్ షోలు, బ‌హిరంగ స‌భ‌ల‌కు త‌ర‌లి వ‌చ్చిన జ‌నం చంద్ర‌బాబుకు బ్ర‌హ్మ‌రథం ప‌ట్టారు. జోరు వాన‌లో సైతం చంద్ర‌బాబు స్పీచ్ ను వింటూ జ‌నం కేరింత‌లు కొట్ట‌డాన్ని గ‌మ‌నిస్తే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి `మ‌రో ఛాన్స్` ప‌గ‌టిక‌ల కానుంద‌ని ఎవ‌రైనా అంచ‌నా వేయొచ్చు.