Site icon HashtagU Telugu

Tragedy : తిరుపతిలో పెను విషాదం.. హై వోల్టేజ్ రైల్వే విద్యుత్‌ వైర్లు తగిలి విద్యార్థి మృతి

Railway Tragedy

Railway Tragedy

Tragedy : తిరుపతిలో పెను విషాదం చోటుచేసుకుంది. మామండూరు రైల్వే స్టేషన్ సమీపంలో హై వోల్టేజ్ రైల్వే విద్యుత్ తీగలు తగిలి ఒక విద్యార్థి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మృతుడిని జాకేష్ డైరీ టెక్నాలజీ చదువుతున్న విద్యార్థిగా గుర్తించారు. రైలు పైకి ఎక్కడం వల్ల ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్‌ల పైన, రైళ్ల కదలికకు అవసరమైన అధిక వోల్టేజ్ విద్యుత్ వైర్లు ఉంటాయి. వాటికి చిన్నపాటి స్పర్శ తగిలినా ప్రాణాంతకం. దురదృష్టవశాత్తు, జాకేష్ రైలు పైకి ఎక్కిన సమయంలో ఈ విద్యుత్ తీగలు తగలడంతో తీవ్రమైన విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రైలుపైకి జాకేష్ ఎందుకు ఎక్కాడనే విషయంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సెల్ఫీలు తీసుకోవడం, సరదా కోసం రైళ్లపైకి ఎక్కడం వంటి ప్రమాదకరమైన పనులు యువతలో ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ఇది కూడా అలాంటి ప్రయత్నమేనా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో ఏమైనా ఆధారాలు లభించాయా అని పరిశీలిస్తున్నారు. జాకేష్ స్నేహితులు, కుటుంబ సభ్యులను విచారించి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

రైల్వే ట్రాక్‌లు, విద్యుత్ వైర్ల వద్ద అత్యంత అప్రమత్తంగా ఉండాలని రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా విద్యుత్ తీగలు దాదాపు 25,000 వోల్టుల విద్యుత్‌ను కలిగి ఉంటాయి. వీటిని తాకడం లేదా వాటికి దగ్గరగా వెళ్లడం ప్రాణాపాయం. జాకేష్ మృతితో అతని కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది.

TTD : మెట్ల మార్గంలో చిరుత కలకలం.. భక్తుల్లో ఆందోళన