Student Assembly : రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులు ఇక పుస్తకాలకే పరిమితమై ఉండకుండా, ప్రజాప్రతినిధులు చేసే విధంగా సమస్యలు చర్చిస్తూ, హక్కులు బాధ్యతలపై గళమెత్తేందుకు ప్రత్యేక వేదిక సిద్ధమైంది. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న అసెంబ్లీ ఆవరణలో నిర్వహించబోతున్న ‘స్టూడెంట్ అసెంబ్లీ’ కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. చిన్నారుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య వ్యవహారాలపై అవగాహన పెంపొందించాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా రూపొందించింది.
అసెంబ్లీ హాలుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక సెట్
మొదట విద్యార్థుల అసెంబ్లీని అసలు అసెంబ్లీ హాలులోనే నిర్వహించాలని భావించారు. అయితే అక్కడి నిబంధనల కారణంగా ఇతరులు కూర్చోవడం సాధ్యం కాకపోవడంతో, హాలుకు అచ్చం ప్రతిరూపంగా అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేకంగా ఒక మాక్ సెట్ నిర్మిస్తున్నారు. ఎమ్మెల్యేల సమావేశం జరిగేలా ఉన్న అన్ని సదుపాయాలు, ఆసన వ్యవస్థ, స్పీకర్ చైర్, ట్రెజరీ–ఓపోజిషన్ బ్లాక్స్ అన్నీ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం
26వ తేదీ ఉదయం 9 గంటలకు స్టూడెంట్ అసెంబ్లీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. పాల్గొన్న విద్యార్థుల్లో ఒకరు ప్రొటెం స్పీకర్‌గా సభను ప్రారంభిస్తారు. తరువాత సభా నియమావళి ప్రకారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క విద్యార్థి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తాడు. వారిలోనే అధికార, ప్రతిపక్ష సభ్యులను కూడా నామినేట్ చేస్తారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత స్థానాల్లో కూడా విద్యార్థులే కార్యక్రమాన్ని నడిపిస్తారు. అంతేకాక సెక్రటరీ జనరల్, మార్షల్స్ పాత్రలను కూడా విద్యార్థులే నిర్వర్తించనున్నారు.
ప్రశ్నోత్తరాల నుంచి బిల్లుల చర్చల వరకు
సాధారణ అసెంబ్లీ ఎలా జరుగుతుందో అచ్చం అదే విధంగా ఈ స్టూడెంట్ అసెంబ్లీ కొనసాగుతుంది. తొలి విడతలో ప్రశ్నోత్తరాలు. తరువాత జీరో అవర్. అనంతరం రెండు ముఖ్యమైన బిల్లులపై చర్చ. అవసరమైతే ఇతర ప్రజా సమస్యలపై ఆలోచనల మార్పిడి. సుమారు మూడు గంటలపాటు జరిగే ఈ విద్యార్థుల అసెంబ్లీని సీఎం చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. అంతేకాదు, ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ వీక్షించేందుకు ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తారు.
ఎంపికైన 175 మంది యువ ఎమ్మెల్యేలు
స్టూడెంట్ అసెంబ్లీ కోసం విద్యాశాఖ రాష్ట్రంలోని 8వ, 9వ, 10వ తరగతుల నుంచి 175 మంది విద్యార్థులను ఎన్నుకుంది. పాఠశాల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పలు దశల్లో నిర్వహించిన పోటీల ద్వారా మెరుగైన ప్రతిభ ఉన్న వారిని ఎంపిక చేశారు. సమానత్వం దృష్ట్యా అబ్బాయిలు–అమ్మాయిలు సమాన సంఖ్యలో ఉండేలా చూడడం జరిగింది. దేశంలోని జార్ఖండ్, రాజస్థాన్, హరియాణా, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే స్టూడెంట్ అసెంబ్లీ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అయితే ఆ రాష్ట్రాల కంటే మరింత పద్ధతుగా, అసెంబ్లీ అసలు కార్యకలాపాలను ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
విద్యార్థుల్లో నాయకత్వ వికాసం
ప్రజాస్వామ్య వ్యవస్థ, చట్టాల నిర్మాణ విధానం, ప్రజా సమస్యల పరిష్కార మార్గాలపై విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం. చిన్న వయసులోనే నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందడం, సమాజంపై బాధ్యతా భావం పెరుగుతుందని ప్రభుత్వం నమ్ముతోంది.
స్టూడెంట్ అసెంబ్లీ అనంతరం ప్రత్యేక సందర్శన
కార్యక్రమం ముగిసిన తరువాత విద్యార్థులను అసలు అసెంబ్లీ హాలుకు తీసుకెళ్లి అక్కడి పనితీరును సమీపంగా చూపించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గ్రూప్ ఫొటో కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
