Pawan Plan: బీజేపీని ఒప్పిస్తానని పవన్ చెప్పడం వెనక వ్యూహం ఏంటి?

పవన్ కల్యా్ణ్ ప్లాన్ ఏంటి? అభిమానులు, కార్యకర్తల మనోభావాలు ఎలా ఉన్నాయో జనసేనానికి తెలుసా? వైసీపీని ఓడించేందుకు బీజేపీని ఒప్పిస్తామంటున్నాడు.

  • Written By:
  • Publish Date - May 22, 2022 / 07:15 PM IST

పవన్ కల్యా్ణ్ ప్లాన్ ఏంటి? అభిమానులు, కార్యకర్తల మనోభావాలు ఎలా ఉన్నాయో జనసేనానికి తెలుసా? వైసీపీని ఓడించేందుకు బీజేపీని ఒప్పిస్తామంటున్నాడు. అసలు సీఎం సీటే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో పోరాడాలి తప్పితే.. మళ్లీ టీడీపీ కోసం పనిచేయడం ఏంటనే అభిప్రాయం జనసేన కార్యకర్తల నుంచి వినిపిప్తోంది. కాని, పవన్ మాత్రం ఈ విషయంలో సీరియస్ గానే ఉన్నారు. ఎందుకంటే, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. జనసేన పార్టీ అధినేతగా పవన్ ను విమర్శించలేదు… ఆయనను వ్యక్తిగతంగా తిట్టారు. బహుశా ఇది తట్టుకోలేకపోతున్నారు పవన్. అందుకే, ఏం చేసైనా, ఎంతటి త్యాగం చేసైనా సరే వైసీపీని గద్దె దించాలనే పంతంతో ఉన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదంటూ పదేపదే అనడం వెనక కారణం ఇదే.

వైసీపీని ఓడించాలంటే మధ్యలో బీజేపీ మద్దతు ఎందుకు? బీజేపీకి ఏపీలో ఏం బలం ఉందని? కమలాన్ని వదిలేసి సైకిల్ వెంట పడితే అనుకున్నది సాధించవచ్చుగా. ఈ ప్రశ్నలు సాధారణంగానే వినిపిస్తున్నాయి. వైసీపీని ఢీకొట్టాలంటే టీడీపీతో జట్టు సరిపోతుంది. కాని, ఎన్నికల ‘మేనేజ్’మెంట్లో గెలవాలంటే మాత్రం ఢిల్లీ సపోర్టు తప్పనిసరి. ఒకవేళ బీజేపీకి ఎదురుతిరిగి వెళ్లిపోతే.. బీజేపీ కాస్తా వైసీపీకి దగ్గరైతే.. పవన్ పడుతున్న కష్టం మొత్తం బూడిదలో పోసినట్టే.

ఎన్నికల ‘మేనేజ్’మెంట్లో కేంద్ర బీజేపీ గనక వైసీపీకి సహకరిస్తే మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుంది. అందుకే, బీజేపీని ఒప్పించి తీరతా అంటున్నారు తప్ప.. ఎవరొచ్చినా రాకపోయినా వెళ్తానని మాత్రం అనడం లేదు. మరోవైపు టీడీపీతో జట్టు కట్టాలంటే పెద్దపెద్ద కండీషన్లే పెట్టాలనుకుంటోంది బీజేపీ. ఉన్న సీట్లను సగం సగం పంచుకోవాలని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా
పవన్ ను నిలబెట్టాలనే కండీషన్ పెట్టాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి చంద్రబాబు ససేమిరా ఒప్పుకోరు. చంద్రబాబు ఒప్పుకున్నా కార్యకర్తలు అస్సలు ఒప్పుకోనివ్వరు. సో, ఈ త్రికోణ ప్రేమ కథ ఎలా సాగుతుందో చూడాలి.