Polavaram: ‘పోలవరం’ ఇంకెంత దూరం? నిధులు, డిజైన్ల ఖరారులో ఆలస్యం వెనుక మతలబేంటి?

పోలవరం. ఇది ఇంకా చాలా దూరంలో ఉంది. ప్రాజెక్ట్ అంతా అయిపోయినట్టే ఉంటుంది. కానీ అవ్వదు. కాకపోతే ఓ పది రోజుల్లో దీనిపై పెద్ద మీటింగ్ ఉంది.

  • Written By:
  • Publish Date - March 6, 2022 / 06:53 PM IST

పోలవరం. ఇది ఇంకా చాలా దూరంలో ఉంది. ప్రాజెక్ట్ అంతా అయిపోయినట్టే ఉంటుంది. కానీ అవ్వదు. కాకపోతే ఓ పది రోజుల్లో దీనిపై పెద్ద మీటింగ్ ఉంది. మరి ఆ భేటీలో ఏం తేలనుంది? కేంద్ర జలశక్తి సంఘం, పోలవరం ప్రాజెక్టు ప్రతినిథులు, రాష్ట్ర జలవనరుల శాఖ, పోలవరం అధికారులంతా ఈ మీటింగ్ లో పాల్గొంటారు. అందుకే ఆ సమావేశంలో ఏం చర్చిస్తారా.. ఏం నిర్ణయిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఈమధ్యే కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పోలవరాన్ని సందర్శించారు. అందుకే ఈ భేటీని ఏర్పాటుచేశారు. వీలైతే ఇదే నెల 14 లేదా 15న మీటింగ్ పెట్టడానికి నిర్ణయించుకున్నా.. ప్లేసు ఇంకా ఫిక్స్ కాలేదు. పోలవరం ప్రాజెక్టును వేగంగా నిర్మించాలని అన్ని వర్గాల నుంచీ వినతులు అందుతున్నా కేంద్రం దానికి పూర్తిస్థాయిల సహకారాన్ని అందించడం లేదు. ఎందుకంటే దీనికి నిధులతోపాటు, వెంటవెంటనే డిజైన్లు ఖరారు చేయడం కూడా జెట్ స్పీడ్ తో జలగాలి. వాస్తవంగా చూస్తే ఆ పరిస్థితి కనిపించడం లేదు.

ప్రాజెక్టు డిజైన్లు ఇచ్చేస్తే.. దాదాపు ఏడాదిలోగానే నిర్మాణాలూ పూర్తి చేస్తామంటోంది మేఘా సంస్థ. ఎందుకంటే పోలవరంలో ఇప్పుడు కీలక నిర్మాణం ఏదంటే.. ప్రధాన రాతి, మట్టి కట్టతో కూడిన డ్యామే అని చెప్పాలి. దీని నిర్మాణానికే ఏడాదిన్నర సమయం అవసరం. అప్పట్లో గోదావరికి వచ్చిన వరదల వల్ల ఈ డ్యామ్ దగ్గర కోత ఎక్కువ అయ్యింది. దీనివల్ల కొన్ని ఇబ్బందులు తప్పలేదు. దాదాపు లక్షల క్యూబిక్ మీటర్ల వరకు ఇసుక కోసుకుపోవడంతో సమస్య వచ్చింది.

ఇసుక కోసుకుపోవడం వల్ల నష్టమేంటి అనుకోవచ్చు. దీనివల్ల ఏకంగా డ్యామ్ డిజైన్లను ఫైనల్ చేయడమే సవాల్ గా మారిపోయింది. ఇవి కాని ఆలస్యమైతే ప్రాజెక్టును అనుకున్న సమయానికి కంప్లీట్ చేయడం కూడా కష్టమవుతుంది. దీనివల్ల ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఇది రాజకీయ సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే ఇవన్నీ జరగాలంటే ముందు ప్రాజెక్టు డిజైన్ లను వేగంగా ఖరారు చేయాలి. దీనికోసం అవసరమైతే అంతర్జాతీయ నిపుణుల సహకారాన్ని కూడా తీసుకోండని కేంద్రమంత్రి చెప్పారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం.. రూ.55,548.87 కోట్లు. కానీ కేంద్రం దీనికి పెట్టుబడి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్రం సంవత్సరానికి రూ.1500 కోట్లు మాత్రమే ఇస్తోంది. ఇలా అయితే ఈ ప్రాజెక్టు పూర్తవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది. పైగా ఏటికేడు అంచనా వ్యయం పెరుగుతూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా అంశాలకు సమాధానం చెప్పాల్సి ఉందని.. ఆ ప్రక్రియ పూర్తయితే.. తాము చేయాల్సింది చేస్తామని కేంద్రం అంటోంది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైతే దానివల్ల కేంద్రానికి కూడా ఇబ్బందే. అందుకే కేంద్ర జలశక్తి అధికారులు, ఏపీ అధికారులు, పోలవరం అథారిటీ అధికారులు అంతా కలిసి సమావేశం ఏర్పాటు చేసుకోవడం వల్ల సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యే అవకాశముంది. అందుకే పదిరోజుల్లో మీటింగ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తున్నా… రాష్ట్ర ప్రభుత్వం తొలుత నిధులను ఖర్చు చేస్తుంది. ఆ తరువాత కేంద్రం రీయింబర్స్ మెంట్ కింద ఇస్తుంది. కానీ అలా రాష్ట్రం ఖర్చు చేసిన డబ్బును కేంద్రం త్వరగా ఇవ్వడం లేదు. అందుకే ఇంకా కేంద్రం నుంచి రూ.2,200 కోట్లు రావాలి. వీటిని ఇవ్వడానికే పోలవరం అథారిటీ, కేంద్ర జలశక్తి అధికారులు సవాలక్ష అడ్డంకులు చెబుతున్నారు. ఈ డబ్బులు రాకపోవడం వల్ల కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించడం రాష్ట్రానికి కష్టంగా మారుతుంది. దీనివల్లే కొన్నాళ్లుగా పోలవరం పనులన్నీ చాలా నెమ్మదిగా కొనసాగుతున్నాయి.

పోలవరం అథారిటీ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించాలని చెబుతున్నా ఆ పని జరగడం లేదు. ఎందుకంటే అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్.. ఢిల్లీలో ఉంటారు. మరికొందరు అధికారులు మరో చోట ఉంటారు. దీనివల్ల కేంద్రం తరలింపు వేగంగా జరగడం లేదు. పోలవరం ఎడమ, కుడి కాలువల పనులను పూర్తి చేయడానికి ఇంకా టెండర్లు పిలవాల్సి ఉంది. అటు ఆయకట్టుకు నీరందించేలా డిస్ట్రిబ్యూటరీల పనులపైనా ఫోకస్ పెట్టాల్సి ఉంది.

పోలవరం ప్రాజెక్టులో ఎడమవైపు నావిగేషన్ ఛానల్ నిర్మిస్తారు. దీనికి నిధులను కావాలంటే.. జాతీయ జలరవాణా ప్రాజెక్టులో భాగంగా వెడల్పు చేస్తే సరి. ఇలా ప్రాజెక్టును పూర్తి చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తేనే.. ఈ ప్రాజెక్ట్ వీలైనంత తొందరగా పూర్తవుతుంది. లేకపోతే ఇప్పటిలా నెమ్మదిగా పనులు కొనసాగే అవకాశముంది.