ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పారిశ్రామికీకరణకు అధిక ప్రాధాన్యతనిచ్చి, కడప జిల్లాలో భారీ స్థాయిలో స్టీల్ ప్లాంట్ (Steel Plant) ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సున్నపురాళ్ల పల్లెలో జేఎస్‌డబ్ల్యూ ఏపీ స్టీల్ లిమిటెడ్ ప్రతిపాదించిన ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ రెండు దశల్లో అమలుకాబోతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కడప జిల్లా పారిశ్రామిక రంగంలో ఓ కీలక కేంద్రంగా ఎదిగే అవకాశముంది.
ప్రథమ దశలో రూ.4,500 కోట్ల పెట్టుబడితో నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. తరువాతి దశలో రూ.16,350 కోట్లతో పూర్తి స్థాయి ఉత్పత్తి చేపట్టనున్నారు. మొత్తం రూ.20,850 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కాబోయే ఈ ప్రాజెక్ట్ జనవరి 2026 నాటికి మొదటి దశ ప్రారంభమై, ఏప్రిల్ 2029 నాటికి పూర్తవుతుంది. రెండో దశను జనవరి 2031న ప్రారంభించి, ఏప్రిల్ 2034 నాటికి పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించారు.
Pregnancy : ప్రభుత్వ హాస్టల్‌లో గర్భవతులైన మైనర్ బాలికలు
ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం 1100 ఎకరాల భూమిని ఎకరాకు రూ.5 లక్షల చొప్పున కేటాయించనుంది. మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. రోడ్లు, నీటి వనరులు, విద్యుత్, డ్రైనేజ్ వంటి సదుపాయాలతో పాటు రైల్వే కనెక్టివిటీ, ట్రాన్స్‌మిషన్ లైన్ల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ ప్రకారం సంస్థకు పన్నుల రాయితీలు, తక్కువ ధరకు నీరు, విద్యుత్ అందించనున్నారు.
ఈ స్టీల్ ప్లాంట్ వల్ల ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 25,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. స్థానిక యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ అందించేందుకు ప్రత్యేక ప్రోగ్రాములు చేపడతామని స్పష్టం చేసింది. ప్రాజెక్ట్ అమలు పర్యవేక్షణకు ఏపీఐఐసీ చైర్మన్, పరిశ్రమల శాఖ అధికారులు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ కడప జిల్లాని పరిశ్రమల హబ్‌గా మారుస్తూ, రాష్ట్ర ఆర్థిక స్థాయిని బలోపేతం చేయనుందని నిపుణుల అభిప్రాయం.