Site icon HashtagU Telugu

Tirumala: తిరుమ‌ల‌లో తొక్కిస‌లాట.. భక్తులకు గాయాలు, ఉద్రిక్తత

Tirumala

Tirumala

తిరుమ‌ల శ్రీవారి ఆల‌యం వ‌ద్ద ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు భారీగా భ‌క్తులు చేరుకున్నారు. గ‌త రెండు రోజులుగా టోకెన్ల జారీని టీటీడీ అధికారులు నిలిపివేశారు. దీంతో పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు తిరుమ‌ల‌లో నిలిచిపోయారు. టోకన్ల పంపిణీ చేసే రెండవ సత్రం, అలిపిరి వద్దకు ఇసుకవేస్తే రాలనంతగా భక్తులు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప కంచెను తోసుకుని లోనికి వెళ్లేందుకు భక్తులు ప్రయత్నించారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిస‌లాట‌లో ప‌లువురికి గాయాలైయ్యాయి. టీటీడీ అధికారుల నిర్ల‌క్ష్యం కార‌ణంగానే ఈ తొక్కిస‌లాట జ‌రింగింద‌ని భ‌క్తులు ఆరోపిస్తున్నారు.

భ‌క్తుల‌కు స‌రైన ఏర్పాటు చేయ‌క‌పోవ‌డంతో పాటు టోకెన్లు నిలిపివేయ‌డంతో పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు నిలిచిపోయారు. మండుటెండల్లో వస్తున్న భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదంటున్నారు. చంటిబిడ్డలతో వచ్చిన భక్తులకు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. భ‌క్తుల ఆందోళ‌న నేప‌థ్యంలో టీటీడీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. టోకెన్లు లేకుండానే భ‌క్తులంద‌ర‌ని ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఆదివారం వ‌ర‌కు వీఐపీ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేస్తూ టీటీడీ నిర్ణ‌యం తీసుకుంది.