Site icon HashtagU Telugu

Andhra Pradesh: ఉక్రెయిన్‌లోని మైకోలైవ్ వద్ద చిక్కుకున్న శ్రీకాకుళం యువ‌కులు.. త‌మ‌ను త‌ర‌లించాలంటూ వేడుకోలు

5588

5588

యుక్రెయిన్‌లోని మైకోలైవ్ నౌకాశ్రయంలో చిక్కుకుపోయిన శ్రీకాకుళానికి చెందిన ఇద్దరు మర్చంట్ నేవీ డెక్ క్యాడెట్‌లు తమను ఉక్రెయిన్‌ నుండి తరలించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాతపట్నం మండలం తీమర గ్రామానికి చెందిన వీరంశెట్టి రమణమూర్తి, గార మండలం కళింగపట్నంకు చెందిన ఉప్పాడ యేసు ఏడు నెలల క్రితం టర్కీకి చెందిన మర్చంట్ నేవీ షిప్‌లో డెక్ క్యాడెట్‌లుగా చేరారు. ఫిబ్రవరి 23న మైకోలైవ్ నౌకాశ్రయానికి షిప్‌ చేరింది. అయితే ఉక్రెయిన్ నల్ల సముద్ర జలమార్గాలను మూసివేయడంతో మైకోలైవ్‌లో షిప్‌ చిక్కుకుంది. దానిలో 20 మంది సిబ్బందిలో 12 మంది, కెప్టెన్‌తో సహా రాయబార కార్యాలయం సహాయంతో టర్కీకి తిరిగి వచ్చారు. మిగిలిన ఎనిమిది మంది భారతీయ సిబ్బంది తరలింపు కోసం వేచి ఉన్నారు. వీరిద్దరూ ఐదు రోజుల క్రితం శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ద్వారా సహాయం కోరుతూ భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ సిబ్బందికి సహాయం చేస్తామని హామీ ఇస్తూ, ఎంబసీ అధికారులు వారిని తరలింపు కోసం రొమేనియా లేదా పోలాండ్ సరిహద్దులకు స్వయంగా చేరుకోవాలని కోరారు.

ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా తాము క్యాబ్‌లో సమీప సరిహద్దుకు వెళ్లడానికి భయపడుతున్నామని ర‌మ‌ణ‌మూర్తి తెలిపారు. షిప్ జనరేటర్‌లలో ఒకటి సాంకేతిక లోపం కారణంగా గ్రౌండింగ్ ఆగిపోయింది. తిండి దొరక్క ఇబ్బంది పడుతున్నామ‌ని ఆయ‌న వాపోయారు. మైకోలైవ్ ఓడరేవుకు అతి సమీపంలో బాంబులు పేలుతున్నాయని తెలిపారు. “భారత రాయబార కార్యాలయం సూచించిన విధంగా రొమేనియా లేదా పోలాండ్ సరిహద్దులకు వెళ్లడం చాలా ప్రమాదకరంగా ఉందని.. త‌న దగ్గర కేవలం $100 మాత్రమే ఉన్నాయ‌న్నారు. ఇది రొమేనియా లేదా పోలాండ్ సరిహద్దులకు క్యాబ్‌లో వెళ్లేందుకు సరిపోదని ఆయ‌న తెలిపారు.

టర్కీ నుండి వచ్చిన త‌మ‌ షిప్ కెప్టెన్ మరియు ఇతర సిబ్బంది, మైకోలైవ్ నుండి రొమేనియాకు తమ రాయబార కార్యాలయం ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయడంతో వారి దేశానికి తిరిగి వచ్చారని బాధితుడు ఉప్పాడ యేసు తెలిపారు. మరో మూడు నాలుగు రోజులకు త‌మ దగ్గర సరుకులు ఉన్నాయని.. జనరేటర్ పనిచేయడం ఆగిపోవడంతో ఆహారం వండడానికి ఇబ్బంది పడుతున్నామ‌న్నారు.