Srikakulam Temple Stampede: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట..దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు

Srikakulam Temple Stampede: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఉన్న శ్రీ విజయవెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం జరిగిన తొక్కిసలాట ఘటనతో ప్రాంతమంతా షాక్‌కు గురైంది

Published By: HashtagU Telugu Desk
Stampede In Srikakulam Kasi

Stampede In Srikakulam Kasi

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఉన్న శ్రీ విజయవెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం జరిగిన తొక్కిసలాట ఘటనతో ప్రాంతమంతా షాక్‌కు గురైంది. కార్తీక మాసం, ఏకాదశి, శనివారము ఒకే రోజు రావడంతో భక్తుల సంఖ్య ఊహించని రీతిలో పెరిగిపోయింది. స్వామివారి దర్శనం కోసం భారీగా తరలి వచ్చిన భక్తుల తాకిడికి క్యూలైన్లలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో క్యూలైన్లకు ఏర్పాటు చేసిన రెయిలింగ్ అకస్మాత్తుగా విరగిపడటంతో భక్తులు ఒక్కసారిగా కిందపడిపోయారు. ఒకరి మీద ఒకరు పడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది భక్తులు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Hyderabad-Bijapur Highway : తెలంగాణలో మరో నేషనల్ హైవే విస్తరణ

స్థానికుల ప్రకారం, ఈ ఆలయం దాదాపు 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. తిరుమలలో స్వామివారి దర్శనం దక్కకపోవడంతో ఒక భక్తుడు ఈ ఆలయాన్ని కాశీబుగ్గలో నిర్మించినట్లు చెబుతారు. ప్రతి ఏకాదశి రోజున వేలాదిమంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. అయితే ఈసారి ఏకాదశి శనివారంతో కలవడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. భక్తుల తాకిడికి తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, క్యూలైన్ సదుపాయాలు సరిగా లేని కారణంగా తొక్కిసలాట తీవ్రరూపం దాల్చిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆలయంలో ఎక్కువమంది మహిళా భక్తులే ఉన్నారని, అందులో కొందరు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన భక్తులకు మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు తక్షణ సాయాన్ని అందించాలంటూ అధికారులను ఆదేశించారు. దేవాదాయశాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి, జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు ఘటనపై సమగ్ర నివేదిక కోరారు. ఆలయ పరిధిలో భద్రతా లోపాలపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విషాదం పట్ల భక్తజనం ద్రవించిపోతోంది. ఏకాదశి రోజునే ఇలాంటి దుర్ఘటన జరగడం హృదయ విదారకం అని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  Last Updated: 01 Nov 2025, 01:08 PM IST