Site icon HashtagU Telugu

Telugu Desam Party : త్రిముఖ భావ‌జాల సంఘ‌ర్ష‌ణ‌

Ntr Babu Lokesh

Ntr Babu Lokesh

తెలుగుదేశం పార్టీ మాన‌సికంగా రెండుగా చీలిపోయిందా? ఎన్టీఆర్ వీరాభిమానులు ఒక వైపు అయితే చంద్ర‌బాబు అనుచ‌రులు మ‌రోవైపు ఉన్నారా? అంటే సీనియ‌ర్ పొలిటిషియ‌న్ సీ రామ‌చంద్ర‌య్య చెబుతోన్న మాట‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే ఔన‌ని అనిపిస్తోంది. విజ‌య‌వాడ కేంద్రంగా ఏర్ప‌డే జిల్లాకు ఎన్టీఆర్ పేరును నామ‌క‌ర‌ణం చేయ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ సిద్ధం అయింది. ఆ విష‌యం తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు ముక్త‌కంఠంతో స్వాగ‌తిస్తున్నారు. కానీ, చంద్ర‌బాబు మాత్రం ఆహ్వానించ‌డానికి సందేహిస్తున్నాడు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తోన్న రామ‌చంద్ర‌య్య తొలి నుంచి ఎన్టీఆర్ పేరును ఏ విధంగా తెర‌మ‌రుగు చేయాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించాడో..అవ‌లోక‌నం చేశాడు.
తెలుగుదేశం పార్టీ చంద్ర‌బాబు చేతిలోకి వ‌చ్చిన త‌రువాత జ‌రిగిన ప‌రిణామాలను ఒక‌సారి గ‌మ‌నిస్తే..ఎన్టీఆర్ వీరాభిమానులుగా ఉండే వాళ్లు దాదాపు టీడీపీకి దూరం అయ్యారు. ఆ రోజు వైస్రాయ్ హోట‌ల్ ఎపిసోడ్ లో స‌హ‌క‌రించిన నాయ‌కుల‌కు చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇస్తూ వ‌చ్చాడు. పార్టీ చిహ్నంతో పాటు ఎన్టీఆర్ ట్ర‌స్ట్ కూడా చంద్ర‌బాబు ఆధీనంలోకి వ‌చ్చిన త‌రువాత ద‌గ్గుబాటి కుటుంబాన్ని, హ‌రికృష్ణ నంద‌మూరిని కూడా దూరంగా పెట్టాడు. తొలి రోజుల్లో ఉప ముఖ్య‌మంత్రి చేస్తాన‌ని ద‌గ్గుబాటికి హామీ ఇచ్చాడ‌ని ఆనాడు టాక్‌. ఇక హ‌రిక్రిష్ణ‌కు కొంత కాలం మంత్రి ప‌ద‌విని ఇచ్చిన‌ట్టే ఇచ్చి పార్టీకి దూరం అయ్యేలా రాజ‌కీయం న‌డిచింది. దీంతో ఆయ‌న అన్న ఎన్టీఆర్ పార్టీని పెట్టుకుని చంద్ర‌బాబు మీద ధ్వ‌జ‌మెత్తాడు.

రెండోసారి అంటే 1999లో రెండోసారి సీఎం అయిన త‌రువాత చంద్ర‌బాబునాయుడు కొన్ని సాహ‌సోపేత నిర్ణ‌యాలు తీసుకున్నాడు. స‌చివాల‌యం ఛాంబ‌ర్ల‌లో ఎన్టీఆర్ ఫోటోల‌ను తొల‌గించాల‌ని మౌఖిక సంకేతం టీడీపీలోని అంద‌రికీ ఇచ్చాడ‌ని ఆ రోజు కీల‌కంగా ఉన్న వాళ్ల‌కు తెలుసు. అంతేకాదు, స‌భ్య‌త్వ పుస్త‌కాల్లో ఎన్టీఆర్ బొమ్మ‌ను ట్ర‌స్ట్ ఆఫీస్‌, టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో ఎన్టీఆర్ ఫోటోల‌ను తొల‌గించారు. దీంతో ఆనాడు ఎన్టీఆర్ అభిమానులు రాష్ట్రా వ్యాప్తంగా తిర‌గ‌బ‌డ్డారు. త‌ద‌నంత‌రం జ‌రిగిన 2004 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు అధికారం కోల్పోయిన త‌రువాత మ‌ళ్లీ ఎన్టీఆర్ ఫోటోల‌ను పున‌రుద్ధ‌రించాడు. 1994 ఎన్నిక‌ల్లో మ‌ద్య‌పాన నిషేధం వాగ్ధానంతో ఎన్టీఆర్ అనూహ్య మోజార్టీతో అధికారంలోకి వ‌చ్చాడు. ఆ త‌రువాత ఏడాది ఎన్టీఆర్ ను ప‌ద‌వీచుతుడ్ని చేసి చంద్ర‌బాబు సీఎం అయ్యాడు. ఎన్టీఆర్ పెట్టిన మ‌ద్య‌పాన నిషేధంను క్ర‌మంగా ఎత్తివేశాడు. బీజేపీతో క‌లిసి 1999 ఎన్నిక‌ల్లో రెండోసారి సీఎం అయిన త‌రువాత ఎన్టీఆర్ పేరుగానీ, ఆయ‌న జ్ఞాప‌కాలుగానీ లేకుండా చంద్ర‌బాబునాయుడు చేశాడ‌ని పార్టీలోని ఒక గ్రూప్ భావిస్తుంది. ఆనాడు ఎన్టీఆర్ వీరాభిమానులుగా ఉన్న లీడ‌ర్ల‌ను, దిగువ‌శ్రేణి క్యాడ‌ర్ ను వ్యూహాత్మ‌కంగా చంద్ర‌బాబు దూరంగా పెట్టాడు. ఫ‌లితంగా 2004 ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయాడు. అధికారాన్ని 2004లో కోల్పోయిన త‌రువాత చంద్ర‌బాబు మ‌ళ్లీ ఎన్టీఆర్ పేరును ప్ర‌తి వేదిక‌పైనా ప్ర‌స్తావించ‌డానికి సిద్ధం అయ్యాడు. పైగా నంద‌మూరి ఫ్యామిలీ దూరం కావ‌డంతో తిరిగి ఆ కుటుంబంలోని వాళ్ల‌కు ప్రాధాన్యం ఇస్తూ, ఎన్టీఆర్ చ‌రిష్మాను ప్ర‌స్తావించ‌డం మొద‌లు పెట్టాడు. ప‌దేళ్ల పాటు ప్ర‌తిప‌క్షంలో సుదీర్ఘ పోరాటం చేసిన టైంలో ఎన్టీఆర్ వినిపించిన తెలుగు జాతి ఐక్య‌త నినాదాన్ని కాద‌ని ప్ర‌త్యేక తెలంగాణ‌కు చంద్ర‌బాబు జై కొట్టాడు. అదే స‌మ‌యంలో ఎన్టీఆర్ కు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని నినదించాడు. ప‌దేళ్ల ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా పోరాటం చేసిన త‌రువాత విభ‌జిత ఏపీకి చంద్ర‌బాబు సీఎం అయ్యాడు. 2014 నుంచి 2019వ‌ర‌కు ఎన్టీయేలో భాగ‌స్వామిగా ఉన్నాడు. ఆ ఐదేళ్ల‌ పాటు ఎన్టీఆర్ కు భార‌త ర‌త్న ఇప్పించాల‌న్న ఒత్తిడి కేంద్రం మీద తీసుకురాలేదు.

2019 ఎన్నిక‌ల‌కు ముందు ఎన్టీఆర్ ఆరోగ్య‌శ్రీ పేరును కూడా మార్చేయాల‌న్న ఆలోచ‌న చేశాడు. ఆ విష‌యం ఒక టీవీ ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా లీకైన వీడియో ధ్రువీక‌రిస్తోంది. ఇలా..ప్ర‌తి సంద‌ర్భంలోనూ ఎన్టీఆర్ పేరును తెర‌మ‌రుగు చేయాల‌ని చేసిన ప్ర‌య‌త్నాల‌ను రామ‌చంద్ర‌య్య గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు విజ‌య‌వాడ కేంద్రంగా ఏర్ప‌డే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్ట‌డాన్ని బాబు ఆహ్వానించ‌లేక‌పోతున్నాడు. ఇలాంటి ప‌రిణామాన్ని తెలుగుదేశం పార్టీలోని ఎన్టీఆర్ వీరాభిమాన గ్రూప్ జీర్ణించుకోలేక పోతోంది. అంతేకాదు, ఎన్టీఆర్ అభిమానులు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఇత‌ర పార్టీల్లో ఉన్న వాళ్లు కూడా చంద్ర‌బాబును త‌ప్పుబ‌డుతున్నారు. ఇదంతా గ‌మ‌నిస్తే, తెలుగుదేశం పార్టీలో భావ‌జాలం ప‌రంగా రెండు గ్రూప్ లు ఉన్నాయ‌ని స్ప‌ష్టం అవుతోంది. ఇప్పుడు తాజాగా లోకేష్ అనుచ‌రులు ప్ర‌త్యేకంగా ఉన్నారని పార్టీలో అంత‌ర్గ‌తంగా వినిపిస్తోంది. కొన్నేళ్లుగా చంద్ర‌బాబు నైజాన్ని చూసిన వాళ్లు కొంద‌రు లోకేష్ మాట మీద నిల‌బ‌డే లీడ‌ర్ అంటూ విశ్వ‌సిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్ర‌బాబు క్యాడర్ గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోడ‌నే అప‌వాదు ఉంది. అధికారం పోయిన త‌రువాత `నేను మారాను..ఈసారి న్యాయం చేస్తా..` అంటూ చంద్ర‌బాబు చేసిన వాగ్దానం క్యాడ‌ర్ కు అలవాటుగా మారింది. ఆనాడు 2009 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఈసారి వైఎస్ త‌ర‌హాలో క్యాడ‌ర్ కు న్యాయం చేస్తాన‌ని హామీ ఇచ్చాడు. 2014లో అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత క్యాడ‌ర్ కు ఆయ‌న ఇచ్చిన మాట‌ను మ‌రిచాడ‌ని పార్టీలో అంత‌ర్గ‌త చ‌ర్చ‌. ఇక ఇప్పుడు 2024 ఎన్నిక‌ల్లో గెలిస్తే..క్యాడ‌ర్ కు ఇప్పుడు జ‌గ‌న్ ఇస్తోన్న దాని కంటే మ‌రింత ప్రాధాన్యం ఇస్తాన‌ని చెబుతున్నాడు. కానీ, గ‌త స్మృతుల‌ను నెమ‌రు వేసుకుంటోన్న క్యాడ‌ర్ మాత్రం లోకేష్ వైపు చూస్తున్నార‌ని తెలుస్తోంది. అధికారం ఉన్నా, లేక‌పోయిన‌ప్ప‌టికీ లోకేష్ కొంద‌రికి ఇచ్చిన మాట‌ను నిలుపుకున్నాడ‌ట‌. అందుకే, లోకేష్ బాబు మాట‌ల‌ను విశ్వ‌సిస్తున్నారు. సో..మొత్తం మీద తెలుగుదేశంలో పార్టీలో భావ‌జాలం ప‌రంగా మూడు గ్రూపులు ఉన్నాయ‌ని లోతుగా అధ్య‌య‌నం చేస్తే అర్థం అవుతోంది. ఇలాంటి ప‌రిణామాల క్ర‌మంలో ఎన్టీఆర్ పై చంద్ర‌బాబుకు ఉన్న నిర్ల‌క్ష్యాన్ని రామ‌చంద్ర‌య్య గుర్తు చేయ‌డం టీడీపీలోని కోర్ గ్రూప్ ను ఆలోచింప చేస్తోంది.