Idupulapaya : జ‌గ‌న్ కుటుంబ‌ క‌థా చిత్రం! ఇడుపుల‌పాయ టూ ప్లీన‌రీ!!

అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత తొలిసారిగా వైసీపీ ప్లీన‌రీ నిర్వ‌హిస్తోంది. గుంటూరు కేంద్రంగా జ‌రిగే ప్లీన‌రీ 2024 దిశ‌గా తీర్మానాల‌ను చేయ‌బోతుంది

  • Written By:
  • Updated On - July 7, 2022 / 01:10 PM IST

అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత తొలిసారిగా వైసీపీ ప్లీన‌రీ నిర్వ‌హిస్తోంది. గుంటూరు కేంద్రంగా జ‌రిగే ప్లీన‌రీ 2024 దిశ‌గా తీర్మానాల‌ను చేయ‌బోతుంది. వాటి ఆధారంగా వ‌చ్చే రెండేళ్ల‌లో క్షేత్ర‌స్థాయి స‌మీక‌ర‌ణాలు ఎలా చేయాలో జగన్ మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయ‌బోతున్నారు. క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో ప్లీన‌రీని నిర్వ‌హించ‌డానికి భారీ ఏర్పాట్ల‌ను చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన వాటికి భిన్నంగా ఈసారి ఉండ‌బోతుంది. ఇదంతా ఒక ఎత్తైతే, జగన్ మోహన్ రెడ్డి కుటుంబంలోని విభేదాలు మ‌రో ఎత్తుగా క‌నిపిస్తున్నాయి.

సాధారణంగా క్రిస్మ‌స్, వైఎస్ జ‌యంతి, వ‌ర్థంతి రోజుల్లో ఆయ‌న కుటుంబీకులు అంతా ఇడుప‌ల‌పాయ‌కు వెళ‌తారు. అక్క‌డ వైఎస్ స‌మాధి వ‌ద్ద నివాళుల‌ర్పించ‌డంతో పాటు ప‌లు కార్య‌క్ర‌మాల్లో కుటుంబ స‌భ్యులు పాల్గొన‌డం ఆన‌వాయితీ. అయితే, ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల కార‌ణంగా గత ఏడాది వైఎస్ జ‌యంతి సంద‌ర్భంగా తొలుత విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల ఇడుపుల‌పాయ వెళ్లారు. వాళ్లిద్ద‌రూ వైఎస్ స‌మాధి నుంచి వెళ్లిన త‌రువాత సీఎం జగన్ మోహన్ రెడ్డి వెళ్లారు. ఎవ‌రికి వారే వేర్వేరుగా నివాళుల‌ర్పించి రావ‌డం గ‌త ఏడాది చూశాం. ఈసారి కూడా అలాంటి సీన్ ఉండ‌బోతుంద‌ని పార్టీ క్యాడ‌ర్ ద్వారా తెలుస్తోంది.

షెడ్యూల్ ప్ర‌కారం గురువారం సీఎం జ‌గ‌న్ క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. శుక్ర‌వారం వర‌కు ఆయ‌న అక్క‌డే వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఆ త‌రువాత ఇడుపుల‌పాయ వెళ్లి వైఎస్ స‌మాధి వ‌ద్ద నివాళులు ఆర్పించి తాడేప‌ల్లికి చేరుకుంటారు. అయితే, ఈసారి ముందుగా జగన్ మోహన్ రెడ్డి ఇడుపుల‌పాయ వెళ్లే అవ‌కాశం ఉంది. అక్క‌డ నుంచి ఆయ‌న వెళ్లిన తరువాత వైఎస్ విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల ఇడుపులపాయ వెళ‌తార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం పాద‌యాత్ర చేస్తోన్న ష‌ర్మిల గురువారం సాయంత్రానికి హైద‌రాబాద్ చేరుకుంటార‌ని స‌మాచారం. శుక్ర‌వారం ఉద‌యం విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల క‌లిసి ఇడుపుల‌పాయ వెళ్లేలా ప్ర‌స్తుతానికి షెడ్యూల్ ఉంద‌ని లోట‌స్ పాండ్ వ‌ర్గాల వినికిడి.

తెలంగాణ రాష్ట్రంలో ష‌ర్మిల పార్టీ పెట్టిన త‌రువాత అన్నా, చెల్లెలు మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. కానీ, వాళ్ల మ‌ధ్య చోటుచేసుకున్న కుటుంబ వ్య‌వ‌హారాల‌పై ఎవ‌రూ అధికార‌కంగా నోరువిప్ప‌డం లేదు. ప‌లు ర‌కాలుగా వాళ్లిద్ద‌రి మ‌ధ్యా వ‌చ్చిన గ్యాప్ గురించి ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం జ‌రిగే వైసీపీ ప్లీన‌రీ స‌మావేశాల్లో గౌర‌వాధ్య‌క్ష ప‌ద‌వికి విజ‌య‌మ్మ రాజీనామా చేస్తార‌ని కూడా ప్ర‌చారం బలంగా జ‌రుగుతోంది. రాబోవు రోజుల్లో ష‌ర్మిల వెంటే విజ‌య‌మ్మ ఉంటార‌ని లోట‌స్ పాండ్ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. ఇడుపుల‌పాయ కేంద్రంగా జ‌రిగే ప‌రిణామాలు ఆస‌క్తిక‌రంగా మార‌గా, 8, 9 తేదీల్లో జ‌రిగే ప్లీన‌రీ సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు కేంద్రం కాబోతుంద‌ని వైసీపీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఇడుపుల‌పాయ నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ప్లీన‌రీలో జ‌రిగే సంచ‌ల‌నాలు ఏంటో చూడాలి.