Chandrababu : దెబ్బ‌తిన్న సింహం చంద్ర‌బాబు రాజ‌కీయ వేట.!

`సింహం ఒక‌డుగు వెనుక‌వేసిందంటే..అది భ‌య‌ప‌డింద‌ని కాదు...`అని అంటారు తాత్విక‌వేత్త‌లు. ఇప్పుడు చంద్ర‌బాబునాయుడు క‌న్నీరు పెట్టుకున్నాడ‌ని ఇక రాజ‌కీయంగా అయిపోయిన‌ట్టుకాదు.

  • Written By:
  • Updated On - November 19, 2021 / 05:14 PM IST

`సింహం ఒక‌డుగు వెనుక‌వేసిందంటే..అది భ‌య‌ప‌డింద‌ని కాదు…`అని అంటారు తాత్విక‌వేత్త‌లు. ఇప్పుడు చంద్ర‌బాబునాయుడు క‌న్నీరు పెట్టుకున్నాడ‌ని ఇక రాజ‌కీయంగా అయిపోయిన‌ట్టుకాదు. బ‌స్సు యాత్ర ద్వారా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు దూక‌డానికి సిద్ధం అవుతున్నాడు. ఆత్మ‌విశ్వాసానికి ప్ర‌తీక‌గా నిలిచే చంద్ర‌బాబునాయుడు క‌న్నీరు పెట్టుకున్నారంటే..క‌సిగా భ‌విష్య‌త్ రాజ‌కీయాలు ఉంటాయ‌ని అర్థం చేసుకోవాలి. ఆయ‌న గురించి ఎన్ని ర‌కాలుగా మాట్లాడిన‌ప్ప‌టికీ త‌ట్టుకునే నిండైన శ‌క్తి బాబుకు ఉంది. కానీ, నంద‌మూరి ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన ఆడ‌ప‌డుచు భువ‌నేశ్వ‌రి గురించి అసెంబ్లీ వేదిక‌గా వైసీపీ నేత‌లు కామెంట్స్ చేసిన‌ తీరు ఆయ‌న్ను బాధ పెట్టింది.


స‌ర్వ‌కాల స‌ర్వావ‌స్థ‌లందు స్థిత‌ప్ర‌జ్ఞ‌త‌ను చంద్ర‌బాబు ప్ర‌ద‌ర్శిస్తుంటార‌ని ఆయ‌న గురించి బాగా తెలిసిన వాళ్ల అభిప్రాయం. నిండైన ఆత్మ‌విశ్వాసానికి ప్ర‌తీక‌గా ఉంటే ఆయ‌న క‌న్నీరు పెట్టుకున్నారంటే..ఏ స్థాయి అవ‌మానం అసెంబ్లీ వేదిక‌గా జ‌రిగిందో అర్థం చేసుకోవ‌చ్చు. ప్రెస్ మీట్ ఎండింగ్ లో మీడియా ఎందుట క‌న్నీటి ప‌ర్యంతం అయిన చంద్ర‌బాబునాయుడు ముఖాన్ని చూసిన అభిమానులు ఆగ్ర‌హంతో వైసీపీ మీద ర‌గిలిపోతున్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వ్య‌వ‌హారం మీద ప్ర‌జా ఉద్యమాన్ని చేయాల‌ని భావిస్తున్నారు. అందుకే, బ‌స్సు యాత్ర‌కు చంద్ర‌బాబును సిద్ధం చేస్తున్నార‌ట‌.

Also Read : విధిరాత‌.. నాడు ఎన్టీఆర్ నేడు చంద్ర‌బాబు శ‌ప‌థం

ఒక‌నాడు ఇలాంటి ప‌రాభ‌వం త‌మిళ‌నాడు అసెంబ్లీలో జయ‌ల‌లిత‌కు జ‌రిగింది. ఆ రోజున ఆమె చీర‌ను లాగి దుశ్శాస‌న ప‌ర్వాన్ని అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌త్య‌ర్థులు చూపారు. ఆ బాధ‌ను, అవ‌మానాన్ని త‌ట్టుకోలేక క‌న్నీరు పెట్టుకుని జ‌య‌ల‌లిత అసెంబ్లీ నుంచి వెళ్లిపోయింది. మ‌ళ్లీ సీఎంగా వ‌స్తానంటూ శ‌ప‌థం చేసి బ‌హిష్క‌రించింది. తిరిగి ముఖ్య‌మంత్రిగా అసెంబ్లీలోకి జ‌య అడుగుపెట్టింది. ప్ర‌త్య‌ర్థుల‌ను వేటాడింది.
ఇప్పుడు చంద్ర‌బాబుకు కూడా దాదాపు ఆనాడు త‌మిళ‌నాడు అసెంబ్లీలో జ‌య‌కు జ‌రిగిన ప‌రాభ‌వమే ఎదురైయింది. అందుకే, ఆయ‌న అసెంబ్లీని బ‌హిష్క‌రించాడు. మ‌ళ్లీ సీఎంగా అడుగు పెట్ట‌డానికి ప్ర‌జ‌ల దీవెనల కోసం చంద్ర‌బాబు ప‌యనం కానున్నాడు. బ‌స్సు యాత్ర ద్వారా అసెంబ్లీలో జ‌రిగిన ప‌రాభ‌వాన్ని చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత టీడీపీ నేత‌ల ఇళ్ల‌పైన‌, కుటుంబాల‌పైన జ‌రుగుతోన్న దాడుల‌ను ఎండ‌గ‌ట్టాల‌ని బ్లూప్రింట్ సిద్ధం అవుతోంది.

Also Read : భోరున విల‌పించిన చంద్ర‌బాబు

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న అనంత‌రం బ్లూప్రింట్ ను విడుద‌ల చేయడానికి టీడీపీ సిద్ధం అవుతున్న‌ట్టు తెలుస్తోంది. చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని సొంతూరు నారావారిప‌ల్లెం నుంచి ఆత్మ‌గౌవ‌ర ర్యాలీని మొద‌లు పెట్టాల‌ని భావిస్తున్నారు. బ‌స్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించి, జ‌గ‌న్ పాల‌న మీద నిరంతర పోరు రాబోవు రోజుల్లో చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల తెలుస్తోంది. స‌మీప భ‌విష్య‌త్ లోనే చంద్ర‌బాబు రాజ‌కీయ విశ్వ‌రూపాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చూస్తార‌ని ఆయ‌న అభిమానులు భావిస్తున్నారు. సో..ఇక చంద్ర‌బాబు రాజ‌కీయ అడుగులు ప్ర‌త్య‌ర్థుల‌కు సింహ స్వ‌ప్నంగా ఉండే అవ‌కాశాలు లేక‌పోలేదు.