AP Politics : ఆంధ్రా జ‌నం బ‌హుప‌రాక్‌!

ఆంధ్రా ఓట‌ర్ల‌కు ఈసారి అగ్ని ప‌రీక్ష. ఎవ‌రు ఏపీ ప్ర‌యోజ‌నాలు కాపాడ‌తారు? ఎవ‌రు సొంత ఆస్తుల కోసం పాకులాడుతున్నారు?

  • Written By:
  • Updated On - October 6, 2022 / 12:11 PM IST

ఆంధ్రా ఓట‌ర్ల‌కు ఈసారి అగ్ని ప‌రీక్ష. ఎవ‌రు ఏపీ ప్ర‌యోజ‌నాలు కాపాడ‌తారు? ఎవ‌రు సొంత ఆస్తుల కోసం పాకులాడుతున్నారు? నిజంగా ఏపీ మీద అభిమానం, ప్రేమ ఎవ‌రికి ఉన్నాయి? హైద‌రాబాద్ మీద ఉన్న మోజు ఏపీ మీద ఎవ‌రికి ఉంది? ఇలాంటి ప్ర‌శ్న‌లు వేసుకుని తుది నిర్ణ‌యానికి రావాల్సి ఉంది. లేదంటే, ఏపీ మరో శ్రీలంక‌తో పాటు సోమాలియా అయ్యే ప్ర‌మాదం కూడా లేక‌పోలేదు.

కొన్ని ద‌శాబ్దాలుగా ఆంధ్రా ప్ర‌జ‌ల ఆస్తులు, శ్ర‌మ‌, మేధోసంప‌త్తి తెలియ‌కుండా ఇత‌రుల‌కు ధార‌ద‌త్తం అయింది. మ‌ద్రాసీలుగా ఉండే ఆంధ్రా వాళ్లు క‌ర్నూలు రాజ‌ధాని నుంచి హైద‌రాబాద్ కు రావ‌డ‌మే పెద్ద త‌ప్పుగా ఇప్పుడు భావిస్తున్నారు. ఆనాడు 1972లో జై ఆంధ్రా ఉద్య‌మాన్ని అణిచివేసి సొంత ఆస్తుల కోసం కొంద‌రు హైదరాబాద్ ను రాజ‌ధానిగా మ‌లిచారు. ఆనాటి నుంచి 2014 వ‌ర‌కు ఆంధ్రా ప్ర‌జ‌ల శ్ర‌మ , మేధోసంప‌త్తి హైద‌రాబాద్ కేంద్రంగా బూడిద‌లో ప‌న్నీరు అయింది. రాష్ట్రం విడిపోయిన త‌రువాత కూడా ఆంధ్రా వాళ్ల ప‌న్నులు ఎక్కువ భాగం తెలంగాణ‌కు వ‌స్తున్నాయి. హైద‌రాబాద్ కేంద్రంగా చేసుకుని అల్లుకుపోయిన ఆస్తుల అనుబంధాన్ని వదులుకోలేపోతున్నారు.

ఏపీ క్యాబినెట్ లోని మంత్రులు, విప‌క్ష లీడ‌ర్లు దాదాపుగా అంద‌రూ హైద‌రాబాద్ లోనే ఉంటారు. వాళ్ల కుటుంబీకుల ఫంక్ష‌న్ల‌న్నీ తెలంగాణ రాజ‌ధానిలోనే జ‌రుపుతున్నారు. వంద‌ల కోట్ల రూపాయాల‌తో చేసే ప్ర‌తి పంక్ష‌న్ హైద‌రాబాద్ లోనే క‌నిపిస్తున్నాయి. ఆంధ్రా ప్ర‌జ‌ల ప‌న్నుల‌తో హోదాను, ద‌ర్పాన్ని అనుభ‌విస్తూ ఫంక్ష‌న్లు, ఇత‌ర‌త్రా కొనుగోళ్ల ద్వారా కేసీఆర్ స‌ర్కార్ కు ప‌న్నులు చెల్లిస్తున్నారు. కేవ‌లం అధికారంలో ఉండే నేత‌లతో పాటు టీడీపీ , జ‌న‌సేన అధిప‌తులు హైద‌రాబాద్ లోనే ఉంటారు. కేవ‌లం పార్టీ కార్య‌క్ర‌మాల స‌మ‌యంలో మాత్ర‌మే ఆంధ్రాకు వెళ‌తారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో సింహ‌భాగం మీడియా రాష్ట్ర విభ‌జ‌న‌కు మ‌ద్ధ‌తు ప‌లికింది. ఆనాడు కేసీఆర్ ఆదేశానుసారం నియామ‌కాలు చేసిన ఆంధ్ర మీడియా అధిప‌తులు ఉన్నారు. తెలంగాణ‌లోని ఆస్తుల‌ను కాపాడుకోవ‌డానికి అనివార్యంగా ప్ర‌ధాన మీడియా కేసీఆర్ కు దాసోహం అంది. ఆ విష‌యాన్ని శ్రీకృష్ణ క‌మిటీ కూడా ప‌రోక్షంగా ప్ర‌స్తావించింది. ప్ర‌త్యేక ఉద్య‌మ తీవ్ర‌త‌ను త‌గ్గించాలంటే మీడియాను అదుపుచేయాల‌ని ఆ క‌మిటీ ఒక పేరాలో పొందుప‌రిచింది. కానీ, వేల కోట్ల ఆస్తుల కోసం కొంద‌రు అధిప‌తులు స్థాపించిన మీడియా తెలంగాణ‌కు జై కొట్టింది. ఫ‌లితంగా ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డింది.

రాష్ట్రం విడిపోయిన త‌రువాత తెలంగాణకు చెందిన అధిప‌తికి చెందిన‌ మీడియాకు ఆనాడు సీఎంగా ఉన్న చంద్ర‌బాబు కోట్ల రూపాయాల‌ను పోగుచేసుకోవ‌డానికి అవ‌కాశం ఇచ్చారు. ఆ విష‌యాన్ని వైసీపీ అప్ప‌ట్లో అసెంబ్లీ వేదిక‌గా పెద్ద ఇష్యూ చేసింది. అయిన‌ప్ప‌టికీ వేల కోట్ల‌ను ఆ మీడియా అధిప‌తి ల‌బ్ది పొందార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌. అదే మీడియా అధిప‌తి ఇప్పుడు ఛీఛీ ఏపీలోని కుల‌గ‌జ్జి, వాళ్లు ఎక్క‌డ ఛ‌స్తే నాకేంటి అంటూ వ్యాఖ్యానించిన విష‌యం బుల్లితెర సాక్షిగా అంద‌రూ చూశారు. ఆంధ్రాతో నాకు ఎలాంటి సంబంధం లేదంటూనే ఆ రాష్ట్ర సంప‌ద మీద ఆశ‌ను చంపుకోలేక‌పోతున్నారు.

ఏపీలోని ప‌రిస్థితుల మీద హైద‌రాబాద్ కేంద్రంగా చిలువ‌లు ప‌లువ‌లు చేసి చెబుతోన్న మీడియా సంస్థ‌ల్లోని 90శాతం మంది ఆంధ్రాకు సంబంధంలేని వాళ్లు. ఒక‌రిద్ద‌రు మిన‌హా మిలిగిన వాళ్ల‌కు క‌నీసం ఆంధ్రా నైస‌ర్గిక స్వ‌రూపం, నేప‌థ్యం, సంస్కృతి, సంప్ర‌దాయాల మీద అవ‌గాహ‌నలేకుండా అక్క‌డి ప్ర‌జ‌ల్లో భావోద్వేగాల‌ను లేపుతున్నారు. బ‌య‌ట నుంచి చూసే వాళ్ల‌కు ఆ రాష్ట్రం మీద అస‌హ్యం క‌లిగేలా ప్ర‌తిరోజూ ఏదో ఒక ఇష్యూను ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇదే మీడియా ప్ర‌త్యేక తెలంగాణ‌కు మ‌ద్ధ‌తు పలక‌డం ద్వారా ఆంధ్రాకు అన్యాయం చేసింది. విడిపోయిన త‌రువాత కూడా అక్క‌డి సంప‌ద‌ను దోచుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది.

ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్ర‌ధాన పార్టీలు టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన‌, కాంగ్రెస్, ఉభ‌య క‌మ్యూనిస్ట్ పార్టీలు. వీటికి తోడుగా త్వ‌ర‌లోనే కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ కూడా ఎంట‌ర్ కానుంది. ఆయా పార్టీల అధిప‌తులు ఎవ‌రూ ఏపీ కేంద్రంగా స్థిర నివాసం ఉండ‌రు. అధికారం కోల్పోయిన త‌రువాత చంద్ర‌బాబు హైద‌రాబాద్ కు మ‌కాం మార్చుకున్నారు. ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్న‌ప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా హైద‌రాబాద్ కేంద్రంగా ఏపీ రాజ‌కీయాల‌ను న‌డిపారు. ఇక జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్ చుట్ట‌పు చూపుగా ఏపీలో క‌నిపిస్తుంటారు. ఇప్పుడు కేసీఆర్ కూడా తెలంగాణ నుంచి ఆంధ్రాను ఏల‌డానికి సిద్ధం అయ్యారు. ఆస్తులను కాపాడుకోవ‌డం కోసం హైద‌రాబాద్ లోని ఒక విభాగం మీడియా కేసీఆర్ కు ఊద‌రగొట్ట‌డానికి సిద్ధం అయింది. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబుకు అనుకూలంగా ఉన్న కొంద‌రు మీడియా అధిపతులు కేసీఆర్ పాట‌ను ఇప్ప‌టికే అందుకున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏపీ ప్ర‌జ‌లూ బ‌హుప‌రాక్‌!