YS Jagan: ముగ్గురిలో ఒక్క‌డే..!

ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్ చేయ‌డానికి లేద‌ని సంచ‌ల‌న‌ నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌తంలో ఎన్టీఆర్, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, చంద్ర‌బాబునాయుడు చేయ‌లేని సాహ‌సం జ‌గ‌న్ చేస్తున్నారు. ఇలాంటి నిర్ణ‌యాన్ని గ‌త సీఎంలు తీసుకుని విఫ‌లం అయ్యారు.

  • Written By:
  • Updated On - April 8, 2022 / 03:25 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్ చేయ‌డానికి లేద‌ని సంచ‌ల‌న‌ నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌తంలో ఎన్టీఆర్, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, చంద్ర‌బాబునాయుడు చేయ‌లేని సాహ‌సం జ‌గ‌న్ చేస్తున్నారు. ఇలాంటి నిర్ణ‌యాన్ని గ‌త సీఎంలు తీసుకుని విఫ‌లం అయ్యారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల విష‌యంలో దాదాపు ముఖ్య‌మంత్రులు అంద‌రూ వైఫ‌లం అయ్యారు. వాళ్ల‌తో టైం టూ టైం ఉద్యోగం చేయించ‌డంలోనూ ఏమీ చేయ‌లేక‌పోయారు. కానీ, ఈసారి జ‌గ‌న్ ప్ర‌భుత్వ ఉద్యోగుల భ‌ర‌తం ప‌ట్టడానికి సిద్ధం అయ్యారు.ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీసు నిర్వహిస్తుండటం అందరికీ తెలిసిన విషయమే. దీనిపై ఎప్పటి నుంచో అభ్యంతరాలు ఉన్నాయి. ప్రైవేట్ ప్రాక్టీసు నిర్వహిస్తున్న వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులను సరిగా నిర్వహించడం లేదు. వారి దృష్టి ప్రైవేట్ ప్రాక్టీస్ ద్వారా వచ్చే డబ్బుపైనే ఉంటుందనే చర్చ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ నిర్వహించకుండా నిషేధం విధిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై స్పష్టమైన నియమ, నిబంధనలను రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ‘నాడు- నేడు’ కార్యక్రమం కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులను మెరుగు పరిచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తయారు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని నియమించింది. నాణ్యమైన మందులను ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేస్తోంది. అయినప్పటికీ గవర్నమెంట్ డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే మెరుగైన సేవలు అందిస్తున్నారనే భావనలో ప్రజలు ఉన్నారనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ క్ర‌మంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇలాంటి కీల‌క నిర్ణ‌యాల‌ను చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు ఉమ్మ‌డి ఏపీలో తీసుకున్నారు. ఆనాడు ఉద‌యం 10గంట‌ల‌కు ఆఫీస్ ల‌కు రావాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యంపై ఉద్యోగులు ఆనాడు తిర‌గ‌బ‌డ్డారు. ఏమీచేయ‌లేక ఉద్యోగులను చంద్ర‌బాబు వ‌దిలేశారు. ఆ త‌రువాత 2004లో సీఎంగా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎం అయిన త‌రువాత క‌నీసం 10.30 గంట‌ల‌కు స‌చివాల‌యానికి అంద‌రూ ఉద్యోగులు రావాల‌ని ఉద‌యం 11 గంట‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని ఆదేశించారు.

హాజ‌రు కోసం బ‌యోమెట్రిక్ పెట్ట‌డానికి స‌న్న‌ద్ధం అయ్యారు. కానీ, ఆయ‌న ఇచ్చిన ఆదేశం ప్ర‌కారం ప్ర‌భుత్వం ఉద్యోగులు న‌డుచుకోలేదు. ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేక వైఎస్ ఆ నిర్ణ‌యాన్ని వ‌దిలేసుకున్నారు.ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్ర‌భుత్వ వైద్యులు, లెక్చ‌ర‌ర్లు, టీచ‌ర్లు, ఇత‌ర‌త్రా ఉద్యో్గులు ప్రైవేటు ప్రాక్టీస్ చేయ‌డానికి లేద‌ని జీవో ఇచ్చారు. ఆనాడు ఆ జీవో ఒక పెద్ద సంచ‌ల‌నం అయింది. కార్పొరేట్ కాలేజిల్లో ప్ర‌భుత్వ కాలేజిల లెక్చ‌ర‌ర్లు ప‌నిచేయ‌డం ఆనాడు ఎక్కువ‌గా ఉండేది. దీర్ఘ‌కాలిక లీవ్ పెట్టుకుని ప్రైవేటు కాలేజిల‌ను కొంద‌రు స్థాపించారు. ప్ర‌భుత్వ కాలేజిల్లో సెల‌వులు పెట్టుకుని ప్రైవేటు కాలేజిల్లో పాఠాలు చెప్ప‌డానికి వెళ్లే లెక్చ‌ర‌ర్ల అనేకం ఉన్నారు. ఫ‌లితంగా ప్ర‌భుత్వ కాలేజిల హాజ‌రు శాతం, ఉత్తీర్ణ‌త‌శాతం త‌గ్గేది. అందుకే, ఆనాడు నిషేధం విధిస్తూ ఎన్టీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక ప్ర‌భుత్వవైద్యుల విష‌యంలోనూ ఆనాడు ఎన్టీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తే డిస్మ‌స్ చేస్తామని కూడా హెచ్చ‌రించారు. కానీ, ప్ర‌భుత్వ వైద్యులు, లెక్చ‌ర‌ర్లు, ఉద్యోగుల నుంచి వ‌చ్చిన వ్య‌తిరేక‌త‌ను గ‌మ‌నించిన ఆయ‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కు తీసుకున్నారు.ఎన్టీఆర్, రాజ‌శేఖ‌ర్ రెడ్డి, చంద్ర‌బాబునాయుడు అమలు చేయ‌లేక‌పోయిన నిర్ణ‌యాన్ని ఇప్పుడు జ‌గ‌న్ తీసుకున్నారు. ప్ర‌భుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్ చేయ‌డానికి లేద‌ని ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం అమ‌లు అయితే చ‌రిత్ర‌లో నిలిచిపోయే అవ‌కాశం ఉంది. అంతేకాదు, ఏపీలో జ‌గ‌న్ నిజ‌మైన శ‌కం ప్రారంభం అయిన‌ట్టు భావించొచ్చు.