సహేతుకం కాని డిమాండ్లతో ఆందోళన చేస్తున్న సామాజిక ఆరోగ్యాధికారులు వెంటనే తమ ఆందోళనను విరమించుకుని ప్రజారోగ్య పరిరక్షణా విధుల్లో చేరాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు కోరారు. గ్రామీణ ప్రజలకు అవసరమైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం 2019 నుండి సిహెచ్‌వోల నియామకాలను చేపట్టిందని ఆయన వివరించారు. 2019లో 697 మంది, 2020-22లో 4,519 మంది, 2022-23లో 4816 మంది సిహెచ్‌వోలు నియమితులయ్యారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి 5 వేల జనాభాకు ఒక ఆరోగ్య ఉపకేంద్రం ఉండాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో దాదాపు 2500-3000 మంది జనాభాకు ఒకటి వంతున డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ లను మంజూరు చేసిందని వివరించారు. ఈ క్లినిక్ లలో నియమితులైన సిహెచ్‌వోలను కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక ఏడాది కాంట్రాక్ట్ పై నియమితులయ్యారనీ, వారి పనితీరు అంచనా ఆధారంగా ఆ కాంట్రాక్ట్ ను పునరుద్ధరించటం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వీరికి నెలకు రు.25,000 వంతున వేతనంతో పాటు రు.15000 ప్రోత్సాహకాన్ని (మొత్తం నెలకు రు.40,000) వంతున వారి పనితీరు ఆధారంగా అందజేయటం జరుగుతోందని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
సిహెచ్‌వోల పనితీరు అంచనా వేసే కమిటీ వారి పనితీరు ఆధారంగా అదనపు ప్రోత్సాహకాన్ని అందిస్తుందన్నారు. వారు తమకు నిర్దేశించిన విధంగా ప్రధాన కేంద్రంలో అందుబాటులో వుండి పాముకాటు, వడదెబ్బ వంటి అత్యవసర సేవలను అందించాలని ఇందుకు అదనంగా వారికి కాంట్రాక్ట్ ప్రోత్సాహకంతో పాటు మరో 30 శాతం అందించాలని నిర్ణయించిందని, ఈ ప్రకారమే ఇప్పుడు వేతన చెల్లింపులు కొనసాగుతున్నాయని వివరించారు. సిహెచ్ఓలు ఇప్పుడు Andhra Pradesh MLHP/CHO Association (APMCA) 372/2021 అన్న పేరుతో కొన్ని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారని, అలాగే దశలవారీ ఆందోళన కార్యక్రమాలను కూడా పేర్కొన్నారన్నారు.
Also Read: Andhra Pradesh : ప్రత్తిపాడులో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీపీలు
డిమాండ్ మేరకు ఏటా 15 రోజుల సాధారణ సెలవులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని కృష్ణబాబు తెలిపారు. అయినప్పటికీ వారు తమ ఆందోళన విరమించకుండా దశలవారీ ఆందోళన పేరుతో విధుల బహిష్కరణ చేయడం మంచిదికాదన్నారు.వాస్తవ పరిస్థితులను గమనించి ఇప్పటికైనా తమ ఆందోళన విరమించి, విధుల్లో చేరాలని కృష్ణబాబు సూచించారు. తిరిగి తమ విధుల్లో చేరని పక్షంలో వారి కాంట్రాక్ట్ లను రద్దు చేసి ఉద్యోగాల నుండి తొలగించేందుకు సైతం వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ప్రభుత్వం 27-11-2023 తేదీన సర్క్యులర్ ను జారీ చేసిందని తెలిపారు. సిహెచ్వోలకు వాస్తవ పరిస్థితుల్ని మరోసారి వివరించేందుకు 29-11-2023 తేదీన ఉదయం 11 గంటలకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు రాష్ట్రంలోని మొత్తం 10,032 మంది సిహెచ్వోలతో వెబినార్ ను నిర్వహిస్తారు. వాస్తవాల్ని తెలుసుకున్న తరువాత కూడా సిహెచ్వోలు విధుల్లో చేరకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.