Site icon HashtagU Telugu

Jagan 2.0 New Cabinet : నిమ్న‌వ‌ర్గ కుబేరులకే జ‌గ‌న్ పట్టం

Jagan Ap Map

Jagan Ap Map

అద్భుత‌మైన సామాజిక న్యాయం చేశార‌ని జ‌గ‌న్ క్యాబినెట్ ను చూసిన వాళ్లు విశ్లేష‌ణ‌ల‌ను ఇస్తున్నారు. ఏపీ చ‌రిత్ర‌లో ఇలాంటి క్యాబినెట్ కూర్పు ఎప్పుడూ లేద‌ని వైసీపీ చెబుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు అగ్ర‌తాంబూలం ఇచ్చామ‌ని ఆ పార్టీ నేత‌లు ఊద‌ర‌కొడుతున్నారు. మంత్రివ‌ర్గంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పేర్ల‌ను నిశితంగా ప‌రిశీలిస్తే వాళ్లంతా దాదాపుగా కుబేరులు. అలాంటి వాళ్ల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చినంత మాత్ర‌న సామాజిక న్యాయం జ‌రిగిపోయిన‌ట్టేనా? అనేది ఆలోచించాలి.రెడ్డి, కాపు, బీసీ సామాజిక‌వ‌ర్గంలోని మంత్రుల‌ను మ‌రొకరితో రీప్లేస్ చేశారు. ఎస్సీల్లోని కుబేరులను జ‌గ‌న్ ఎంపిక చేసుకున్నారు. ప్ర‌కాశం జిల్లాకు చెందిన మంత్రి సురేష్ ను కొన‌గించారు. అంటే, ఆయ‌న బంధువ‌ర్గంలో ఆయ‌న‌తో పాటు ఐఆర్ఎస్, ఐఏఎస్ అధికారులు సుమారు 11 మంది ఉన్నార‌ని తెలుస్తోంది. పైగా ఆయ‌న స‌తీమ‌ణి ఆదాయ ప‌న్నుల‌శాఖ‌లో కీల‌క అధికారిణిగా ప‌నిచేస్తున్నారు. అందుకే, బాలినేని శ్రీనివాస‌రెడ్డి ఎంత ఒత్తిడి చేసిన‌ప్ప‌టికీ సురేష్ ను కొన‌సాగిస్తూ జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. పైకి మాత్రం ఆయ‌న బంధువు అయిన‌ప్ప‌టికీ బాలినేని మంత్రి ప‌ద‌విని క‌ట్ చేసి ఎస్సీ సురేష్ కు కొన‌సాగింపు ఇచ్చిన‌ట్టు ఫోక‌స్ అవుతోంది.

ప‌ల్నాడు జిల్లా చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారి గెలిచిన విడ‌ద‌ల ర‌జిని బీసీ సామాజిక‌వ‌ర్గం. ఆమెకు మంత్రి ప‌ద‌వి ఇచ్చామ‌ని గొప్ప‌గా జ‌గ‌న్ టీమ్ చెబుతోంది. పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ ఓన‌ర్ ఆమె. దాదాపు రెండు వేల కోట్ల‌కు పైగా ఆమె సంప‌ద ఉంద‌ని వైసీపీ వ‌ర్గాల్లోని టాక్‌. ఇటీవ‌ల ఒక కంపెనీ విక్ర‌యించ‌డం ద్వారా వేల కోట్లు వ‌చ్చాయ‌ని, ఆ డ‌బ్బును రియ‌ల్ ఎస్టేట్ లో పెట్టుబ‌డిగా పెట్ట‌గా ఆ మొత్తం డ‌బుల్ అయింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. బీసీల్లో కుబేరురాలిగా ఆమెకు పేరుంది. మ‌రో బీసీ నేత జోగి రమేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్థికంగా బాగా ఉన్నాడ‌ని రాజ‌కీయ వ‌ర్గాల‌కు తెలుసు. ఆయ‌న్ను ఇప్పుడు మంత్రివ‌ర్గంలోకి జ‌గ‌న్ తీసుకున్నారు. ఇక కార‌మూరి నాగేశ్వ‌ర‌రావు తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జ‌డ్పీ చైర్మ‌న్ నుంచి ఆర్థికంగా బాగా ఎదిగారు. వైఎస్ కుటుంబానికి ద‌గ్గ‌రగా ఉంటూ ప్ర‌స్తుతం జ‌గ‌న్ స‌ర్కార్ లో రెండేళ్లుగా అనూహ్యంగా సంపాదించార‌ని ఆ పార్టీలోని ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం చ‌ర్చించుకుంటోంది. ఉష‌శ్రీ చ‌ర‌ణ్ ఉన్న‌త విద్యాధికురాలే కాకుండా కర్ణాట‌క రాష్ట్రం మూలాలు ఉన్నాయి. అక్క‌డ పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వ‌హిస్తుంటార‌ని టాక్‌. ఇదే కోవలో మరో ఎస్సీ మంత్రి నారాయణస్వామి.. 1983లో చిత్తూరు జిల్లా కార్వేటినగరం సర్పంచ్ గా రాజకీయాల్లోకి ప్రవేశించి 2004 నాటికి సత్యవేడు నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2009లో ఓడినా తిరిగి 2014 నాటికి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. జగన్ కేబినెట్లో రెండోసారి మంత్రి అయ్యారు. ఆయ‌న సంపాద‌న‌ గురించి ఆ జిల్లాల‌కు చెందిన లీడ‌ర్లు క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకుంటారు. తూగో జిల్లా అమలాపురానికి చెందిన విశ్వరూప్ కు 1987లోనే కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత ఓటములు పలకరించినా 2004లో వైఎస్ హయాంలో విశ్వరూప్ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆనాటి నుంచి ఆర్థికంగా బాగా ఎదిగార‌ని స్థానికుల‌కు తెలియ‌ని అంశం కాదు. వైఎస్, రోశయ్య, కిరణ్ మంత్రివర్గాల్లో పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014, 19 ఎన్నికల్లో గెలిచి జగన్ కేబినెట్లో రెండుసార్లు మంత్రి అయ్యారు. ఇదే కోవలో తానేటి వనిత తండ్రి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చి తొలుత టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014 నుంచి వరుసగా గెలుస్తున్నారు. ఆమెకు జగన్ రెండు కేబినెట్లలోనూ చోటు దక్కింది. ఆర్థికంగా బాగా సౌండ్‌. ఎస్టీ కోటాలో రాజ‌న్న‌దొర‌ను క్యాబినెట్ లోని జ‌గ‌న్ తీసుకున్నారు. అంద‌రూ శ‌భాష్ అనుకుంటూ ప్ర‌శంసిస్తున్నారు. కానీ, ఆయ‌న చేస్తోన్న వ్యాపారాలు, సంపాదన గురించి తెలిసిన వాళ్ల మాత్రం ఎస్టీల్లో కుబేరునిగా ఆయ‌న్ను చెప్పుకుంటారు. ఎస్సీల్లోని మేరుగ నాగార్జున గురించి స‌ర్వ‌త్రా తెలిసిన కుబేరుడే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని కుబేరుల‌కు జ‌గ‌న్ పెద్ద‌పీఠ వేశార‌ని అర్థం అవుతోంది.

మిగిలిన కులాల స‌మీక‌ర‌ణ‌ల‌ను చాలా ఈజీగా జ‌గ‌న్ చేయ‌డం వెనుక రీ ప్లేస్ సిద్దాంతాన్ని తీసుకున్నారు. అవంతీ శీను (కాపు) కి పదవి తీసేసి అంబటి రాంబాబు (కాపు) కి ఇచ్చారు. ఇద్ద‌రూ నోరున్న వాళ్లు. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై విరుచుకుప‌డ‌తారు. కురసాల కన్నబాబు (కాపు) కి పదవి తీసేసి కొట్టు సత్యనారాయణ (కాపు) కి ఇచ్చారు. ఆ సామాజిక‌వ‌ర్గం ఈక్వేష‌న్ తో పాటు ప్రాంతీయ స‌మీక‌ర‌ణ తీసుకున్నారు. పాలుబోయిన అనిల్ కుమార్ (యాదవ్)కి పదవి తీసేసి కారుమూరి నాగేశ్వరరావు (యాదవ్) కి పదవి ఇచ్చారు. ఇద్ద‌రూ ఆర్థికంగా బాగా సౌండ్ పార్టీలే. పేర్ని నాని నాయుడు (కాపు) కి పదవి తీసేసి దాడిశెట్టి రాజా నాయుడు (కాపు) కి ఇచ్చారు. మోపిదేవి వెంకటరమణ(BC) కి పదవి తీసేసి చెల్లుబోయిన వేణు గోపాల్(BC) కి పదవి ఇచ్చారు. ఇద్ద‌రూ బీసీల్లోని ఆర్థిక స్తోమ‌త బాగా ఉన్న వాళ్లే. ధర్మాన కృష్ణ దాస్ (వెలమ) కి పదవి తీసేసి ధర్మాన ప్రసాదరావు (వెలమ) కి మంత్రి పదవి (ఒకే కుటుంబంకూడా) ఇచ్చారు. పాముల పుష్ప శ్రీ వాణి (ఎస్టి) కి పదవి తీసేసి రాజన్నదొర (ఎస్టి) కి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఎస్టీ లకు మేలు గొప్ప మేలు చేశామ‌నే ఫోక‌స్ చేస్తున్నారు. సుచరిత (sc) కి తీసేసి నాగార్జున ( sc) కి ఇవ్వడం గొప్ప విప్లవంగా చెప్పుకుంటున్నారు. పదవి పోయిన సామాజిక వర్గాలు ఆళ్ళ నానీ (కాపు) కొడాలి నాని ( కమ్మ) వెల్లంపల్లి శ్రీను (వైశ్య,) రంగనాధరాజు (క్షత్రియ) ఉన్నారు. గ‌త క్యాబినెట్ లోని గౌత‌మ్ రెడ్డి చ‌నిపోగా, బాలినేని శ్రీనివాస రెడ్డి కి పదవి తీసేసి మ‌రో ఇద్దరు రెడ్లు కాకాణి గోవర్ధన్ రెడ్డి , రోజా రెడ్డి కి పదవి ఇచ్చారు. ఇక్కడ కూడా సూపర్ సామాజిక న్యాయం చూపించారు. సామాజిక న్యాయంలో ఆర్థిక కోణాన్ని తీసుకున్న జ‌గ‌న్ వాల‌కాన్ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఇప్ప‌టికీ గ‌మ‌నించ‌డంలేదు. పైగా ఏపీ చరిత్ర‌లో గొప్ప సామాజిక న్యాయం ఉన్న క్యాబినెట్ గా చేసుకుంటోన్న ప్ర‌చారం వెనుక కుబేరుల వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట‌కు తీస్తే అస‌లైన భాగోతం బ‌య‌ట‌ప‌డుతుంది.