Somu Veerraju : ఏపీ అంటే అంత అలుసా.!

ఏపీ ఒక పాకిస్తాన్..కాదు ఒక ఆప్ఘ‌నిస్తాన్..కాదుకాదు ఒక బీహార్‌..ఇలా ఆ రాష్ట్రాన్ని పోల్చ‌డం ఇటీవ‌ల అలవాటుగా మారింది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏకంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను పాకిస్తాన్‌, ఆప్ఘ‌నిస్తాన్ తో పోల్చాడు. ఇటీవ‌ల డ్ర‌గ్స్ ఇష్యూ వ‌చ్చిన‌ప్పుడు ఏపీని తాలిబానిస్తాన్ గా తెలుగుదేశంలోని కొంద‌రు నేత‌లు అభివ‌ర్ణించారు.

  • Written By:
  • Updated On - January 11, 2022 / 03:11 PM IST

ఏపీ ఒక పాకిస్తాన్..కాదు ఒక ఆప్ఘ‌నిస్తాన్..కాదుకాదు ఒక బీహార్‌..ఇలా ఆ రాష్ట్రాన్ని పోల్చ‌డం ఇటీవ‌ల అలవాటుగా మారింది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏకంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను పాకిస్తాన్‌, ఆప్ఘ‌నిస్తాన్ తో పోల్చాడు. ఇటీవ‌ల డ్ర‌గ్స్ ఇష్యూ వ‌చ్చిన‌ప్పుడు ఏపీని తాలిబానిస్తాన్ గా తెలుగుదేశంలోని కొంద‌రు నేత‌లు అభివ‌ర్ణించారు. లా అండ్ ఆర్డ‌ర్ కంట్రోల్ త‌ప్పింద‌ని బీహార్ కంటే దారుణంగా ఉంద‌ని ఏపీని పోల్చడం గ‌మ‌నిస్తున్నాం. ఆ రాష్ట్రానికి ఎప్పుడూ లేనంత‌గా ఇప్పుడు డామేజ్ జ‌రుగుతోంది. అనైతిక రాజ‌కీయాల న‌డుమ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఉన్న ఇమేజ్ ని పాతాళానికి ప‌డిపోయేలా చేస్తున్నారు.క‌ర్నూలు జిల్లా ఆత్మ‌కూరు వ‌ద్ద శనివారం జ‌రిగిన సంఘ‌ట‌న బీజేపీకి రాజ‌కీయాస్త్రంగా మారింది. అక్క‌డ నిర్మిస్తోన్న ఒక ప్రార్థ‌నా మందిరం వ‌ద్ద‌కు క‌ర్నూలు జిల్లా నంద్యాల పార్ల‌మెంట్ బీజేపీ ఇంచార్జి శ్రీకాంత్ రెడ్డి వెళ్లాడు. అక్ర‌మంగా నిర్మిస్తున్నార‌ని ఆ ప్రాంతాన్ని ప‌రిశీలించాడు. దీంతో ప్రార్థ‌నా మందిరాన్ని నిర్మిస్తోన్న వ‌ర్గం శ్రీకాంత్ రెడ్డి మీద దాడి ప్ర‌య‌త్నం చేసింది. అప్ర‌మ‌త్త‌మైన శ్రీకాంత్ రెడ్డి అక్క‌డి పోలీస్ స్టేష‌న్ కు వెళ్లాడు.ఆయ‌న్ను అనుస‌రిస్తూ పోలీస్ స్టేష‌న్ కు వెళ్లిన ఆ వ‌ర్గం శ్రీకాంత్ రెడ్డి కారును ధ్వంసం చేసింది. అక్క‌డున్న బైకుల‌ను ఆ వ‌ర్గానికి చెందిన వాళ్లు త‌గుల బెట్టారు. అడ్డుకున్న పోలీసుల‌పై దాడి చేసి నానా బీభ‌త్సం సృష్టించారు. ఆ సంద‌ర్భంగా కొంద‌రు పోలీసులు గాయ‌ప‌డ్డారు. ప‌రిస్థితిని స‌మీక్షించిన పోలీసు ఉన్న‌తాధికారులు 144 సెక్ష‌న్ ను అమ‌లు చేస్తున్నారు. కానీ, దాడికి దిగిన కొంద‌రిపై మాత్ర‌మే కేసులు న‌మోదు చేశారు.

ఆత్మ‌కూరు కేంద్రంగా ముస్లింల‌కు, బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ధ్య భ‌యాన‌క యుద్ధ‌మే జ‌రిగింది. ఆ సంద‌ర్భంగా గాయ‌ప‌డిన శ్రీకాంత్ రెడ్డిని ప‌రామ‌ర్శించ‌డానికి బీజేపీ నేతలు అక్క‌డికి వెళ్లారు. వాళ్ల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం పోలీసులు చేయ‌డంతో ఆగ్ర‌హించారు. పైగా దాడికి దిగిన వాళ్ల‌కు అండ‌గా డిప్యూటీ సీఎం అంజాద్ ఖాన్‌, ఎమ్మెల్యే అపీజ్ ఖాన్‌, వైసీపీ నేత శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ఉండ‌డాన్ని బీజేపీ త‌ప్పుబ‌డుతోంది. ఈ మొత్తం సంఘ‌ట‌న‌పై రాజ‌కీయ స‌మీక్ష చేసిన వీర్రాజు ఏపీని ఆప్ఘ‌నిస్తాన్, పాకిస్తాన్ గా మార్చేశార‌ని మండిప‌డుతున్నాడు.ఇంచుమించు ఇలాంటి సంఘ‌ట‌న గుంటూరు జిల్లా దుర్గి మండ‌ల కేంద్రం స‌మీపంలోని ఆత్మ‌కూరులో ఏడాది క్రితం జ‌రిగింది. అక్క‌డి ఎస్సీల‌పై కొంద‌రు వైసీపీ కార్య‌క‌ర్తలు దాడి చేయ‌డంతో ఊరు వ‌దిలి పోయారు. ఇళ్ల‌కు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. వాళ్లంతా టీడీపీకి చెందిన ఎస్సీ ఓట‌ర్లుగా ఆ పార్టీ గుర్తించింది. దీంతో వాళ్ల‌కు అండ‌గా ఉండ‌డానికి చ‌లో ఆత్మ‌కూరు కార్య‌క్ర‌మాన్ని చంద్ర‌బాబునాయుడు అప్ప‌ట్లో నిర్వ‌హించాడు. ఆ సంద‌ర్భంగా వైసీపీ, టీడీపీ న‌డుమ ప‌ల్నాటి యుద్ధం త‌ర‌హాలో రాజ‌కీయం న‌డిచింది. ఆ సంద‌ర్భంగా ఏపీలోని లా అండ్ ఆర్డ‌ర్ ను ప్ర‌శ్నిస్తూ..కొంద‌రు టీడీపీ లీడ‌ర్లు ఏపీని బీహార్ మాదిరిగా మార్చేశార‌ని విమ‌ర్శించారు.ఇటీవ‌ల గుజ‌రాత్ లోని ముంద్రా పోర్టు నుంచి స్మ‌గ్లింగ్ అయిన డ్ర‌గ్స్ ను ఏపీ పోలీసులు ప‌ట్టుకున్నారు. వేల కోట్ల రూపాయ‌ల విలువైన డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ తాడేప‌ల్లి ప్యాలెస్ స‌హ‌కారంతో జ‌రుగుతుంద‌ని టీడీపీ ఆరోపించింది. కాకినాడ పోర్టు నుంచి ఓడ‌ల్లో బియ్యం ఎగుమ‌తి చేస్తూ ,డ్ర‌గ్స్ దిగుమ‌తి చేసుకుంటున్నార‌ని ఆనాడు దుమారం రేగింది. వైసీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని తాడేప‌ల్లి ప్యాలెస్ అండ‌తో న‌డుపుతున్నాడ‌ని టీడీపీ లీడ‌ర్ ప‌ట్టాభి ప‌లు ఆరోప‌ణ‌ల‌కు దిగాడు. ఆ సంద‌ర్భంగా ఏపీని తాలిబానిస్తాన్ గా మార్చేస్తున్నార‌ని ఆయ‌న ఆందోళ‌న చెందాడు. ఇలా..ఏపీని ఎవ‌రికి వారే దిగ‌జార్చుతూ మాట్లాడ‌డం గ‌మ‌నార్హం.

Also Read :  హూ కిల్డ్ టాలీవుడ్‌

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విదేశీ టూర్ల‌కు వెళ్లిన‌ప్పుడు భార‌త్ లోని అవినీతి గురించి ప్ర‌స్తావించాడు. గ‌తంలో భార‌త్ అవినీతి, అక్ర‌మాల‌కు గ‌డ్డ‌గా ఉండేద‌ని, ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేద‌ని తెలియ‌చేసే ప్ర‌య‌త్నం చేశాడు. ఆ సంద‌ర్భంగా యావ‌త్తు భార‌తావ‌ని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై మండిప‌డింది. సోష‌ల్ మీడియా వేదికగా విదేశీ గ‌డ్డ‌పై మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌ను దుయ్య‌బ‌ట్టారు. ఆ త‌రువాత ఎప్పుడూ మోడీ అలాంటి వ్యాఖ్య‌ల‌ను రిపీట్ చేసే ధైర్యం చేయ‌లేదు.రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ గురించి ప‌దేప‌దే రాజ‌కీయ నాయ‌కులు సునాయాసంగా మాట్లాడేస్తుంటారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో అలాంటి కామెంట్ల స్పీడ్ పెరుగుతోంది. అందుకే, రాయ‌ల‌సీమ ప‌రిర‌క్ష‌ణ క‌మిటీకి చెందిన వాళ్లు ఫ్యాక్ష‌న్ లాగా రాయ‌ల‌సీమ‌ను చూడొద్ద‌ని ప‌లుమార్లు హిత‌వు ప‌లికారు. అక్క‌డి యువ‌కులు తిరుగుబాటును కూడా వ్య‌క్తం చేశారు. కానీ, ఏపీని పాకిస్తాన్‌, ఆప్ఘ‌నిస్తాన్‌, తాలిబానిస్తాన్‌, బీహార్ అంటోన్న వాళ్లను ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ నిల‌దీయ‌లేదు. అందుకే, ఇష్టానుసారంగా ఏపీని కించ‌ప‌రుస్తున్నారు. ఒక‌ప్పుడు ఏపీ అంటే..ఢిల్లీ పీఠం వ‌ణికిపోయేది. దేశ రాజ‌కీయాల‌ను శాసించే స్థాయికి స్వ‌ర్గీయ ఎన్టీఆర్‌, దివంగ‌త వైఎస్ఆర్ తీసుకెళ్లారు. ఎంద‌రో మ‌హానుభావుల‌ను అందించిన గ‌డ్డ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌. అలాంటి ప‌విత్ర‌మైన రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా కించ‌ప‌ర‌స్తూ సీఎం జ‌గ‌న్ మీద క‌సితీర్చుకోవ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బో అంద‌రూ ఆలోచించాలి. దీనిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక యుద్ధం జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.