Somu Veerraju: వీర్రాజు `నాటుకోడి` స్కీం

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు యువ‌కుల‌కు నాటు కోళ్ల స్కీంను ప్ర‌క‌టించాడు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో నాటు కోళ్ల ఫారాల‌ను పెట్టించ‌డం పార్టీ ల‌క్ష్యమ‌ని వెల్ల‌డించాడు. రాజ‌మ‌హేంద్ర వ‌రంలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో నాటు కోళ్ల ప్ర‌క‌ట‌న చేసి మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కాడు.

  • Written By:
  • Updated On - January 1, 2022 / 04:20 PM IST

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు యువ‌కుల‌కు నాటు కోళ్ల స్కీంను ప్ర‌క‌టించాడు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో నాటు కోళ్ల ఫారాల‌ను పెట్టించ‌డం పార్టీ ల‌క్ష్యమ‌ని వెల్ల‌డించాడు. రాజ‌మ‌హేంద్ర వ‌రంలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో నాటు కోళ్ల ప్ర‌క‌ట‌న చేసి మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కాడు. చీప్ లిక్క‌ర్ ను కేవ‌లం రూ. 70 ల‌కు అందిస్తామ‌ని చేసిన వ్యాఖ్య‌ల వేడి చ‌ల్లార‌క ముందే, యువ‌కుల‌కు నాటు కోళ్ల స్కీం ను తెర‌మీద‌కు తీసుకొచ్చాడు. దీంతో సారా వీర్రాజు, నాటు వీర్రాజు అంటూ నెటిజ‌న్లు సోష‌ల్ మీడియా వేదికగా ఆడుకుంటున్నారు. అధికారంలోకి రావ‌డానికి అడ్డుగోలు హామీల‌ను ఇవ్వ‌డం రాజ‌కీయ పార్టీల‌కు ఆన‌వాయితీగా మారింది. దిగ‌జారుడు హామీల‌ను ఇవ్వ‌డానికి ఏ మాత్రం ఏపీ బీజేపీ సందేహించ‌డంలేదు. ఏదో ఒక విధంగా ఉనికి కాపాడుకోవాల‌నే ఆలోచ‌న‌తో జాతీయ పార్టీ కాస్తా..ఉప ప్రాంతీయ పార్టీగా దిగ‌జారింది. ఆ స్థాయిలోనే హామీల‌ను గుప్పిస్తోంది.జ‌గ‌న్ స‌ర్కార్ పై ప్ర‌జాగ్ర‌హ‌స‌భ‌ను పెట్టిన బీజేపీ విజ‌య‌వాడ కేంద్రంగా చీప్ లిక్క‌ర్ స్కీంను ప్ర‌క‌టించింది. అవ‌స‌ర‌మైతే, రూ. 50ల‌కు చీప్ లిక్క‌ర్ అందిస్తామ‌ని సోము వీర్రాజు ప్ర‌క‌టించాడు.

టిప్పు సుల్తాన్ విగ్ర‌హం అంశాన్ని రాయ‌ల‌సీమ ప్రాంతంలో రాజ‌కీయాన్ని బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల ముందు బీజేపీ వేడెక్కించింది. ఆ విగ్ర‌హాన్ని తొల‌గించాల‌ని పెద్ద ఎత్తున ఆందోళ‌నకు ఆ పార్టీ క్యాడ‌ర్ దిగింది. తాజాగా గుంటూరులోని జిన్నా ట‌వ‌ర్, నాజ్ సెంట‌ర్ల పేర్ల‌ను మార్చాల‌ని బీజేపీ డిమాండ్. అంతేకాదు, ధ‌వళేశ్వ‌రం ప్రాజెక్టు మీద ఉన్న స‌ర్ ఆర్ధర్ కాట‌న్ తో పాటు ప్రాజెక్టు నిర్మాణంలో కీల‌క పాత్ర పోషించిన వీర‌న్న పేరు పెట్టాల‌ని ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు చెబుతున్నాడు. విశాఖ‌లోని కింగ్ జార్జి ఆస్ప‌త్రి పేరును తొల‌గించి, కింగ్ జార్జి స్థానంలో తెన్నేటి విశ్వనాథం, గౌతు ల‌చ్చ‌న్న పేర్ల‌ను పెట్టాల‌ని ప్ర‌తిపాద‌న పెట్టారు.

ఒక వేళ ఇప్పుడున్న ప్ర‌భుత్వం ఆపేర్ల‌ను మార్చ‌క‌పోతే, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత బీజేపీ మార్చేస్తుంద‌ని వీర్రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. వాస్తవంగా విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాలు పోల‌వ‌రం, అమ‌రావ‌తి, విశాఖ రైల్వే జోన్, వెనుబ‌డిన ప్రాంతాల‌కు బుందేల్ గ‌డ్ ప్యాకేజి, లోటు బ‌డ్జెట్ , షెడ్యూల్ 9,10 అంశాల‌ను ప‌రిష్క‌రించ‌డం , ప్ర‌త్యేక హోదా త‌దిత‌రాల‌ను ప్ర‌స్తావించ‌కుండా చౌక‌బారు డిమాండ్ల‌ను ఏపీ బీజేపీ చేయ‌డం ఆ పార్టీ దిగ‌జారుడుతనానికి ప‌రాకాష్ట‌గా విశ్లేష‌కులు భావిస్తున్నారు.