Salaries & Pensions: జగనన్నా! జీతాలేవి..?

జీతాలు వేయలేదు. పెన్షన్లు ఇవ్వలేదు. ఐదో తేదీ వచ్చినా ఏపీలో ఉద్యోగులకు, వృద్ధులకు దురుచూపులు తప్పడం లేదు.

  • Written By:
  • Updated On - May 6, 2022 / 12:08 PM IST

జీతాలు వేయలేదు. పెన్షన్లు ఇవ్వలేదు. ఐదో తేదీ వచ్చినా ఏపీలో ఉద్యోగులకు, వృద్ధులకు దురుచూపులు తప్పడం లేదు. వేతనాల పద్దు చూస్తే.. రూ.5,400 కోట్లుంది. ఇప్పటివరకు ఇచ్చింది దాదాపు రూ.2000 కోట్లే. ఇప్పటికే ట్రెజరీ ఉద్యోగులకు ఫోన్లు మీద ఫోన్లు వస్తున్నాయి. జీతాలు ఎప్పుడు పడతాయి సార్.. ఎప్పుడు పడతాయి మేడం అంటూ ఆవేదనతో అడుగుతున్నారు. తమకు ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటి కోసం
నెల నెలా ఎదురుచూడక తప్పడం లేదు. అయినా ప్రతీ నెలా ఈ ఎదురుచూపులేంటి సార్ అని ప్రశ్నిస్తున్నారు ఏపీలో ఉద్యోగులు, పెన్షనర్లు. ఈనెల ఐదో తేదీ నాటికి దాదాపు సగం మందికి ఇంకా జీతాలు, పెన్షన్లు చెల్లించలేదు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే.. ఈనెల 10, 15, 20వ తేదీ వరకు జీతాలు, పెన్షన్లు పడుతూనే ఉంటాయని అంచనా వేస్తున్నారు. నెలలో కొద్ది మంది ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు ఇచ్చి ఒకటో తేదీనే ఇచ్చేశాం అని చెప్పుకుంటున్నారని విమర్శిస్తున్నారు.

చాలామంది తమ ఆర్థిక అవసరాల కోసం అప్పులు చేసి ఈఎంఐలు పెట్టుకుంటారు. దానికి కటాఫ్ డేట్ గా ఐదో తేదీని ఎక్కువమంది పెట్టుకుంటారు. ఒకవేళ ఆ తేదీలోపు ఈఎంఐలు చెల్లించలేకపోతే చెక్ బౌన్స్ లు అవ్వడం వల్ల సమస్యలు తప్పవు. ఇక పెన్షనర్ల కష్టాలు చెప్పనలవి కాదు. మందులు కొనుక్కోవాలన్నా పెన్షన్ డబ్బు కోసం ఎదురుచూడాల్సి వస్తోందని వాపోతున్నారు. సమయానికి జీతాలు పడకపోవడం వల్ల ఇంటి అద్దెలు, పచారీ బిల్లులు, పిల్లల స్కూలు ఫీజులు కూడా చెల్లించడం కష్టమవుతోందని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖజానా వైపే చూస్తోంది. అది ఖాళీగా దర్శనమిస్తోంది. కొత్త అప్పుల కోసం ప్రతీ నెలా ట్రై చేస్తోంది. ఇప్పటికే వేరువేరు మార్గాల్లో అప్పులు తీసుకుంటున్నారని దానికి తప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారని కేంద్రం రాష్ట్రాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వచ్చే నెల నుంచి ఏపీ బండి ఎలా నడుస్తుందా అని ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొందంటున్నారు విశ్లేషకులు.