PRC Issue : ఉద్యోగుల స‌మ్మెపై సోష‌ల్ వార్

అభ‌య‌, నిర్భ‌య సంఘ‌ట‌న‌లు, అన్నా హ‌జారే అవినీతి వ్య‌తిరేక ఉద్య‌మం సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా ఎలా వ్య‌వ‌హ‌రించిందో చూశాం.

  • Written By:
  • Updated On - January 29, 2022 / 01:03 PM IST

అభ‌య‌, నిర్భ‌య సంఘ‌ట‌న‌లు, అన్నా హ‌జారే అవినీతి వ్య‌తిరేక ఉద్య‌మం సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా ఎలా వ్య‌వ‌హ‌రించిందో చూశాం. స‌రిగ్గా, అదే త‌ర‌హాలో ఏపీ ఉద్యోగుల వాల‌కంపై సోష‌ల్ మీడియాలో వార్ ప్రారంభం అయింది. ఉద్యోగుల అవినీతి, వాళ్ల జీతాలు, ప‌నితీరుపై ప‌లు ర‌కాల పోస్టులను నెటిజ‌న్లు పోస్ట్ చేస్తున్నారు. ఇదంతా పేటీఎం బ్యాంచ్ చేస్తోన్న ప్ర‌చారం అంటూ ఉద్యోగ సంఘాల నేత‌లు భావిస్తున్నారు. అందుకు ప్ర‌తిగా ఎల్లో బ్యాచ్ పోస్టులు కూడా జ‌గ‌న్ స‌ర్కార్ మీద దాడికి దిగింది. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా ఉద్యోగుల అనుకూల‌, వ్య‌తిరేక పోస్టుల‌తో యుద్ధం ప్రారంభం అయింది.రాజ‌కీయ పార్టీల‌ను స‌మ్మెలోకి రానివ్వ‌మ‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు ముందే ప్ర‌క‌టించారు. ఏ రాజ‌కీయ పార్టీకి సంబంధం లేకుండా జరుగుతోన్న స్వ‌చ్చంధ స‌మ్మెగా వాళ్లు చెబుతున్నారు. కానీ, అమ‌రావ‌తి జేఏసీ మ‌ద్ధ‌తును తీసుకున్నారు. ఆ జేఏసీపై టీడీపీ ముద్ర ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. అలాంటి జేఏసీ మ‌ద్ధ‌తు తీసుకోవ‌డంతో పాటు రాజ‌కీయ పార్టీల‌కు అనుబంధంగా ఉండే కార్మిక సంఘాలను కూడా కూడ‌గ‌ట్టారు. ఫ‌లితంగా ప్ర‌త్య‌క్షంగా లేక‌పోయిన‌ప్ప‌ట‌కీ ప‌రోక్షంగా రాజ‌కీయ పార్టీల వెన్నుదన్ను ఉద్యోగ సంఘాల స‌మ్మె వెనుక ఉంద‌ని స్ప‌ష్టం అవుతోంది. పైగా ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొడ‌తాం..ఎక్కిస్తాం..అంటూ స‌మ్మె నోటీస్ ఇవ్వ‌క‌ముందే బండి శ్రీనివాస‌రావు చేసిన వ్యాఖ్య‌ల క్ర‌మంలో విప‌క్షాల మ‌ద్ధ‌తు సంపూర్ణంగా ఉంద‌ని జ‌గ‌న్ స‌ర్కార్‌ భావిస్తోంది.

ప్ర‌భుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంద‌ని ఉద్యోగులు మొద‌టి నుంచి చెబుతున్నారు. ఆర్థిక ఎమ‌ర్జెన్సీ ని చూపుతూ రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని చాలా సంద‌ర్భాల్లో విప‌క్షాలు డిమాండ్ కూడా చేశాయి. ఆ క్ర‌మంలో పీఆర్సీ తో పాటు 71 డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం ముందు ఉంచ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బో..ఉద్యోగులు చెప్పాలి. పీఆర్సీ ప్ర‌కటించ‌డానికి ముందుగా ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో ప్ర‌భుత్వం సంప్ర‌దింపులు జ‌రిగిన మాట వాస్త‌వం. నేరుగా సీఎం జ‌గ‌న్ తో కూడా ఉద్యోగ సంఘాల నేత‌లు భేటీ అయ్యారు. ఆ సంద‌ర్భంగా వాళ్లు పెట్టాల్సిన ప్ర‌తిపాద‌న‌ల‌ను పెట్టారు. ప్ర‌భుత్వం వేసిన సీఎస్ స‌మీర్ శ‌ర్మ క‌మిటీ అధ్య‌య‌నం చేసిన త‌రువాత కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కూడా ప‌రిశీలించి తుది నిర్ణ‌యం తీసుకున్నారు. ఆర్థిక ప‌రిస్థితి బాగాలేక‌పోయిన‌ప్ప‌టికీ 14.29శాతం ఫిట్మెంట్ ను ప్ర‌క‌టించారు. మిగిలిన గొంతెమ్మ కోర్కెల‌ను కొన్నిటిని తీర్చ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో బ‌య‌ట‌కు వ‌చ్చిన ఉద్యోగ సంఘాల నేత‌లు సంబురాలు చేసుకున్నారు.కొత్త పీఆర్సీ ప్ర‌క‌టించిన రెండు రోజుల త‌రువాత హ‌ఠాత్తుగా ఏమైయిందోగానీ…స‌మ్మెకు వెళుతున్నామ‌ని సూచాయ‌గా చెప్పారు. అప్ప‌టికే స‌మ్మె షెడ్యూల్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. వాళ్లు స‌మ్మె నోటీస్ ఇవ్వ‌డానికి నాలుగు రోజుల ముందే మీడియాలో సమ్మెకు సంబంధించిన షెడ్యూల్ వైర‌ల్ అయింది. ఇవ‌న్నీ గ‌మ‌నిస్తే, ఉద్యోగ సంఘాలు, ఉద్యోగుల వెనుక ఎవ‌రూ లేర‌ని న‌మ్మ‌గ‌ల‌మా? అంటే డౌటే. స‌మ్మె నోటీస్ ఇచ్చిన తరువాత కూడా ప్ర‌భుత్వం మంత్రుల క‌మిటీని వేసి చ‌ర్చ‌ల‌కు ఆహ్వానం ప‌లికింది. ఆ క‌మిటీకి గుర్తింపు లేద‌ని భావించ‌డంతో జీవోను కూడా ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ చ‌ర్చ‌ల‌కు రావ‌డ‌గానికి ఉద్యోగ నేత‌లు ఇష్ట‌ప‌డ‌డంలేదు. పైగా ప్ర‌భుత్వం జారీ చేసిన జీవోల‌ను ర‌ద్దు చేసిన తరువాత వ‌స్తామ‌ని చెబుతున్నారు. ఇంకో వైపు హైకోర్టు కూడా ఉద్యోగుల‌కు మొట్టికాయ‌లు వేసింది. పీఆర్సీ అంటే జీతాలు పెంచ‌డం కాద‌ని తేల్చి చెప్పింది.

ఉద్యోగ సంఘాల నేత‌ల్లోనే కొంద‌రు శుక్రవారం మంత్రుల క‌మిటీతో క‌లిశారు. ఆ విష‌యాన్ని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి చెబుతున్నారు. కానీ, క‌లిసిన ఉద్యోగ నేత‌లు మాత్రం ర‌హ‌స్యంగా ఆ విష‌యాన్ని ఉంచారు. ఈ ప‌రిణామం ఆధారంగా ఉద్యోగ నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యంగానీ, ఐక్య‌త‌గానీ లేద‌ని అర్థం అవుతోంది. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన పీఆర్సీ మీద కొంద‌రు ఉద్యోగ నేత‌లు సంతృప్తిగానే ఉన్నార‌ని స‌ర్కార్ భావిస్తోంది. వాస్త‌వాల‌కు భిన్నంగా ఆలోచిస్తోన్న వాళ్లు మాత్ర‌మే స‌మ్మెకు కాలుదువ్వుతున్నార‌ని అనుమానిస్తోంది. కొత్త పీఆర్సీ కార‌ణంగా 12వేల కోట్ల రూపాయ‌ల భారం ప‌డుతుంద‌ని ప్ర‌భుత్వం వేసిన సీఎస్ క‌మిటీ అంచ‌నా వేసింది. ఆ విష‌యాన్ని గ‌మ‌నించ‌కుండా జీతాలు త‌గ్గిపోతున్నాయ‌ని నానా యాగీ కొంద‌రు చేస్తున్నారు. భారం ప‌డిన ఆ 12వేల కోట్ల సంగ‌తి ఏంట‌ని అడిగితే..ఉద్యోగ నేత‌ల నుంచి సూటి స‌మాధానం రావడంలేదు. కొత్త జీవోల‌ను ర‌ద్దు చేయ‌మ‌ని డిమాండ్ మిన‌హా కొత్త పీఆర్సీలోని లోపాల‌ను స్ప‌ష్టంగా చెప్ప‌లేక‌పోతున్నారు. ఆ క్ర‌మంలో గ‌త కొన్ని రోజులుగా ప్ర‌భుత్వానికి, ఉద్యోగుల‌కు మ‌ధ్య న‌డుస్తోన్న పీఆర్సీ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాకు ఎక్కింది. ప్ర‌ధాన మీడియా నిజాల‌ను దాస్తోంద‌ని చాలా రోజులుగా సామాన్యులు భావిస్తున్నారు. బ్లూ, ఎల్లో, పింక్‌, రెడ్ మీడియాలు ఇస్తోన్న స‌మాచారాన్ని సంపూర్ణంగా విశ్వ‌సించ‌డంలేదు. అందుకే, సోష‌ల్ మీడియా వేదిక‌గా ఉద్యోగుల స‌మ్మెపై నెటిజ‌న్లు పోస్టులు పెడుతున్నారు. శాస్త్రీయ‌బ‌ద్ధంగా కొన్ని అంశాల‌ను జోడిస్తూ ఉద్యోగుల వాల‌కంపై యుద్ధం జ‌రుగుతోంది. సో..ఆనాడు జ‌రిగిన అన్నా హ‌జారే అవినీతి వ్య‌తిరేక ఉద్య‌మానికి మ‌ద్ధ‌తుగా నిలిచిన సోష‌ల్ మీడియా ఇప్పుడు ఉద్యోగుల స‌మ్మెకు వ్య‌తిరేకంగా ఉద్య‌మాన్ని ప్రారంభించింది. అంతిమ విజ‌యం ఎవ‌రిదో..చూద్దాం.