బాపట్ల జిల్లా బల్లికురవ మండలం సమీపంలో ఉన్న సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం (Granite Quarry Accident) జరిగింది. ఆదివారం ఉదయం క్వారీలో పనిచేస్తున్న కార్మికులపై భారీ రాళ్లు పడటంతో ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఘటనకు సంబంధించి సహాయక చర్యలు తక్షణమే ప్రారంభించగా, ఇప్పటివరకు నలుగురు మృతదేహాలను వెలికితీశారు. మిగతా ఇద్దరి మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటన సమయంలో క్వారీలో సుమారు 16 మంది కార్మికులు పని చేస్తుండగా, గాయపడిన మరో 10 మందిని నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
ఈ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో తక్షణమే మాట్లాడిన సీఎం, గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కార్మికుల ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. రోజువారీ కూలీలు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమని ఆయన అన్నారు. గాయపడిన వారికి తక్షణ వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించిన లోకేష్, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ ఘోర ప్రమాదంతో క్వారీలలో కార్మికులకు సరైన సురక్షిత చర్యలు తీసుకోవడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. క్వారీలో భద్రతా చర్యలు పాటించడంలో యాజమాన్యం విఫలమైందా? అధికారులు పర్యవేక్షణలో లేనివ్వడం వల్లేనా ఈ ప్రమాదం జరిగిందా? అనే దానిపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరింత కఠిన నిబంధనలు తీసుకురావాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.