AP Liquor Scam : గత వైసీపీ హయాంలో జరిగిన ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నోటీసులు జారీ చేసింది. సిట్ అధికారులు నేరుగా హైదరాబాద్ వెళ్లి, నిందితుల నివాసాల్లోకి చేరుకుని నోటీసులు అందజేశారు. సిట్ జారీ చేసిన నోటీసుల ప్రకారం, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో ఆయనకు ప్రత్యేక కార్యదర్శిగా (OSD) పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డికి నోటీసులు అందాయి. అలాగే భారతీ సిమెంట్స్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, ధనుంజయ్ రెడ్డి, రోహిత్ రెడ్డిలకు కూడా విచారణ కోసం హాజరయ్యేలా ఆదేశించారు.
Read Also: IPL Suspended: ఐపీఎల్ 2025 వాయిదాపై బీసీసీఐ బిగ్ అప్డేట్!
ఈ నిందితులపై భారీ స్థాయిలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే కేసులు నమోదు అయ్యాయి. అధికారిక స్థాయిలో వచ్చిన సమాచారం ప్రకారం, మద్యం కేటాయింపుల్లో మోసాలు, లైసెన్సుల మంజూరులో అక్రమ లావాదేవీలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణంలో పెద్ద ఎత్తున మద్యం కాంట్రాక్టులు బినామీల పేర్లపై మంజూరైనట్లు, వారితో ఉన్న సంబంధాల ఆధారంగా ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. సిట్ విచారణలో ఇప్పటికే పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పెద్ద మొత్తంలో నిధుల మళ్లింపుల వివరాలు, కాంట్రాక్టులకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు సమాచారం. విచారణలో భాగంగా నోటీసులు అందుకున్న నిందితులను తక్షణమే హాజరు కావాలని సూచించారు. వారు తప్పుకుంటే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వైసీపీ హయాంలో తీసుకున్న పాలనాపరమైన నిర్ణయాలపై ప్రశ్నలు మళ్ళీ ఉత్పన్నమవుతున్నాయి. ఇది ఎన్నికల నేపథ్యంలో మరింత రాజకీయ దుమారం రేపే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.