AP Liquor Case: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం (AP Liquor Case) కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా భావించే నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన పది కంపెనీల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, విశాఖపట్నంలోని ఐదు కార్యాలయాలపై సిట్ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి.
హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3లోని స్నేహ హౌస్‌లో సిట్ ప్రధానంగా సోదాలు నిర్వహించింది. అదేవిధంగా బంజారా హిల్స్ రోడ్ నంబర్ 2లోని సాగర్ సొసైటీ, కాటేదాన్-రాజేంద్రనగర్, ఖైరతాబాద్-కమలాపురి కాలనీ ఫేజ్ 1లోని కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేపట్టారు. విశాఖపట్నంలోని వాల్తేర్ రోడ్-వెస్ట్ వింగ్ లో ఉన్న ఒక కార్యాలయంలోనూ సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ సోదాల్లో భాగంగా సునీల్ రెడ్డికి చెందిన మొత్తం పది కంపెనీలకు సంబంధించిన కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీల రికార్డులు, డిజిటల్ డేటాను సిట్ బృందాలు పరిశీలించాయి. సునీల్ రెడ్డి హైదరాబాద్‌లో ఎనిమిది కంపెనీలకు నాలుగు కార్యాలయాలు, విశాఖపట్నంలో రెండు కంపెనీలకు ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నట్లు దర్యాప్తులో గుర్తించారు.
Also Read: GST Cut : భారీగా తగ్గిన హోండా యాక్టివా ధర ..కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే ఛాన్స్ !
ఈ మద్యం కేసులో సునీల్ రెడ్డి పాత్రపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏపీలో మద్యం సరఫరా, అమ్మకాల విషయంలో ఆయన పలు కంపెనీల తరపున అక్రమాలకు పాల్పడినట్లు సిట్ అనుమానిస్తోంది. ఈ సోదాల ద్వారా సేకరించిన ఆధారాలను విశ్లేషించి కేసులో మరింత పురోగతి సాధించాలని సిట్ భావిస్తోంది. ఈ సోదాలపై సునీల్ రెడ్డి లేదా ఆయన తరపున ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈ దర్యాప్తు ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కేసులో దర్యాప్తు వేగవంతం కావడం, కీలక వ్యక్తుల కంపెనీల్లో సోదాలు జరగడం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సోదాల అనంతరం, తదుపరి చర్యలపై సిట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగా సునీల్ రెడ్డిని విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామాలు ఏపీ మద్యం కేసులో ఒక కీలక మలుపుగా మారనున్నాయి.