Mark Shankar : సింగపూర్‌లోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీపంలో ఉన్న రివర్ వ్యాలీ రోడ్ స్కూలులో ఏప్రిల్ 8న జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు భారతీయ వలస కార్మికులు అత్యంత సాహసోపేతంగా వ్యవహరించారు. అగ్ని ప్రమాద స్థలంలో చిక్కుకున్న మార్క్ శంకర్((Mark Shankar) సహా పలువురు స్కూలు పిల్లలను వారు కాపాడి బయటికి తీసుకొచ్చారు. ఆ పిల్లలను వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు సహకరించారు. స్కూలు పిల్లలను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన ఆ భారతీయ కార్మికులను సింగపూర్ ప్రభుత్వం సత్కరించింది. వారందరికీ ‘లైఫ్ సేవర్’ అవార్డును ప్రదానం చేసింది. ఈమేరకు వివరాలతో సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది.
Also Read :Delhi Tremors: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీని తాకిన ప్రకంపనలు
ఘటన ఇలా జరిగింది..
ఈ అవార్డును పొందిన భారతీయ కార్మికులు అగ్ని ప్రమాదం జరిగిన తీరు గురించి వివరించారు. ‘‘మేం చూసే సరికి ఆ స్కూలు బిల్డింగుకు భారీగా మంటలు అంటుకున్నాయి. స్కూలులో నుంచి పిల్లల ఆర్తనాదాలు మాకు వినిపించాయి. లోపల ఉన్న పిల్లలంతా వణికిపోతున్నారు. కాపాడండి అంటూ అరుస్తున్నారు. కొందరు స్కూలు పిల్లలైతే మూడో అంతస్తు నుంచి దూకేందుకు ట్రై చేశారు. మేం వాళ్లను చూసి.. దూకొద్దని సైగలు చేశాం. దీంతో వారంతా దూకకుండా అక్కడే ఉండిపోయారు. వేగంగా మేం స్కూలు బిల్డింగ్‌లోకి ప్రవేశించాం. చుట్టూ ఉన్న మంటలను దాటుకొని వెళ్లి.. పిల్లలను కాపాడి బయటికి తీసుకొచ్చాం. ఒక పాపను మాత్రం మేం కాపాడలేకపోయాం. ఆ పసికందును కూడా మేం కాపాడగలిగి ఉంటే బాగుండేది. అప్పటికే ఆ పాప మంటల్లో కాలిపోయింది. ఆమెను రక్షించలేకపోయినందుకు చింతిస్తున్నాం’’ అని సింగపూర్‌లోని సదరు భారతీయ కార్మికులు చెప్పుకొచ్చారు. ‘‘స్కూలులో జరిగిన ఆ అగ్ని ప్రమాదంలో 15 మంది పిల్లలు సహా మొత్తం 20 మంది గాయపడ్డారు’’ అని వారు వివరించారు.