Site icon HashtagU Telugu

Siddham Public Meeting : టీడీపీని మళ్లీ మడతపెట్టేందుకు సిద్ధమా..? – జగన్

Cm Jagan Rapthadu

Cm Jagan Rapthadu

‘మళ్లీ టిడిపి(TDP)ని ఓడించేందుకు.. చొక్కాలు మడత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారా? రంగు రంగుల మేనిఫెస్టోతో చంద్రబాబు మళ్లీ ప్రజల్ని మోసం చేసేందుకు వస్తున్నారు. ఆయన వాగ్ధానాలను నమ్మొద్దు. పథకాలు కొనసాగాలంటే వైసీపీని గెలిపించుకోవాలి. కార్యకర్తలు, వాలంటీర్లు ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి’ అని రాప్తాడు వేదికగా వైసీపీ అధినేత, సీఎం జగన్ పిలుపునిచ్చారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ (Jagan) ‘సిద్ధం’ పేరుతో వరుస సభలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గర అవుతున్నారు. ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూనే..ప్రతిపక్ష పార్టీల ఫై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్బంగా ఆదివారం రాప్తాడులో నిర్వ‌హించిన సిద్ధం (Siddham Public Meeting) ఎన్నిక‌ల శంఖారావం స‌భ‌లో సీఎం జగన్ పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశారు.

విశ్వసనీయతకు, వంచనకు మధ్య యుద్ధం జరుగుతోందని, చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకం గుర్తుకు రాదు. ఎగ్గొట్టేవాడు .. 10 రూపాయల వడ్డీ అయినా ఇస్తాను అంటాడు. మానిఫెస్టో మాయం చేసి .. హామీలు ఎగ్గొట్టే బాబు కేజీ బంగారం ఇస్తాను అంటాడు. చుక్కల్ని దింపుతా అంటాడు అంటూ చంద్రబాబుకు సీఎం జగన్‌ చురకలు అంటించారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతూ ఉండాలి. సైకిల్ ఎప్పుడూ ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి అంటూ సీఎం జగన్‌ పంచ్‌ డైలాగ్‌లు విసిరారు. 125 సార్లు బటన్ నొక్కి 2.55 లక్షల కోట్లు పేదలకు ఇచ్చాం. ఒక్కసారి ఆశీర్వదిస్తేనే ఎంతో చేశా. మీరు 2, 3 సార్లు ఆశీర్వదిస్తే.. మరింత మేలు మీకు, రాష్ట్రానికి జరుగుతుంద‌ని జగన్‌ పేర్కొన్నారు.

జిల్లాల పునర్విభజన తరువాత రాయలసీమకు జల సముద్రం తరలి వస్తే… ఈ రోజు రాప్తాడుకు జన సముద్రం తరలి వచ్చింది. ఈ జన సముద్రానికి, రాయలసీమ గడ్డకు.. ఇక్కడున్న ప్రతి సీమ బిడ్డకు మీ జగన్‌ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తున్నాడు. ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతున్న యుద్ధం. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదు. ఈ ఐదేళ్ల కాలంలో ఇంటింటికీ మనందరి ప్రభుత్వం అందించిన అభివృద్ధి, సంక్షేమం.. పథకాలు కొనసాగాలని అడుగులేస్తున్న మనకు.. వీటన్నింటినీ రద్దు చేయడమే లక్ష్యంగా డ్రామాలు ఆడుతున్న చంద్రబాబు మధ్య జరుగుతున్న ఈ యుద్ధానికి మీరు సిద్ధమేనా?’’ అంటూ పార్టీ శ్రేణులకు జగన్‌ దిశానిర్దేశం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నికల్లో గెలుస్తామనే ధీమా ఉంటే నీకు పొత్తులు ఎందుకయ్యా ? అంటూ బాబును జగన్ ప్రశ్నించారు. ‘సైకిల్ తోయడానికి నీకొక ప్యాకేజీ స్టార్ ఎందుకు? ప్రజలు జగన్ని గుండెల్లో పెట్టుకున్నారని బాబుకి తెలుసు. అందుకే ఆయన గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్. ఈసారి వైసీపీ గెలిస్తే చంద్రముఖి బెడద ఇక ఉండదు. తప్పు చేస్తే చంద్రముఖి గ్లాస్ పట్టుకుని సైకిల్ ఎక్కి ప్రజల రక్తం తాగడానికి వస్తుంది’ అంటూ మండిపడ్డారు.

రాబోయే ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లు గెలుస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ‘పరిపాలనలో ఎక్కడా తగ్గలేదు. ఒక్క MP, MLA సీటు కూడా తగ్గడానికి వీలు లేదన్నారు. ప్రజలు చొక్కా మడతేసి చంద్రబాబుకున్న కుర్చీలను మడిచి 2019లో 23 సీట్లకు పరిమితం చేశారని , మళ్లీ ఇప్పుడు టిడిపిని ఓడించేందుకు చొక్కాలు మడత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారా? రంగు రంగుల మేనిఫెస్టోతో చంద్రబాబు & బ్యాచ్ మళ్లీ ప్రజల్ని మోసం చేసేందుకు వస్తున్నారు. ఆయన వాగ్ధానాలను నమ్మొద్దు. పథకాలు కొనసాగాలంటే వైసీపీని గెలిపించుకోవాలి. కార్యకర్తలు, వాలంటీర్లు ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి’ అని పిలుపునిచ్చారు.

Read Also : BRS Party: తెలంగాణలో ఆ రెండు పార్టీలు ఒక్కటే: మాజీ మంత్రి సింగిరెడ్డి