Income Tax : ఏపీ ప్రభుత్వం ఇన్‌కం ట్యాక్స్ క‌ట్టాలా?

బాగా ఆదాయం వ‌చ్చే వ్యక్తులు, కంపెనీలు ఇన్‌కం ట్యాక్స్ క‌ట్టడం మామూలే. ఒక ప‌రిమితికి మించి ఆదాయం దాటితే నిర్ణీత స్లాబ్ మేర‌కు ఆదాయ‌పు ప‌న్ను చెల్లించ‌డం చ‌ట్టం

  • Written By:
  • Publish Date - February 25, 2022 / 11:13 AM IST

బాగా ఆదాయం వ‌చ్చే వ్యక్తులు, కంపెనీలు ఇన్‌కం ట్యాక్స్ క‌ట్టడం మామూలే. ఒక ప‌రిమితికి మించి ఆదాయం దాటితే నిర్ణీత స్లాబ్ మేర‌కు ఆదాయ‌పు ప‌న్ను చెల్లించ‌డం చ‌ట్టం ప్రకారం త‌ప్పదు. మ‌రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆదాయ‌పు ప‌న్ను చెల్లించాల్సిన ప‌రిస్థితి వ‌స్తుందా? జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.బ్యాంకుల నుంచి అప్పులు తీసుకురావ‌డానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయ‌త్నాలు చేస్తోంది. దీనికోసం బ్యాంకులు ష‌ర‌తులు పెడుతున్నాయి. బ్యాంకు ఆఫ్ బ‌రోడా కూడా ఇలాంటి ష‌ర‌తే పెట్టింది. రాష్ట్రంలో లిక్కర్ ఆదాయాన్ని చూపించి రుణం పొందాల‌ని ప్రభుత్వం భావిస్తోంది. గ‌తంలో ఈ ఆదాయం అంతా ఎక్సైజ్ శాఖ పేరున వ‌చ్చేది. అది నేరుగా ఖ‌జానాలో జ‌మ అయ్యేది. అది ప్రభుత్వం ఆదాయంగా గుర్తింపు పొందేది.

ప్రభుత్వ ఆదాయం అయితే దానిపై ఎలాంటి ఆదాయ‌పు ప‌న్ను భారం ఉండ‌దు. రుణాలు పొంద‌డానికి లిక్కర్ వ్యాపారాన్ని ప్రభుత్వ రంగ సంస్థే అయిన బేవ‌రేజెస్ కార్పొరేష‌న్ పేరిట చేయాల‌ని నిర్ణయించింది. ఇది ప్రభుత్వ సంస్థే అయినా, వ్యాపార సంస్థ కావ‌డంతో రుణాలు తిరిగి వ‌సూలు చేసుకోవ‌డానికి ఇబ్బందులు ఉండ‌బోవ‌ని బ్యాంకులు భావిస్తున్నాయి. అందుకే ఎక్సైజ్ శాఖ ఆదాయాలు, ఆస్తుల‌ను ఈ కార్పొరేష‌న్ పేరున ఉంచాల‌ని బ్యాంకు ఆఫ్ బ‌రోడా ష‌ర‌తు పెట్టింది. బ్యాంక్ ఆఫ్ బరోడా చెప్పినట్టు ఏపీ ప్రభుత్వం చేస్తే.. అది వ్యాపారంగా మారుతుంది. అంటే కచ్చితంగా ఆదాయ‌పు ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. అలా జ‌రిగితే బేవ‌రేజెస్ కార్పొరేష‌న్ 35 శాతం ప‌న్ను చెల్లించ‌క త‌ప్పదు. దీని నుంచి బ‌య‌ట ప‌డాలంటే ప్రభుత్వం చ‌ట్టాన్ని సవ‌రించాల్సి ఉంటుంది. మరిప్పుడు ఏపీ సర్కార్ చట్టాన్ని సవరిస్తుందా.. లేక మరేదైనా మార్గాన్ని చూసుకుంటుందో చూడాలి.