Site icon HashtagU Telugu

Shining Stars Award-2025: రేపు రాష్ట్రవ్యాప్తంగా “షైనింగ్ స్టార్స్ అవార్డ్-2025” ప్రదానం!

Shining Stars Award-2025

Shining Stars Award-2025

Shining Stars Award-2025: పదో తరగతి, ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రోత్సహించడానికి “షైనింగ్ స్టార్స్ అవార్డ్-2025” (Shining Stars Award-2025) పేరిట సత్కరించాలని AP ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 9వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, పార్వతీపురంలో నిర్వహించే కార్యక్రమానికి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరవుతున్నారు. విద్యా వ్యవస్థలో నాణ్యత, ప్రమాణాలు పెంచేందుకు ఈ అవార్డులను ఇవ్వడం జరుగుతోంది.

4,168 మంది విద్యార్థులకు షైనింగ్స్ స్టార్స్ అవార్డ్స్

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యనభ్యసించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 4,168 మంది విద్యార్థులను షైనింగ్స్ స్టార్స్ అవార్డ్స్ పేరుతో రేపు సత్కరించనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ప్రత్యేక అవసరాలు గల పిల్లల కేటగిరీలో వీరిని ఎంపిక చేయడం జరిగింది. అవార్డుకు ఎంపికైన విద్యార్థులకు ప్రతిఒక్కరికి 20,000 నగదు బహుమతి, మెడల్ తో పాటు ప్రశంసా పత్రంతో సన్మానించనున్నారు. రేపు పార్వతీపురం మన్యం జిల్లాలో అత్తుత్తమ ప్రతిభ కనబరిచిన 95 మంది విద్యార్థులు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ అందుకోనున్నారు. వీరిలో 65 మంది బాలికలు కాగా, 30 మంది బాలురు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదోతరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రతిభ కనబర్చిన 47మంది విద్యార్థులకు ఈ ఏడాది మే 20వ తేదీన ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానం చేయడం జరిగింది.

Also Read: Khaleel Ahmed: 4 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు.. అద‌ర‌గొట్టిన ఖ‌లీల్ అహ్మ‌ద్‌!

920 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డ్స్

ఇంటర్మీడియట్ విద్యలో నాణ్యత, నైపుణ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ మేనేజ్‌మెంట్‌ కళాశాలల్లో MPC, BIPC, HEC, CEC, MEC, ఒకేషనల్ విభాగాల్లో అత్యధిక మార్కులు సాధించిన 920మంది విద్యార్థులను షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ 2025కి ఎంపికచేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, ఓసీ, పిహెచ్ విభాగాల నుండి అవార్డు గ్రహీతలను ఎంపిక చేశారు. ప్రతి అవార్డు గ్రహీతకు పతకం, 20,000 నగదు బహుమతి, సర్టిఫికెట్‌తో సత్కరించనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 15వతేదీన రాష్ట్రస్థాయి ప్రతిభ కనబర్చిన 52మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులను మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసంలో సత్కరించారు.

ఇంటర్మీడియట్ లో విప్లవాత్మక సంస్కరణలు

రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి నారా లోకేష్ దాదాపు దశాబ్ధం తర్వాత ఇంటర్మీడియట్ విద్యలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారు. ఫలితంగా గత పదేళ్లలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కార్యక్రమం కింద ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు అందజేశారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు జనవరి 4వతేదీనుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేశారు. అయిదేళ్ల తర్వాత 217మందికి అధ్యాపకులకు ప్రిన్సిపాల్స్ గా పదోన్నతులు కల్పించారు. గత ఏడాది అక్టోబర్ నుంచి కేంద్రీకృత మూల్యాంకన విధానాన్ని ప్రారంభించారు. ఇంటర్నల్ పరీక్షల ఫలితాలను, అధ్యాపకుల పనితీరును నెలవారీగా సమీక్ష చేస్తూ మెరుగుదలకు సూచనలు ఇస్తున్నారు. జూనియర్ కళాశాలల సమయాలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటలవరకు మార్పుచేశారు.

వెనుకబడిన విద్యార్థుల కోసం 100రోజుల ప్రణాళిక

విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి ఏ,బీ,సీ కేటగిరిలుగా విభజించి 100రోజుల ప్రణాళికను విజయవంతంగా అమలుచేశారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక స్టడీ మెటీరియల్ ను రూపొందించి అందజేశారు. ఏడాదిలో 3సార్లు పేరెంట్-టీచర్స్ సమావేశాలు నిర్వహించి విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను అందజేశారు. విద్యార్థుల పనితీరుపై తల్లిదండ్రులకు తెలియజేసేందుకు తరగతుల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేశారు. వెనుకబడిన విద్యార్థుల కోసం కేర్ టేకర్ వ్యవస్థను ఏర్పాటుచేశారు.

దీనిద్వారా ప్రతి జూనియర్ లెక్చరర్ కనీసం 10మంది విద్యార్థులను దత్తత తీసుకుని ఫలితాలను మెరుగుపర్చే బాధ్యత అప్పగించారు. 2025-26 విద్యాసంవత్సరం నుంచి పోటీపరీక్షల మెటీరియల్ పుస్తకాలను ఉచితంగా అందజేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజిల్లో ఎంపిసి, బైపిసి స్ట్రీమ్ విద్యార్థులకోసం పోటీపరీక్షలకు కోచింగ్ కూడా ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి కరిక్యులమ్ లో మార్పులు తెచ్చారు. అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతికతలకు అనుగుణంగా కొత్త పాఠ్యాంశాలు, పరీక్షా విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలను తీర్చిదిద్దేందుకు దాదాపు దశాబ్ధం తర్వాత మంత్రి లోకేష్ చేపడుతున్న సంస్కరణలను సత్ఫలితాలను ఇస్తున్నాయి.