ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Jagan) కూటమి ప్రభుత్వంపై దాడులు ప్రారంభిస్తే, మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Sharimla) కూడా బరిలోకి దిగుతున్నారు. జగన్ డిజిటల్ బుక్ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టే వ్యూహాన్ని అవలంబిస్తుండగా, షర్మిల మాత్రం కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను విస్మరిస్తోందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై చర్చ మొదలైంది.
Bathukamma Kunta : నేడు బతుకమ్మ కుంటను ప్రారంభించనున్న సీఎం
రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ షర్మిల కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రత్యేకంగా యూరియా కొరత సమస్యను ఎత్తిచూపుతూ, రైతులకు సకాలంలో ఎరువులు అందించకపోవడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. యూరియా కొరతను సమర్థించుకునేందుకు ప్రభుత్వం చెబుతున్న కారణాలు అన్నీ కుంటి సాకులేనని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమమే తమ అజెండా అని చెప్పుకునే ప్రభుత్వం, అసలు రైతులకు అవసరమైన మద్దతు ఇవ్వడంలో విఫలమైందని ఆమె మండిపడ్డారు.
శుక్రవారం విజయవాడలో జరిగే “రైతన్నకు అండగా కాంగ్రెస్” కార్యక్రమం అనంతరం షర్మిల, కాంగ్రెస్ నేతలతో కలిసి సీఎం చంద్రబాబును కలవాలని భావిస్తున్నారు. రైతుల సమస్యలపై వినతి పత్రం అందజేయాలని ఆమె నిర్ణయించగా, ఈ భేటీ జరిగేనా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయినప్పటికీ, షర్మిల చంద్రబాబుతో సమావేశమవుతారని వార్తలు రావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా యూరియా కొరత, పంటల సంక్షోభంపై ఆమె చేసే చర్చకు సీఎం ఎలా స్పందిస్తారన్నది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.