ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి మరింత పెరుగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Sharmila) మాజీ సీఎం , వైసీపీ అధినేత , తన అన్న వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ కు ప్రజల గురించి కాకుండా రాజకీయ లాభమే ప్రధానమని ఆమె ఆరోపించారు. “స్వార్థ రాజకీయాల్లో జగన్ నెంబర్ వన్. బీజేపీపై పోరాటం చేయాలంటే వైసీపీకి చిత్తశుద్ధి ఉండాలి. కానీ జగన్ బీజేపీకి ఏమీ అనడం లేదు. రాష్ట్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలబడే శక్తి కాంగ్రెస్‌దే. పిల్లకాలువలు అన్నీ కాంగ్రెస్ అనే మహాసముద్రంలో కలవాల్సిందే” అని షర్మిల వ్యాఖ్యానించారు.
Jagannath Rath Yatra : పూరీలో వైభవంగా జగన్నాథుడి రథయాత్ర
అలాగే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలపై కూడా షర్మిల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. “సూపర్ ఫ్లాప్” అంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకంలో 93 లక్షల మంది రైతులలో 47 లక్షల మందికే లబ్ధి చేకూరిందని ఆరోపించారు. మిగతా 43 లక్షల మంది రైతులకు అన్యాయం చేశారని విమర్శించారు. అదే విధంగా విద్యార్థులకు తల్లికి వందనం, మహిళల మహాశక్తి పథకాలు కూడా కేవలం హామీలకే పరిమితమయ్యాయని, అమలులో పూర్తిగా విఫలమయ్యాయని ఆమె మండిపడ్డారు. ఎన్నికల ముందు లింకులు పెడతామన్న పథకాలు కూడా ఇప్పటివరకు అమలుకాకపోవడం దురదృష్టకరమని అన్నారు.
అలాగే రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న అన్యాయంపై షర్మిల తీవ్ర స్థాయిలో స్పందించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల మౌలిక ప్రయోజనాలు దెబ్బతింటాయని, 41 మీటర్ల ఎత్తుతో అది ప్రాజెక్టు కాదని, కేవలం బ్యారేజ్ మాత్రమేనని అన్నారు. కేంద్రం విభజన హామీలను విస్మరిస్తున్నా, రాష్ట్రంలోని ఎంపీలు పాక్షికంగా, రాజకీయ అవసరాలకే మౌనంగా ఉన్నారని విమర్శించారు. బాబు, పవన్, జగన్‌లు బీజేపీకి గులాములుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఆమె, రాష్ట్రానికి నిజమైన ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాడగలదని, ఇందుకోసం తాము బలంగా ప్రజలతో మమేకం అవుతున్నామని షర్మిల స్పష్టం చేశారు.