Harsha Kumar : సడెన్‌గా ఏపీ కాంగ్రెస్ పగ్గాలను వైఎస్ షర్మిల చేపట్టడంపై కొందరు పార్టీ లీడర్లు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో కొందరు నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. షర్మిలకు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలు ఇవ్వడాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న హర్షకుమార్ కూడా ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారట. షర్మిల వెంట నడుస్తామని ఓ వైపు నుంచి ఆయన అంటున్నా.. మరోవైపు నుంచి తన దారిని తాను చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర విభజన తరువాత పదేళ్లుగా పార్టీలోనే ఉన్నా ఎలాంటి గుర్తింపు దక్కలేదనే భావనలో హర్షకుమార్ ఉన్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అకస్మాత్తుగా వచ్చిన వారికి కాంగ్రెస్‌లో పెద్దపీట వేసే ట్రెండ్ సీనియర్ల అవకాశాలను గల్లంతు చేస్తోందని అంటున్నారు. హర్షకుమార్ రాజమండ్రిలో వచ్చేనెల 8న భారీ ఎత్తున దళిత సింహ గర్జన సభ జరుపనున్నారు. దానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని దళితులు, హర్ష కుమార్ అభిమానులు(Harsha Kumar) హాజరవుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి మొదటి నుంచీ హర్ష కుమార్‌తో సఖ్యత ఉండేది కాదు. హర్ష కుమార్‌కు సీటు ఇవ్వకూడదని వైఎస్సార్ అడ్డుపడినా హర్ష మాత్రం డైరెక్ట్ హై కమాండ్‌తో టచ్‌లో ఉండేవారు. చివరకు రాజశేఖరరెడ్డి మాటను కాదని సైతం హర్ష కుమార్‌కు పార్టీ ఎంపీ సీటును ఇచ్చింది. అమలాపురం తనకు కొత్త నియోజక వర్గమైనా.. వైఎస్సార్ సహకారం లేకపోయినా హర్ష కుమార్ ఒకటికి రెండుసార్లు గెలిచారు. గతంలో ఏపీ పీసీసీ చీఫ్ పదవిని ఆశించిన హర్ష కుమార్.. అది కాస్త గిడుగు రుద్రరాజుకు ఇచ్చి తనను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌ను చేయడంతో నిరాశకు గురయ్యారు. తనకే పదవీ వద్దని దళితులకు ఎప్పుడూ అన్యాయం జరుగుతూనే ఉందని చెప్పి సామాన్య కార్యకర్తగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. అప్పటి నుంచే కాంగ్రెస్ నుంచి బయటకు రావాలనే ఆలోచనతో హర్ష కుమార్ ఉన్నారట.
అమలాపురం ఎంపీ టికెట్ ఆఫర్ చేసిన టీడీపీ
అమలాపురంలో ఎంపీగా పోటీ చెయ్యడానికి హర్ష కుమార్ అయితే బెటర్ అనే ఆలోచనలో టీడీపీ ఉందట. హర్ష కుమార్ కోరింది కూడా అదే కావడంతో హర్ష కుమార్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడం లాంఛనమే అని చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీతో హర్ష కుమార్ చర్చలు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 8న రాజమండ్రిలో జరిగే దళిత సింహ గర్జన సభ వేదికగా ఈ విషయాన్ని హర్ష కుమార్ ప్రకటిస్తారని అంటున్నారు.