Nara Lokesh: లోకేష్ `షాడో టీమ్స్` ప‌క్కా స్కెచ్!

`రోడ్ మీకు వ‌స్తా, ఎవ‌ర్నీ వ‌ద‌ల‌ను..` అంటూ లోకేష్ చేసిన హెచ్చ‌రిక టీడీపీ శ్రేణుల్ని ఉత్సాహ‌ప‌రుస్తోంది. ఇటీవ‌ల ఆయ‌న చేసిన ట్వీట్లు, ప్ర‌సంగం నూత‌నోత్సాహాన్ని నింపుతోంది. ఆయ‌న మీద జ‌గ‌న్ స‌ర్కార్ ఎక్కువ‌గా ఫోక‌స్ చేయ‌డంతో అమాంతం లోకేష్ క్రేజ్ పెరుగుతోంది.

  • Written By:
  • Updated On - June 26, 2022 / 10:36 AM IST

`రోడ్ మీకు వ‌స్తా, ఎవ‌ర్నీ వ‌ద‌ల‌ను..` అంటూ లోకేష్ చేసిన హెచ్చ‌రిక టీడీపీ శ్రేణుల్ని ఉత్సాహ‌ప‌రుస్తోంది. ఇటీవ‌ల ఆయ‌న చేసిన ట్వీట్లు, ప్ర‌సంగం నూత‌నోత్సాహాన్ని నింపుతోంది. ఆయ‌న మీద జ‌గ‌న్ స‌ర్కార్ ఎక్కువ‌గా ఫోక‌స్ చేయ‌డంతో అమాంతం లోకేష్ క్రేజ్ పెరుగుతోంది. ఇప్ప‌టికే ప‌లు కేసుల‌ను ఏపీ పోలీసులు లోకేష్ మీద పెట్టారు. కానీ, భ‌యం అనేది `బయోడేటా`లో లేదంటూ ఆయ‌న చేసిన కామెంట్ క్యాడ‌ర్ ను దూకుడుగా ముందుకు క‌ద‌ప‌డానికి బాగా ప‌నిచేస్తోంది.

ప్ర‌జా క్షేత్రంలో కంటే తెర వెనుక లోకేష్ టీమ్ చేస్తోన్న గ్రౌండ్ వ‌ర్క్ బాగా ప‌నిచేస్తోంద‌ని టీడీపీ వ‌ర్గాల్లోని టాక్‌. ఇటీవ‌ల చంద్ర‌బాబునాయుడు చేసిన ప‌ర్య‌ట‌న‌లు హిట్ కావ‌డం వెనుక లోకేష్ వ్యూహం ఉంద‌ట‌. వారానికి ఒక జిల్లాకు వెళుతోన్న బాబు తొలి రోజు మినీ మ‌హానాడు బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హిస్తున్నారు. రెండో రోజు పార్టీ స‌మ‌న్వ‌య క‌ర్త‌లు, నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిలు, ఇత‌ర లీడ‌ర్ల‌తో స‌మావేశం అవుతున్నారు. అంత‌ర్గ‌త గ్రూపుల‌ను స‌రిదిద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక మూడో రోజు రోడ్ షోల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఆ సంద‌ర్భంగా త‌ర‌లి వ‌స్తోన్న జ‌నాన్ని చూస్తే లోకేష్ వ్యూహాలు ఎలా ఫ‌లిస్తున్నాయో తెలుస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లు ముగిసిన త‌రువాత క్షేత్ర‌స్థాయిలోకి లోకేష్ దిగ‌బోతున్నారు. ఆ విష‌యాన్ని సూచాయ‌గా త్వ‌ర‌లో `రోడ్ మీద‌కు వ‌స్తా..` అంటూ ప‌ల్నాడుకు వెళ్లిన సంద‌ర్భంగా వెల్ల‌డించారు. గ‌తంలోనూ ప‌ల్నాడు వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించిన సంద‌ర్భంగా భారీగా పోలీసులు మోహ‌రించారు. అత్యాచారం, హ‌త్య జ‌రిగిన సంఘ‌ట‌న నేప‌థ్యంలో బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించాల‌ని అప్ప‌ట్లో లోకేష్ భావించారు. ఆ మేర‌కు ఆయ‌న వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించిన సంద‌ర్భంగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయ‌న క్రేజ్ అమాంతం పెరిగింది. అంతేకాదు, ఆయ‌న ఎక్క‌డ‌కు వెళ్లిన‌ప్ప‌టికీ వైసీపీ నేత‌లు అప్ర‌మ‌త్తం కావ‌డం చూస్తుంటే, లోకేష్ త‌న ల‌క్ష్యానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఒక‌ప్పుడు ఆయ‌న్ను వైసీపీ పెద్ద‌గా ప‌ట్టించుకునేది కాదు. ఇప్పుడు ప‌రిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ప్ర‌ధాన టార్గెట్ గా లోకేష్ ను చేస్తున్నారు. ప్ర‌తిగా ఆయ‌న కూడా పదునైన ప‌ద‌జాలంతో స‌మాధానం చెబుతున్నారు. మండ‌లిలోనూ ఆయ‌న ప్ర‌సంగం ప‌దును తేలింది. అందుకే, ప్ర‌జా క్షేత్రంలోకి రావ‌డానికి స‌న్న‌ద్ధం అవుతున్నారు. ఆయ‌న టీమ్ ప్రధానంగా టీడీపీ ని ప్ర‌స్తుతం న‌డిపిస్తోంది. పైకి చంద్ర‌బాబునాయుడు నాయ‌క‌త్వం కనిపిస్తున్న‌ప్ప‌టికీ ఎవ‌రైనా స‌రే,
లోకేష్ ద్వారా మాత్ర‌మే వెళ్లాల్సిన ప‌రిస్థితి టీడీపీలో దాదాపుగా వ‌చ్చింది. ఆ విష‌యాన్ని సీనియ‌ర్ల ఎవ‌రైనా చెబుతారు. పైగా ఆయ‌న‌కు సంబంధించిన టీమ్స్ ర‌హ‌స్యంగా ప‌నిచేస్తున్నాయి. కొన్ని టీమ్ లు మాత్ర‌మే పార్టీ వ‌ర్గాల‌కు తెలుసు. మ‌రికొన్ని టీమ్ లు ఇత‌ర రాష్ట్రాల్లో ఉంటూ ఏపీకి సంబంధించిన స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు లోకేష్ కు చేర‌వేస్తున్నార‌ని తెలుస్తోంది.

చెన్నై, బెంగుళూరు కేంద్రంగా కొన్ని షాడో టీమ్ లు లోకేష్ కోసం ప‌నిచేస్తున్నాయ‌ని స‌మాచారం. మ‌రికొన్ని ఏపీలోనే ఉంటూ మండ‌లాలు, గ్రామాల వారీగా లీడ‌ర్ల ప‌నితీరును గ‌మ‌నిస్తున్నాయ‌ని తెలుస్తోంది. ఎప్ప‌టికప్పుడు సంస్థాగ‌త బ‌లాన్ని అంచ‌నా వేసుంటూ క్యాడ‌ర్ ను ముందుకు న‌డిపిస్తున్నారు లోకేష్‌. పార్టీ ఇచ్చిన పిలుపు మేర‌కు కార్య‌క్ర‌మాల‌ను ఎవ‌రెవ‌రు చేస్తున్నారు? కోవ‌ర్టులుగా ఎవ‌రు ప‌నిచేస్తున్నారు? ప్ర‌జ‌ల్లో ప‌లుకుబ‌డి ఉన్న లీడ‌ర్లు ఎవ‌రు? త‌దిత‌ర అంశాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స్థానికంగా ఉండే లోకేష్ టీమ్ లు ప‌క్కా స‌మాచారాన్ని చేర‌వేస్తున్నార‌ట‌. అందుకే, ఒంగోలు మ‌హానాడు నుంచి మినీ మ‌హానాడుల వ‌ర‌కు అనూహ్యంగా హిట్ కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా టీడీపీలోని అంత‌ర్గ‌త వ‌ర్గాల్లోని చ‌ర్చ‌.

ఇక లోకేష్ పాద‌యాత్ర‌కు కూడా ప‌క్కా ప్లాన్ రెడీ అయింద‌ని తెలుస్తోంది. గాంధీ జ‌యంతి త‌రువాత ఏ రోజైనా లోకేష్ పాద‌యాత్ర ఉంటుంద‌ని స‌మాచారం. తిరుప‌తి టూ ఇచ్చాపురం లేదా ఇచ్ఛాపురం టూ తిరుప‌తి ఆయ‌న పాద‌యాత్ర ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. చంద్ర‌బాబు, జ‌గ‌న్ చేసిన పాద‌యాత్ర‌ల‌కు భిన్నంగా లోకేష్ యాత్ర‌ను డిజైన్ చేసిన‌ట్టు వినికిడి. మొత్తం మీద లోకేష్ రోడ్డెక్క‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అదే విష‌యాన్ని ప‌ల్నాడు వేదిక‌గా ఆయ‌న వెల్ల‌డించ‌డంతో టీడీపీ క్యాడ‌ర్ ఉత్కంఠ‌గా చూస్తోంది.