Windstorm : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లో తుఫాను(ఫెంగల్)గా మారనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు కారైకాల్-మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందంది. దీని ప్రభావంతో ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. కోస్తాలో 55-75Kmph వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కృష్ణపట్నం, నిజాంపట్నం వద్ద మూడో నంబర్, మిగిలిన పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.
శుక్ర, శనివారాల్లో తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని అక్కడక్కడ కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మిగిలిన చోట్ల ఆదివారం వరకూ విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నారు.
తుపాను రెండు రోజుల్లో ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంక తీరాన్ని తాకి, తమిళనాడులోని కడలూరు జిల్లా పరంగిపేట్టై, చెన్నై మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ తుపానుకు సౌదీ అరేబియా సూచించిన ‘ఫెన్‌గల్’గా పేరు పెట్టనున్నారు. తుపాను ప్రభావంతో నేటి నుంచి శనివారం వరకు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది.