Loan App Harassment : రాజమండ్రి లోన్ యాప్ వేధింపుల కేసులో ఏడుగురు అరెస్ట్‌

  • Written By:
  • Publish Date - September 13, 2022 / 10:21 AM IST

లోన్ యాప్ ద్వారా దంపతులను వేధిస్తున్న ఘటనలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో లోన్ యాప్ బాధితుల సంఖ్య పెరుగుతుండటంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించి లోన్ యాప్స్ తో వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నెల ఏడో తేదీన రాజమహేంద్రవరానికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేసి వారం రోజుల్లో నిందితులను అరెస్ట్ చేశారు.

సోమవారం స్థానిక దిశ పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి మీడియాకు వివరాలు తెలిపారు. భార్యాభర్తల ఆత్మహత్యకు కారణమైన హ్యాండీ లోన్, స్పీడ్ లోన్ యాప్‌లపై పోలీసులు ఆరా తీశారు. ఈ క్రమంలో మూడు పోలీసు బృందాలు పనిచేసి యాప్‌లకు మధ్యవర్తులు, రుణం తీసుకునే వారిని గుర్తించారు. నిందితులను గండిపేట మండలం మణికొండకు చెందిన లంబాడి నరేష్‌, మియాపూర్‌కు చెందిన కొల్లూరు శ్రీనివాస్‌ యాదవ్‌, కాకినాడ జిల్లా తిమ్మాపురంకు చెందిన మాడిశెట్టి పృథ్వీరాజ్‌, ఏలేశ్వరానికి చెందిన నక్కా సుమంత్‌, అన్నవరానికి చెందిన మంద వీరవెంకట హరిబాబు, విశాఖ జిల్లా కేకే అగ్రహారానికి చెందిన కొరుపోలుత రామకృష్ణ, అనకాపల్లి సమీపంలోని సిరసపల్లికి చెందిన దాన‌బోయిన నిష్కర్ ల‌ను నిందితులుగా పోలీసులు గుర్తించారు. వారి బ్యాంకు ఖాతాలను పరిశీలించగా.. బ్యాంకు అధికారులకు అనుమానం రాకుండా నిందితులు ప్రతి నెలా వేర్వేరు ఖాతాలు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని యాప్ నిర్వాహకుల సమాచారం కూడా పోలీసులకు అందడంతో.. ఆ కోణంలో కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.