Site icon HashtagU Telugu

Red Sanders Kingpins: ఎర్రచందనం మాఫియా దర్యాప్తుపై సీనియర్ జర్నలిస్ట్‌కు పవన్ కళ్యాణ్ ప్రశంసలు!

Red Sanders Kingpins

Red Sanders Kingpins

Red Sanders Kingpins: ఎర్రచందనం అక్రమ రవాణాపై (Red Sanders Kingpins) సీనియర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సుధాకర్‌రెడ్డి ఉదుముల చేసిన సుదీర్ఘ, ప్రమాదకర దర్యాప్తును ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా అభినందించారు. ఉదుముల రచించిన ‘బ్లడ్ సాండర్స్: ది గ్రేట్ ఫారెస్ట్ హైస్ట్’ పుస్తకం ఆధారంగా రూపొందించిన ‘ప్లానెట్ కిల్లర్స్’ డాక్యుమెంటరీ, ప్రజలకు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునేలా చేసిందని ఉపముఖ్యమంత్రి కొనియాడారు.

“ప్రమాదకర పరిస్థితుల్లో చేసిన శ్రమ”

పవన్ కళ్యాణ్ తన ఎక్స్ (X) ఖాతాలో ఉదుముల కృషిని ప్రశంసిస్తూ ఇలా రాశారు. “మీరు ఎదుర్కొన్న ప్రమాదాలన్నిటినీ లెక్కచేయకుండా ఎంతో శ్రద్ధగా చేసిన ఈ పనికి నా హృదయపూర్వక అభినందనలు. ఈ వాస్తవాలను ప్రజలు తప్పక తెలుసుకోవాలి. ఎర్రచందనం అక్రమ రవాణాపై చర్చించేందుకు ఏర్పాటు చేయబోయే రౌండ్‌టేబుల్ సమావేశానికి మిమ్మల్ని త్వరలో ఆహ్వానిస్తాం” అని పేర్కొన్నారు. డాక్యుమెంటరీలో ఎర్రచందనం చెట్ల నరికివేత, రవాణా, అక్రమ ఎగుమతి పద్ధతులను స్పష్టంగా చూపించారని ఆయన పేర్కొన్నారు. శేషాచలం అడవి విధ్వంసం, అంతర్జాతీయ స్థాయిలో పనిచేసే నెట్‌వర్క్‌లు, అలాగే అమాయక అటవీ సిబ్బంది ప్రాణ నష్టాన్ని ఈ చిత్రం వెలుగులోకి తీసుకువచ్చిందని ఆయన తెలిపారు.

Also Read: Hyderabad : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 16 రైళ్లకు ఆ స్టేషన్లో హాల్టింగ్!

రాజకీయ అండపై పవన్ హెచ్చరిక

రాజకీయ అండతో నడుస్తున్న అక్రమ నెట్‌వర్క్‌ల పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరిక చేశారు. రాజకీయ వేషధారణలో తిరిగే క్రిమినల్స్ అత్యంత ప్రమాదకరంగా మారారు. వీరు స్మగ్లర్లతో కలిసి నడుస్తూ తమ రాజకీయ ప్రయోజనాలకు ఇంధనంగా ఎర్రచందనం అక్రమ రవాణాను వాడుకున్నారని హెచ్చ‌రించారు.

పుస్తకం నుండి డాక్యుమెంటరీ వరకు

‘ప్లానెట్ కిల్లర్స్’ డాక్యుమెంటరీ సుధాకర్‌రెడ్డి ఉదుముల దశాబ్దాల పాటు చేసిన రిపోర్టింగ్, డాక్యుమెంటేషన్, ఫీల్డ్‌వర్క్‌పై ఆధారపడింది. ఆయన పుస్తకాన్ని అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ విడుదల చేశారు. మార్టిన్ బౌడోట్ నిర్మాణంలో హ్యూగో వాన్ ఆఫెల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. స్మగ్లింగ్ దర్యాప్తు మార్గాన్ని పలు కీలక ప్రాంతాల్లో అనుసరించింది.

దారితప్పించే అటవీ మార్గాల్లో ప్రమాదకరమైన ట్రెక్కింగ్‌లు చేసి, చెక్క కూలీలు, స్మగ్లర్లు, అటవీ అధికారులు, పోలీసులతో ఉదుముల చేసిన ఇంటర్వ్యూలు ఈ దర్యాప్తుకు ప్రధాన బలం. చెన్నైలో కీలక నిందితుడు గంగిరెడ్డితో కూడా ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ప్రశంసలపై స్పందించిన సుధాకర్‌రెడ్డి ఉదుముల కృతజ్ఞతలు తెలుపుతూ ఇలా అన్నారు. ఈ పనిని గుర్తించినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. రెడ్ సాండర్స్ రక్షణపై మరింత సంస్థాగత చర్యలు తీసుకునే చర్చలు దీని ద్వారా ముందుకు సాగుతాయని నేను ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఈ ప్రకటనతో ఎర్రచందనం మాఫియా బెడద, అంతర్రాష్ట్ర స్థాయిలో పర్యావరణ పరిరక్షణ చర్యల ఆవశ్యకత మరోసారి ప్రజల్లోకి వచ్చింది.

Exit mobile version