Parchuru : ప‌ర్చూరుపై సెంటిమెంట్ ప‌డ‌గ‌

సెంటిమెంట్ కు ప్రాధాన్యం ఇచ్చే వాళ్లు ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డం క‌ష్ట‌మంటారు చాణ‌క్యుడు. అందుకే, టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు సెంటిమెంట్ల‌ను ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌రు.

  • Written By:
  • Updated On - September 30, 2022 / 01:43 PM IST

సెంటిమెంట్ కు ప్రాధాన్యం ఇచ్చే వాళ్లు ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డం క‌ష్ట‌మంటారు చాణ‌క్యుడు. అందుకే, టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు సెంటిమెంట్ల‌ను ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌రు. ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డానికి బంధుత్వాలు, స్నేహాల‌ను ప‌క్క‌న‌పెడ‌తార‌ని ఆయ‌న కోర్ టీమ్ కు బాగా తెలుసు. ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష స‌మావేశాల్లోనూ చంద్ర‌బాబు సెంటిమెంట్ల‌ను ప‌క్క‌న‌ప‌డేసి గెలుపు గుర్రాల‌ను ఎంచుకుంటున్నారట‌. అందుకే, ప్ర‌కాశం జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గాన్ని ద‌గ్గుబాటి కుటుంబానికి కేటాయిస్తార‌న్న ప్ర‌చారానికి చెక్ పెడుతూ ప్ర‌స్తుతం ఇంచార్జిగా ఉన్న కొండ‌య్య‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలుస్తోంది.

కుమారుడి భ‌విష్య‌త్ కోసం 2019 ఎన్నిక‌లకు దూరంగా ఉండాల‌ని ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు అనుకున్నారు. కానీ, ద్వంద్వ పౌర‌స‌త్వం కార‌ణంగా ఆయ‌న కుమారుడు హితేష్‌ బ‌దులుగా ప‌ర్చూరు నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌రిలోకి దిగి ఓడిపోయారు. అప్ప‌టి నుంచి ఆ పార్టీకి దూరంగా ఉంటూ ఇటీవ‌ల టీడీపీ వైపు అడుగులు వేశార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా హితేష్ చెంచురామ్ ను బ‌రిలోకి దింపాల‌ని యోచిస్తున్నారు. కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు అక్క‌డ ఉన్నారు. ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టి ఈసారి టీడీపీ త‌ర‌పున హితేష్ కు టిక్కెట్ ఇస్తార‌ని టాక్ న‌డుస్తోంది.

సిట్టింగ్ లు అంద‌రికీ టిక్కెట్లు ఇస్తాన‌ని ఇటీవ‌ల చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఆ క్ర‌మంలో ద‌గ్గుబాటి కుమారుడు హితేష్ కు చీరాల నియెజ‌క‌వ‌ర్గం టిక్కెట్ ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, రెండు రోజుల క్రితం జ‌రిగిన నియోజ‌క‌వ‌ర్గ స‌మీక్ష‌లో చీరాల‌కు ఇంచార్జిగా ఉన్న కొండ‌య్య‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. దీంతో చీరాల టిక్కెట్ ద‌గ్గుబాటి కుటుంబానికి లేద‌ని స్ప‌ష్టం అవుతోంది. ఇలాంటి ప‌రిణామాల న‌డుమ ద‌గ్గుబాటి హితేష్ ప‌ర్చూరు మీద ఆశ‌లు పెట్టుకున్నారు. సిట్టింగ్ ల‌ను కాద‌ని ద‌గ్గుబాటి కుమారుడు హితేష్ కోసం సెంటిమెంట్ దిశ‌గా నిర్ణ‌యం తీసుకుంటారా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావును ప‌క్క‌న పెడితే మిన‌హా ద‌గ్గుబాటి టీడీపీలో చేరే అవ‌కాశంలేద‌ని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలోని టాక్‌. అంతేకాదు, వ‌రుస‌గా మూడుసార్లు ఎవ‌రూ ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఒకే పార్టీ త‌ర‌పున గెలువ‌లేదు. ఇలాంటి సెంటిమెంట్ల న‌డుమ చివ‌రి నిమిషంలో ఏమి జ‌రుగుతుందో చూడాలి.